పండగలకు ‘రద్దీ’ రైళ్లే!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పండగలకు ‘రద్దీ’ రైళ్లే!

ఇప్పటికే నిండిపోయిన సీట్లు
 ముందుగా చెప్పక.. కొన్ని రైళ్లు ఖాళీ

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే-రైల్వేస్టేషన్‌:  తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలను ఇంకా పునరుద్ధరించకపోవడం, ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు మోతెక్కుతుండటంతో ప్రజలు రైళ్లవైపు చూస్తున్నారు. పండగల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రయాణాలకు సిద్ధపడటంతో రైళ్లన్నీ నిండిపోతున్నాయి. ఏ రైలు చూసినా వెయిటింగ్‌ లిస్టే కనపడుతోంది. నెల క్రితం విశాఖ రైల్వేస్టేషన్‌కు రోజూ ఐదు రైళ్లు వచ్చివెళ్లేవి. ఇప్పుడా సంఖ్య 20కి పైగా పెరిగింది. రాబోయే రోజుల్లో పండగ రైళ్లతో రైల్వేస్టేషన్లూ కిటకిటలాడనున్నాయి. ఇదే సమయంలో వాల్తేరు డివిజన్‌ మంచి అవకాశం కోల్పోయింది. దసరాకు చాలా ముందునుంచి నడపాల్సిన ప్రత్యేకరైళ్లను కేవలం దసరాకు రెండు, మూడురోజుల ముందునుంచి నడుపుతున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌ మార్గాల్లో పండక్కిముందు అన్నింటిలోనూ వెయిటింగ్‌లిస్టు నడుస్తోంది.
రోజూ రూ.20 లక్షలు
గతంలో వాల్తేరు డివిజన్‌ ప్రయాణికుల నుంచి ఆదాయం రోజుకు రూ.5 లక్షలు మాత్రమే. ఇప్పుడది రూ.20 లక్షలకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దసరా, దీపావళి రద్దీయే ఇందుకు కారణం.గతంలో రోజూ 2వేల మంది ఈ డివిజన్‌లో రాకపోకలు సాగించేవారు. ఇప్పుడా సంఖ్య 9 వేలకు చేరువకానుంది. రాబోయే 40 రోజుల్లో వాల్తేరు డివిజన్‌ రూ.8 కోట్ల ఆదాయాన్ని ప్రయాణికుల ద్వారా గడించొచ్చని చెబుతున్నారు.
* విశాఖ నుంచి ఒక వారంలో నడిచే ప్రత్యేకరైళ్లు: 58

* విశాఖ నుంచి హైదరాబాద్‌ వైపు 25, 26 తేదీల్లో 4 రైళ్లుంటే..అన్నీ నిండిపోయాయి. చెన్నై మార్గంలో ఉండే ఒక్క రైలులోనూ, బెంగళూరువైపు 3 రైళ్లలోనూ విశాఖ నుంచి పండగ తర్వాత వెళ్లడానికి సీట్లు లేవు.
క్లోన్‌ రైళ్లెక్కడ
తీవ్ర డిమాండ్‌ ఉన్న రైళ్లకు కాస్త ముందుగా నడిపే రైళ్లను ‘క్లోన్‌ రైళ్లు’ అంటారు. హైదరాబాద్‌-విశాఖ మధ్య గోదావరి స్పెషల్‌రైల్లో సీట్లు దొరకడంలేదు. ఈ రైలుకు అనుబంధంగా ఆదివారం మాత్రమే క్లోన్‌రైలును వేశారు. మిగతా రోజుల్లో తిప్పకపోవడంతో రైల్వేకి ఆదాయం పోతోంది. దసరా, దీపావళికి ఈ మార్గంలో ఐదేసి ప్రత్యేక రైళ్ల అవసరముందని నిపుణులు చెబుతున్నారు.
భద్రత పెంపు
పండుగలకు ప్రత్యేకరైళ్లు పెరగడంతో వాల్తేరు డివిజన్‌లోని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. విశాఖ-రాజమండ్రి మీదుగా నడిచే సుమారు 7 రైళ్లలో భద్రత పెంచినట్లు జీఆర్‌పీ డీఎస్పీ రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్‌ఐలు, సీఐలు కూడా రైళ్లలో ప్రయాణించేలా విధులు వేసినట్లు వివరించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు