కోయకుండానే కన్నీళ్లు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కోయకుండానే కన్నీళ్లు

రూ.70కి చేరువలో కిలో ఉల్లి ధర
కాకినాడలో గరిష్ఠంగా కిలో రూ.90
వర్షాలతో భారీగా తగ్గిన నిల్వలు

ఈనాడు, అమరావతి: ఉల్లి ధరలు వినియోగదారుల కంటనీరు తెప్పిస్తున్నాయి. జులై మొదట్లో కిలో రూ.15 చొప్పున ఉన్న ధర మూడు నెలల్లో.. మూడున్నర రెట్లు పెరిగింది. రాష్ట్రంలో సోమవారం సగటు ధర కిలో రూ.69(నాణ్యమైన రకం) వరకు చేరింది. కాకినాడలో గరిష్ఠంగా కిలో రూ.90 పలుకుతోంది. మార్కాపురంలో అత్యల్పంగా రూ.46 చొప్పున ఉంది. పలు ప్రాంతాల్లో రెండో శ్రేణి ఉల్లి ధర కూడా కిలో రూ.56 చొప్పున విక్రయిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతినడం, ఉన్న కొద్దిపాటి పంట సైతం కుళ్లిపోవడంతో ఉల్లి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఉల్లి దెబ్బతింది. దీంతో మార్కెట్‌కు వచ్చే సరకు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి.
అప్పుడు పంట ఉన్నా.. కొనేవారు కరవై
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉల్లి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది జులై, ఆగస్టులో కొత్త పంట చేతికొచ్చింది. మార్కెట్లు మూతపడి, కొనేవారు లేక రైతులు నష్టపోయారు. మరోవైపు భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఖర్చులు కూడా వచ్చేలా లేదని కొందరు పొలంలోనే వదిలేయగా మరికొందరు పారబోశారు. సాగు విస్తీర్ణంలో 90% వరకు పంట మార్కెట్‌కు రాలేదు. సగటున ఎకరాకు రూ.60వేల వరకు రైతులు నష్టపోయారు.
వర్షాలకు కుళ్లిపోతున్న ఉల్లి
ఆగస్టు నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. లాక్‌డౌన్‌ సమయంలో కొందరు గోదాముల్లో నిల్వ చేశారు. గ్రేడింగ్‌ లేకుండా పెట్టడంతో.. అందులో అధిక భాగం కుళ్లిపోయింది.  
* మహారాష్ట్రలో ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మాలంటే తరుగు శాతం, రవాణా, వ్యాపారుల లాభం తదితరాలు కలిపి కొందరు రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు.

* సాధారణంగా ఈ సమయంలో కర్నూలు నుంచి రోజుకు 200 లారీల వరకు ఉల్లి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది 50 నుంచి 60 లారీలు కూడా రావడం లేదు.
* తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 15 లారీలు కూడా రావడం లేదు. సోమవారం క్వింటాలు రూ.4,500 నుంచి రూ.5,800 వరకు పలికింది. దీన్ని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలకు ఎగుమతి చేస్తారు.
* కొత్త పంట వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు