close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆదమరిస్తే రెండో అలజడి!

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుంది
ఈటీవీ భారత్‌ ప్రత్యేక ముఖాముఖిలో ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి వెల్లడి

కరోనా ఉద్ధృతి తగ్గిందన్న ఆలోచనతో ఆదమరచి ఉండటం ప్రమాదకరమని ప్రజారోగ్య రంగ నిపుణుడు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి హెచ్చరించారు. రాబోయే ఆరునెలల్లో ప్రజలు స్వీయ నియంత్రణతో అప్రమత్తంగా ఉండకపోతే ఆ వైరస్‌ విజృంభించొచ్చని చెప్పారు. కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయన్నారు. కొందరికి రెండోసారి కూడా కరోనా సోకినట్లు జన్యు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి తీవ్రతపై ‘ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యాంశాలివీ..

కరోనా సెకండ్‌ వేవ్‌ అంటే ఏమిటి? ఈ పదం ప్రపంచాన్ని ఎందుకు భయపెడుతోంది?
కొవిడ్‌ మొదటిసారి వెలుగు చూసినప్పుడు దాని తీరుతెన్నుల గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. అలలు.. అలలుగా ఆ వైరస్‌ వ్యాపించింది. కేసుల నమోదు పెరిగింది. ఒకే అలలా వైరస్‌ వ్యాప్తి జరుగలేదు. ఇది ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో ఎవరికీ తెలియడంలేదు. తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ రెండు, మూడు దశలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేం. ఇది ప్రజల వ్యవహారశైలి, చర్యలపై ఆధారపడి ఉంటుంది.

సెకండ్‌ వేవ్‌ మొదటిసారి కన్నా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా?
కేసుల సంఖ్య పెరిగినా మరణాల సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఐరోపాలో ఇదే పరిస్థితి ఉంది. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసి, ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. వాతావరణం కూడా వైరస్‌కు అనుకూలించవచ్చు. రాబోయే పండుగలు, శుభకార్యాల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాల్సిందేనని గత అనుభవాలు చెబుతున్నాయి.

దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరగడాన్ని సెకండ్‌ వేవ్‌గా భావించవచ్చా?
అక్కడి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించలేదు. దిల్లీలో జూన్‌- ఆగస్టు మాసాల్లోని పరిస్థితిని గమనిస్తే.. లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దాన్ని ఎత్తివేశాక వైరస్‌ పేట్రేగిపోయింది. అజాగ్రత్తగా ఉంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉందని ఇక్కడి అనుభవం చెబుతోంది.

మొదటి దశ నుంచి కోలుకోక ముందే బ్రిటన్‌లో రెండో దశకు కారణమేంటి?
బ్రిటన్‌లో కరోనాను తొలుత చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఫ్లూ కన్నా తీవ్రమైందేమీ కాదన్న ధోరణిని ప్రదర్శించారు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’తో కరోనాను జయించవచ్చని భావించారు. అయితే కేసులు, మరణాల సంఖ్య పెరగడంతో అక్కడ ఆలోచన మారింది. నియంత్రణకు నిబంధనలను అమలు చేశారు. కేసులు తగ్గుముఖం పట్టాయని అనుకున్న తర్వాత నిబంధనలు సడలించి రెస్టారెంట్లకు అనుమతులిచ్చారు. దీంతో కరోనా విజృంభణకు అవకాశాలు పెరిగాయి.

ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ ఆ వ్యాధి  సోకే అవకాశాలున్నాయంటారా?
రెండోసారి కొవిడ్‌ సోకడానికి అవకాశాలున్నాయి. కొందరిలో ఈ పరిస్థితి కనిపించింది. అవి రీ ఇన్‌ఫెక్షన్లేనని వైరల్‌ జన్యు అధ్యయనాల ద్వారా వెల్లడైంది. అయితే రెండోసారి కరోనా వచ్చిన కొందరిలో వ్యాధి లక్షణాలే కనిపించలేదు. రెండోసారి కొత్త వైరస్‌ రకం వల్ల వారికి కొవిడ్‌ సోకినట్లు తేలింది.

సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు మన పాలనా యంత్రాంగం ఎలా సన్నద్ధం కావాలి?
మార్చిలో వైరస్‌ వచ్చినప్పుడు మనం వెంటిలేటర్లపై దృష్టిపెట్టాం. ఇప్పుడు ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొరతపై దృష్టిపెట్టాలి. వ్యాధి నిర్ధారణ వేగంగా జరగాలి ఇందుకోసం  ఇంటింటికీ తిరిగి వ్యాధులను నమోదు చేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. వైరస్‌ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా పరీక్షలో ‘నెగిటివ్‌’ వచ్చిందని సంబరపడిపోకూడదు. బాధితులకు దగ్గరగా వెళ్లినవారిని ఎప్పటికప్పుడు గుర్తించడం చాలా కీలకం.

జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ విధించడానికి కారణాలేమిటి?
జర్మనీ, డెన్మార్క్‌ల్లో కేసుల తీవ్రత లేదు. జాగ్రత్త చర్యగా ఆ దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఫ్రాన్స్‌లో పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రజల్లో కదలికలు, ఒకరినొకరు కలుసుకోవడాలు పెరిగాయి. ఐరోపా దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించడానికి ఇవే కారణాలయ్యాయి.

సెకండ్‌ వేవ్‌, శీతాకాలం నేపథ్యంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి?
రాబోయే సీజన్‌ పండుగలు, శుభకార్యాలకు అనువైనది. ఆలయ సందర్శన, వివాహాల సందర్భంగా ప్రజలు గుమికూడితే వారు.. ‘సూపర్‌ స్ప్రెడర్‌లు’గా మారి ఇతరులకు వైరస్‌ను వ్యాప్తి చేయవచ్చు. అందరూ బాగుండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు.

టీకా ఎప్పుడు వస్తుందంటారు?
మూడో దశ క్లినికల్‌ పరీక్షల అనంతరం నవంబరు- డిసెంబరు మధ్యలో కొత్త టీకాను కంపెనీలు.. ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు అందజేస్తాయి. అనంతరం నియంత్రణ సంస్థలు.. ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని తెలియజేస్తాయి. అంతా సవ్యంగా జరిగితే జనవరిలో టీకాల ఉత్పత్తి ప్రారంభం కావొచ్చు. కొందరు ఇప్పటికే ఉత్పత్తిని మొదలుపెట్టారు. కరోనాపై పోరులో ముందంజలో ఉన్న వారికి జనవరి-ఫిబ్రవరిలో తొలుత టీకా ఇచ్చే అవకాశం ఉంది. జులై నాటికి సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు