close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పసిగట్టాలి... చక్కదిద్దాలి

విపరీత ప్రవర్తనకు బాల్యంలోనే బీజం
ఆదిలోనే గుర్తించడం ముఖ్యం
వ్యక్తిత్వ నిర్మాణ లోపంతోనే నేరప్రవృత్తి
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక బాధ్యత
ఈనాడు - హైదరాబాద్‌

ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదివే విద్యార్థిని. స్నేహితులను మోసగిస్తూ, అబద్ధాలు చెబుతూ తనకు కావాల్సిన వాటిని సాధించుకుంటోంది. ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఈమె కోసం ఆ ఇద్దరూ కొట్లాటకు దిగటంతో అసలు విషయం బయటకు వచ్చింది. చిన్నప్పుడే తండ్రి మరణించటంతో తల్లి వద్దనే పెరుగుతోంది. ప్రవర్తన లోపాలను ఆదిలోనే గమనించి సరిచేయకపోవడంతో ఆ యువతి జీవితం ఒడిదొడుకుల్లో పడింది.

పదేళ్ల అబ్బాయి. ఒక్కడే పిల్లవాడు కావటంతో తల్లితండ్రులు గారాబం చేశారు. అడిగిందల్లా కొనిచ్చారు. పిల్లాడి నుంచి డిమాండ్లు పెరగటంతో మందలించారు. అప్పటి నుంచీ అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అమ్మానాన్నలను దుర్భాషలాడేవాడు. చేతికి దొరికిన వస్తువులను పగులగొట్టేవాడు. పాఠశాలలో సహ విద్యార్థులతో గొడవలకు దిగటం, హోంవర్క్‌ చేయకుండా మొండికేయటం ప్రారంభించాడు. మూడు నెలలుగా ఓ మానసిక వైద్యుడు తల్లిదండ్రులకు, పిల్లవాడికి కౌన్సెలింగ్‌ ఇస్తూ... క్రమంగా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


బాల్యమంటే అమాయకత్వం... పిల్లల మనసులు స్వచ్ఛం... ఎదిగేకొద్దీ పరిసరాల ప్రభావం వారిలో మార్పు తెస్తుంది. కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచీ విపరీత ప్రవర్తనకు అలవాటుపడతారు. చిన్నచిన్న కోరికలు తీర్చుకోవడానికి తల్లితండ్రులపై అలగడం, కోపం ప్రదర్శించడం వంటివి క్రమేణా ముదిరితే తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంటాయి. పసివయసులోనే వారి విపరీత ప్రవర్తనను సరిదిద్దకుంటే దుష్పరిణామాలు ఎదురవుతాయని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఓ యువకుడి దురాశ వికృత రూపం దాల్చి... పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది.

మహబూబాబాద్‌ జిల్లాలో తొమ్మిదేళ్ల దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసిన సాగర్‌ అనే యువకుడు ఆ పసివాడిని కిరాతకంగా హత్య చేసిన ఈ సంఘటన సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. గత ఏడాది దిశపై హత్యాచారంలో నలుగురు యువకులే ప్రధాన నిందితులు కావడం తెలిసిందే. తరచూ నేరాల్లో యువత ఇరుక్కోవడానికి బీజం వారి బాల్యంలోనే పడుతుందన్నది మానసిక నిపుణుల మాట. ఇలాంటి వారిని చిన్న వయసులోనే గుర్తించి మంచిగా మలచుకోవాలని వారు సూచిస్తున్నారు. పెద్దయ్యాక నేర, హింసా ప్రవృత్తి నుంచి బయటకు తీసుకురావడం కష్టమవుతుందంటున్నారు.

వింత మనస్తత్వాలు... వికృత చేష్టలు
గత ఏడాది దిశపై సామూహిక అత్యాచారం.. హత్య ఘటనలోని ఒక నిందితుడు ప్రత్యేకంగా ఉండేందుకు ఆసక్తి చూపేవాడు. తన ద్విచక్ర వాహనంపై పుర్రె బొమ్మ వేయించి, డేంజర్‌ అని రాసుకోవడం అతడి విపరీత ప్రవర్తనకు ఓ నిదర్శనం. మరో ఘటనలో... పెళ్లిచేసుకోమని నిలదీసిందనే కక్షతో ఓ యువకుడు ప్రియురాలి గొంతుకు చున్నీ బిగించి హతమార్చాడు. ఆ యువకుడు వాడే బైక్‌ వెనుక ‘నో రూల్స్‌ ఇట్స్‌ మై లైఫ్‌’ అని రాసి ఉంది. ఇలాంటి వారు సామాజిక నిబంధనలేవీ పట్టించుకోరు. వద్దన్న పని పదేపదే చేస్తుంటారు. పసితనంలోనే మొగ్గ తొడిగే ఇలాంటి లోపాలు ఎదిగే కొద్దీ వాళ్లను అసాంఘికశక్తులుగా తయారు చేస్తాయని హైదరాబాద్‌కు చెందిన న్యూరోసైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి విశ్లేషించారు.

నేరాలకు ప్రేరేపించే అంశాలు
* కుటుంబంలో తలెత్తే విభేదాలు, వివాదాలు
* తేలికగా డబ్బు/విజయం పొందాలనేఆలోచనలు
* నాకేం కాదు, నేరం చేసినా పట్టుకోలేరనే విపరీత ధోరణులు
* గతంలో తాము చూసిన, విన్న సంఘటనల ప్రభావం
* నేరాలకు ప్రేరేపించే మత్తుపదార్థాలు, స్నేహితులు
* వ్యవస్థల పట్ల భయం లేకపోవటం, నిర్లక్ష్యం

పిల్లలు ఏం చేయాలి....
* తెలియని వ్యక్తుల మాటలను అనుసరించరాదు. వారిచ్చే వస్తువులు తీసుకోవద్దు.
* కుటుంబసభ్యులకు చెప్పకుండా బయటికి వెెళ్ల్లకూడదు.
* తల్లిదండ్రులను కాదని స్వయంగా నిర్ణయాలు తీసుకోవద్దు.
* ఇంటి చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, డయల్‌-100 నంబరు తప్పనిసరిగా తెలియాలి.


దారికి తేవడం ఎలా?

* ప్రవర్తన లోపాలున్న పిల్లలను చిన్నప్పుడే తల్లితండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలి.
* అనునయంగా మాట్లాడుతూ, వారిలో మార్పు తేవాలి.
* విద్యార్థుల్లో ఉపాధ్యాయులు గమనించిన అంశాలను వారి తల్లిదండ్రులతో పంచుకోవాలి.
* నీతి కథల రూపంలో మంచిచెడులను వివరించాలి. దారి తప్పితే ఎదురయ్యే కష్టనష్టాలను గుర్తుచేస్తూ, హెచ్చరిస్తుండాలి.
* పిల్లల ప్రవర్తన శ్రుతి మించుతుంటే మానసిక వైద్య నిపుణుల సహాయం పొందవచ్చు.
* ఏడ్చి, గొడవ చేసి అనుకున్నది సాధించాలనుకునే పిల్లల ధోరణిని ప్రోత్సహించకూడదు. అలాగని దండించడం కాకుండా మంచి మాటలతోనే మార్చుకోవాలి.
* యుక్త వయసుకొచ్చాక వారిలో విపరీత ప్రవర్తనలను గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే పైకి మంచిగా నటించడాన్ని వారు అలవాటు చేసుకుంటారు. ఒకవేళ వారి ధోరణిని గుర్తించినా, ఆ వయసులో సరిదిద్దడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. అందుకే బాల్యంలోనే మరింత శ్రద్ధ వహించాలి.


తల్లిదండ్రులూ జాగ్రత్త

* పిల్లల కదలికలను గమనిస్తుండాలి. అవాంఛనీయ మాధ్యమాలు, విలాసవంత జీవితంవైపు ఆకర్షితమవుతుంటే అప్రమత్తమవ్వాలి.
* మార్కుల కోసమే కాదు... నైతికవిలువలు పెంచేలా చదువులు సాగాలి.
* తల్లిదండ్రులు తమను గమనిస్తున్నారనే ఆలోచన పిల్లల్ని కొంత అదుపు చేస్తుంది.
* తెలిసిన/తెలియని వ్యక్తుల మాటలు, చేతలను పిల్లలు గుర్తించేలా చేయాలి.
* కుటుంబ ఆర్థికలావాదేవీలు పిల్లల ముందు చర్చించకూడదు.
* తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఘర్షణ పడకూడదు.


పెద్దయ్యాక గుర్తించటం కష్టమే
-డాక్టర్‌ హరీష్‌ చంద్రారెడ్డి, న్యూరోసైకియాట్రిస్ట్‌

పైకి మామూలుగానే కనిపిస్తూ... లోపల తీవ్ర నేర ప్రవృత్తి కలిగిన వారు ప్రతిచోట అందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వీరిలో సైకోటిక్‌ ఎలిమెంట్స్‌ కనిపిస్తుంటాయి. ఎవరినీ గౌరవించరు. ఎవరికీ భయపడరు. చిన్నచిన్న విషయాలకే కోపంతో చేతిలో ఉన్న వస్తువులను విసిరేయటం, తగులబెట్టడం చేస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు తరచూ గొడవపడటం. వారి నుంచి తగిన ప్రేమ, ఆప్యాయతలు అందకపోవటం కూడా పిల్లలు అసాంఘికశక్తులు (యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌)గా మారేందుకు దారితీస్తాయి. పసితనంలోనే ప్రవర్తన లోపాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనిస్తే, సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. పెద్దయ్యాక నేరస్వభావాన్ని అంచనా వేేయటం చాలా కష్టం. నేరాలకు పాల్పడడం వెనుక కూడా ఒక్కొక్కరి విషయంలో ఒక్కో కారణం ఉంటుంది.


ఎదుర్కొనే మెలకువలు నేర్పించాలి
- మైథిలి, సూపరింటెండెంట్‌, జువైనల్‌, వీధి బాలల సంరక్షణ గృహం

పిల్లలపై దాడుల కేసుల్లో అత్యధికం బాగా తెలిసినవారు చేస్తున్నవే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో పాఠశాల విద్యతో చదువు నిలిపివేసిన వారే అధికం. రోజుకో కొత్తరకమైన నేరాలు తెరపైకి వస్తున్నాయి. చిన్న వయసులో పిల్లలకు ఏది మంచి... ఏది చెడో తెలియాల్సిన అవసరముంది. తల్లిదండ్రుల అప్రమత్తత కీలకం. అనుమతి లేనిదే పిల్లలను ఎక్కడికీ వెళ్లనీయవద్దు. అయిదేళ్లు దాటిన పిల్లలకు ఆపదలను ఎలా ఎదుర్కొనాలో నేర్పించాలి. గట్టిగా కొరకడం, గోళ్లతో రక్కడం, సహాయం కోసం అరవడం తదితర మార్గాల్లో ప్రతిఘటించాలని వారికి బోధించాలి.


బాలలపై నేరాలకు సంబంధించి యునిసెఫ్‌ అధ్యయనంలో వెల్లడైన గణాంకాలు

94.6% పిల్లలపై వేధింపులు, దాడులకు పాల్పడే వారిలో తెలిసిన సమీప బంధువులు, పరిచయస్తులు
53.7% దాడులకు పాల్పడే వారిలో సొంత కుటుంబసభ్యులు, బాగా దగ్గరి స్నేహితులు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.