
కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. ఉత్తమ భార్య ఎలా ఉంటుందో చెప్పే మాటల్లో తొలుత వినిపించేవి ఇవే. ఆ వర్ణనకు అతికినట్లు సరిపోతారు జిల్ బైడెన్! అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్న జో బైడెన్ భార్య ఆమె. అగ్రరాజ్యానికి కాబోయే ప్రథమ మహిళ (ఫ్లోటస్). అమెరికాలో ఫ్లోటస్‌కు చాలా ప్రాధాన్యముంటుంది. అధ్యక్షుడితో కలిసి అనేక అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. దేశ విదేశాల్లో పర్యటిస్తుంటారు. ప్రతిష్ఠాత్మకమైన ఆ స్థానం జిల్కు దక్కబోతున్న నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలివిగో..
ఐదుసార్లు పెళ్లి ప్రతిపాదనకు తిరస్కరణ
ఫిలడెల్ఫియాకు చెందిన జిల్ 1951లో జన్మించారు. 1970లో బిల్ స్టీవెన్సన్ను వివాహమాడారు. నాలుగేళ్ల తర్వాత ఆయన నుంచి విడిపోయారు. 1975లో తొలిసారిగా జో బైడెన్‌ను కలిశారు. తొలి పరిచయంలోనే బైడెన్‌పై ఆమెకు మంచి అభిప్రాయం కలిగింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అప్పటికే బైడెన్ వివాహితుడు. అయితే- ఆయన భార్య నీలియా 1972లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ ప్రమాదంలోనే ఏడాది పాపనూ ఆయన కోల్పోయారు. ఇద్దరు కుమారులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడగా.. వారి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత జిల్ ముందుకు బైడెన్ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆమె మాత్రం ‘ఇప్పుడే కాదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారు. అలా ఒకటి, రెండుసార్లు కాదు.. ఏకంగా ఐదుసార్లు బైడెన్‌కు జిల్ నుంచి తిరస్కరణ ఎదురైంది. ఆపై ఎట్టకేలకు అంగీకరించడంతో 1977లో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఎయిర్ ఫోర్స్-2లోనూ..
జిల్ డాక్టరేట్ చేశారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. బోధన ఆమెకు అత్యంత ఇష్టం. తొలుత 13 ఏళ్లపాటు వివిధ పాఠశాలల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆపై కొన్ని కళాశాలల్లోనూ బోధించారు. బైడెన్ ఉపాధ్యక్షుడయ్యాక అమెరికా ద్వితీయ మహిళ స్థానం జిల్కు దక్కింది. ఆ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చేది. ఖాళీ సమయం దొరికేది కాదు. అప్పుడు కూడా ఆమె తనకిష్టమైన బోధనను వీడలేదు. వర్జీనియాలోని ఓ కళాశాలలో ఆంగ్లం బోధిస్తూనే.. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలాసార్లు ఎయిర్ ఫోర్స్-2 (అమెరికా ఉపాధ్యక్షుడు వినియోగించే విమానం)లో ప్రయాణిస్తూనే ఆమె విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దేవారు. ఒకవేళ తనకు ప్రథమ మహిళ స్థానం దక్కినా.. బోధనను కొనసాగిస్తానని గతంలోనే జిల్ స్పష్టం చేశారు. ‘బోధన నా వృత్తి కాదు. అది నా ఉనికి’ అని 2019లో ఆమె చెప్పిన మాట చాలు.. ఉపాధ్యాయ వృత్తికి ఆమె ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థం చేసుకునేందుకు!
హారిస్ ఎంపికలో కీలక పాత్ర
జిల్ మాటకు బైడెన్ చాలా విలువిస్తారు. ఆమే ఆయనకు మార్గదర్శకురాలు. నీలియా మరణం తర్వాత కుంగిపోయిన తాను తిరిగి మామూలు మనిషిగా మారడం జిల్ చలవేనని బైడెన్ చెబుతుంటారు. ‘ఆమె నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చింది’ అని చాలాసార్లు చెప్పారు. తన గురించి తనకంటే జిల్కే ఎక్కువ తెలుసని కూడా అంటుంటారు. రాజకీయ వ్యవహారాల్లోనూ ఆమె సలహాలు, సూచనలకు బైడెన్ అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. తాజా ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుందామన్న ప్రశ్న తలెత్తినప్పుడు చాలామంది మహిళా అభ్యర్థుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. చివరకు కమలా హారిస్‌ను బైడెన్ ఎంచుకున్నారు. ఆ నిర్ణయం వెనుక జిల్ కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇక అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఆమె నిరంతరం బైడెన్ వెన్నంటి ఉన్నారు. అనేక ర్యాలీల్లో పాల్గొన్నారు.
తొలిమహిళనైనా పాఠాలు చెబుతా..
ఒకవేళ నాకు ప్రథమ మహిళ స్థానం దక్కినా, బోధనను కొనసాగిస్తాను. బోధన నా వృత్తి కాదు. అది నా ఉనికి. జీవితాంతం నాతో ఉంటుంది. నేను రాజకీయ నాయకురాలిని కాను. ఇంగ్లిష్ టీచరును...
అలుపెరుగని పరుగు!
జిల్కు పరుగు అంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా వారానికి కనీసం ఐదు రోజులు రన్నింగ్ చేస్తుంటారు. పలు హాఫ్ మారథాన్లు, 10 మైళ్ల పరుగు పోటీల్లో పాల్గొన్నారు. 1998లో ఓ మారథాన్నూ పూర్తిచేశారు. బైడెన్ బాల్యం గురించి ‘ది స్టోరీ ఆఫ్ జో బైడెన్’ అనే పుస్తకాన్ని జిల్ రాశారు. నాలుగు దశాబ్దాలుగా వారిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది.
మరిన్ని

దేవతార్చన
- పంజాబ్, హరియాణాల్లో హై అలర్ట్
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
- బాధ్యతల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- విశ్రాంతి తర్వాత టీమ్ఇండియాపై గర్జిస్తా
- అమ్మకానికి 60 లక్షల మంది భారతీయుల నెంబర్లు
- మాక్సీకి రూ.10 కోట్లు చెల్లిస్తే తెలివిలేనట్లే!
- అందుకు పశ్చాత్తాప పడుతున్నా
- దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె