close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బస్సులకు డీజిల్‌ కష్టాలు

 చెల్లింపుల్లో జాప్యంతో సరఫరాకు ఆటంకాలు
డిపోల్లో నిండుకుంటున్న చమురు
అక్కడక్కడా ఆర్టీసీ సర్వీసులకు బ్రేకులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీని డీజిల్‌ కష్టాలు చుట్టుముడుతున్నాయి. పలు రీజియన్లలో చమురు నిండుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో చెల్లింపులు చేయకపోవటంతో చమురు సంస్థలు సరఫరాను నియంత్రిస్తున్నాయి. ఒకపక్క కరోనా కష్టాలు మరోవైపు చుక్కలను అంటుతున్న డీజిల్‌ ధరలతో ఆర్టీసీ కుదేలవుతోంది. ప్రయాణికుల సంఖ్య ఇప్పుడిప్పుడే పుంజుకుంటుండగా ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. మహబూబ్‌నగర్‌, ఖమ్మం రీజియన్‌లలో ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని సర్వీసులను నిలిపివేశారు. డీజిల్‌ కోసం ఆర్టీసీ ఏటా రూ.ఆరేడొందల కోట్లు వెచ్చిస్తోంది. కరోనాతో తగిన ఆదాయం లేక ప్రతి నెలా ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి.  కొన్ని సందర్భాల్లో పదో తేదీ తర్వాత కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
ధరల్లో వ్యత్యాసంతో నిల్వలపై ప్రభావం
ఇంధన ధరల్లో హెచ్చు తగ్గులు అధికంగా ఉంటూ ఉండటంతో నిల్వలను ఆర్టీసీ తగ్గించుకుంటోంది. సాధారణంగా ప్రతి డిపో లేదా రీజియన్‌ పరిధిలో పది నుంచి పదిహేను రోజులకు సరిపడే నిల్వలు ఉండేవి. చెల్లింపుల్లో జాప్యం జరిగినా బస్సులు ఆగేవి కాదు. ధరల్లో నిలకడ లేక ఎక్కువ రోజులకు సరిపడా నిల్వలు నిర్వహించేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. బుధవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చమురు ధరల్లో వ్యత్యాసంతో సగటున నెలకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఆర్టీసీపై భారం పడింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో రోజుకు సుమారు రూ.కోటి వరకు భారం పడుతుండటం విశేషం.
తగ్గిన కిలోమీటర్లు
ఆర్టీసీకి మొత్తం 9,754 బస్సులు ఉన్నాయి. ఏటా 85 లక్షల నుంచి 90 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతుంది. కరోనాతో ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 45 లక్షల నుంచి 50 లక్షల కిలోమీటర్లే తిరిగాయి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత సర్వీసులు ప్రారంభించినప్పటికీ అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరటంలో జాప్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లే దూరప్రాంత బస్సులకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి సర్వీసులను కూడా సంస్థ తగ్గించింది. మొత్తమ్మీద దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ కలిసి ఆదాయంపై ప్రభావాన్ని చూపటంతో బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ అవస్థలు పడుతోంది. చమురు సంస్థలకు చెల్లింపుల్లో జాప్యంతో కొన్ని సర్వీసులకు ఇబ్బంది వచ్చిన మాట వాస్తమేనని క్షేత్రస్థాయిలో పలువురు అధికారులు ‘ఈనాడు’కు స్పష్టం చేశారు. చెల్లింపుల్లో జాప్యానికి మార్చి నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజుల సెలవులు రావటం కూడా ఒక కారణమన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన విధానం ఇలా..
ఒప్పందం కుదుర్చుకున్న చమురు సంస్థలు నేరుగా డిపోలకు డీజిల్‌ను సరఫరా చేస్తాయి. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర కన్నా లీటరుకు రూ.2.50 తక్కువకు పంపిణీ చేస్తాయి. చెల్లింపు విధానాన్ని రెండేళ్ల క్రితం వికేంద్రీకరించారు. గతంలో కేంద్ర కార్యాలయం నుంచే జరిగేది. ఇప్పుడు ఏ రీజియన్‌కు ఆ రీజియనే చెల్లించాలి.
2020-21 బడ్జెట్‌లో డీజిల్‌ కోసం రూ.780 కోట్లు కేటాయించారు. గత ఏడాది డిసెంబరు నాటికి రూ.450 కోట్లు ఖర్చవగా ఇప్పటి వరకు మరో మూడు వందల కోట్ల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. తాజా బడ్జెట్‌లో రూ.1,211 కోట్లు కేటాయించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు