close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రక్తనాళాలపైనా కరోనా దెబ్బ!

గడ్డలతో పక్షవాతం, గ్యాంగ్రిన్‌
ముందే గుర్తిస్తే థ్రాంబోసిస్‌ను నివారించవచ్చు
వాస్కులర్‌ సర్జన్‌, స్టాన్‌ఫర్డ్‌ సహాయ ఆచార్యుడు మిక్కినేని కార్తీక్‌తో ‘ఈనాడు’ ముఖాముఖి

ఈనాడు, అమరావతి: ‘ప్రస్తుతం కరోనా సోకుతున్న కొందరిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు లేకపోయినా, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం (థ్రాంబోసిస్‌) ప్రధాన సమస్యగా మారుతోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకపోవడంతో... అంతర్గతంగా జరుగుతున్న నష్టాన్ని చాలామంది గుర్తించడం లేదు. చివరకు అది ప్రాణాంతకంగా మారుతోంది. రక్తం సరఫరా నిలిచిపోయి గాంగ్రిన్‌ ఏర్పడటంవల్ల, కొందరిలో వేళ్లు, కాళ్లు తీసేయాల్సి వస్తోంది. కరోనా సోకిన 30-40 శాతం మందిలో ఏదో ఒక థ్రాంబోసిస్‌ సమస్య ఏర్పడుతోందని, అలాంటి వారిలో 40 శాతం మందికి వేళ్లు, కాళ్లు తొలగించాల్సి వస్తోంది’ అని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వాస్కులర్‌ సర్జన్‌ మిక్కినేని కార్తీక్‌ తెలిపారు. థ్రాంబోసిస్‌తో అవయవాలు తొలగించాల్సి వచ్చిన వారిలో 40 శాతం మంది వరకు చనిపోతున్నారని తెలిపారు. డాక్టర్‌ కార్తీక్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి కొంత విరామం తీసుకొని... 2019 నుంచి హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)లో పనిచేస్తున్నారు. చాలా మంది కొవిడ్‌ రోగులకు చికిత్స చేశారు. విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రితోనూ కలిసి పనిచేయనున్నారు. ఆ సందర్భంగా ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఎండోథీలియంను దెబ్బతీస్తోంది..
కొవిడ్‌ను మొదట్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధిగానే చూశారు. కరోనాతో ఊపిరితిత్తుల్లో కణజాలం దెబ్బతినడంతో పాటు, థ్రాంబోసిస్‌ వల్లా ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని తర్వాత గుర్తించారు. రక్తనాళాల లోపలి పొరను ఎండోథీలియం అంటారు. ఊపిరితిత్తుల్లో మాదిరే దానిలోనూ ఏస్‌రిసెప్టర్లు ఉంటాయి. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ ఈ ఏస్‌రిసెప్టర్లకు అతుక్కుని ఎండోథీలియంకి నష్టం చేస్తోంది. ఎప్పుడైనా రక్తనాళం దెబ్బతింటే... ఆ ప్రాంతంలో రక్తం గడ్డకడుతుంది. ఈ గుణాన్ని పెంచే ‘ప్రొకోగ్యులెంట్‌ ఫ్యాక్టర్స్‌’ ఎక్కువవుతాయి.
డి-డైమర్‌ పరీక్ష తప్పనిసరి..
ప్రస్తుతం 30-40 ఏళ్ల వయసు వారిలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వస్తే... ఊపిరితిత్తులు బాగానే ఉన్నా రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. వాళ్లు వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని... ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే లోపల వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరూ డి-డైమర్‌ పరీక్ష చేయించుకోవాలి. దానివల్ల రక్తం ఎంత చిక్కగా ఉందన్న విషయం తెలుస్తుంది.  బ్రిటన్‌, అమెరికా, దక్షిణాఫ్రికాల్లో ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్‌ శ్వాసకోశ వ్యవస్థను పెద్దగా దెబ్బతీయడం లేదు. రక్తనాళాలకు నష్టం చేస్తోంది.
వ్యాధి నయమయ్యాక కూడా మందులు వాడాలి
ఇతర అనారోగ్య సమస్యలేమీ లేనివాళ్లలో కరోనా వచ్చి తగ్గిపోయాక... రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడటాన్ని ఇంత వరకు గుర్తించలేదు. కరోనా సమయంలో రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి, దానికి చికిత్స పొందినవారిలో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడే అవకాశం 60 శాతం వరకు ఉంటుంది. వారు కరోనా తగ్గిన తర్వాత కూడా మూడు నుంచి ఆరు నెలల పాటు మందులు వాడాలి. ఇక కరోనా వచ్చేసరికే ఏదో ఒక రక్త నాళాల సమస్యలు ఉన్నవారిలో ఆ సమస్య పెరుగుతుంది.
కాళ్లపైనా, మెదడుపైనా ప్రభావం..
రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్‌... అటు మెదడులోకిగానీ, ఇటు కాళ్లలోకికానీ వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. మెదడులోకి వెళ్తే పక్షవాతం వస్తుంది. కాళ్లకు వెళితే... గాంగ్రిన్‌ ఏర్పడి కాళ్లు తొలగించాల్సి వస్తుంది. కాళ్లకు రక్తప్రసరణ ఆగిపోతే మొదట చల్లబడతాయి. ఆ తర్వాత నొప్పి మొదలవుతుంది. గుండె నుంచి అన్ని శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే బృహద్దమనిలోనూ క్లాట్స్‌ ఏర్పడతాయి.
డి-డైమర్‌ టెస్ట్‌లో ముందే గుర్తిస్తే...
మందులతోనే బ్లాక్‌లు ఏర్పడకుండా నివారించవచ్చు. హెపరిన్‌ మందులు ఇవ్వడంవల్ల రక్తం పలచబడేలా చేయవచ్చు. పక్షపాతం వస్తే గంటలోపే చికిత్స చేయాలి. కాళ్లకు సమస్య వస్తే ఆరు గంటల నుంచి ఒక రోజు వరకు పర్వాలేదు.  కాళ్లకు రక్తప్రసరణ ఆగిపోయి వాటిని తొలగించిన వారిలో మరణాల శాతం ఎక్కువగా ఉంటోంది. వారిలో రక్త ప్రసరణ ఆగిపోయేసరికి కొన్ని కణాలు చనిపోతాయి. వాటిని ఇస్కీమిక్‌ టిష్యూస్‌ అంటారు. అవి రక్తంలో చేరినప్పుడు... బాడీ సెప్టిక్‌షాక్‌కు గురవుతుంది. కిడ్నీలు దెబ్బతింటాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు