close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైరస్‌ను గాలించేస్తాం!

ముప్పును గుర్తించేందుకు మరిన్నిచోట్ల పరిశోధనలు
మాల్స్‌ సహా రద్దీ ప్రాంతాల్లో గాలి నమూనాల సేకరణకు వ్యూహం
‘ఈనాడు’తో సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌మిశ్ర
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ముందుకురావాలని పిలుపు
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. రెండో విడత(సెకండ్‌ వేవ్‌)లో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు కేసుల సంఖ్య చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలో తీవ్రతను అంచనా వేయడంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. గతంలో ఆసుపత్రుల్లో గాలి నమూనాలు సేకరించి పరిశోధనలు చేపట్టగా ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్‌, విద్యా సంస్థలు, గృహ సముదాయాలు, పరిశ్రమలు, మెట్రోరైళ్లలోని గాలిలో వైరస్‌ ఉనికిపై అధ్యయనానికి సమాయత్తవుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ముందుకొస్తేనే ఈ అధ్యయనం ఫలప్రదమవుతుందని, వైరస్‌ వ్యాప్తి ముప్పును పర్యవేక్షించడానికి గాలి నమూనా నిఘా వ్యవస్థ అవసరమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర ‘ఈనాడు’తో అన్నారు. పార్లమెంట్‌లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతికి ప్రతిపాదించినట్టు చెప్పారు. పలు రాష్ట్రాలనూ  కోరుతున్నామని వెల్లడించారు.


నాడు ఆసుపత్రుల నుంచి..

గాలిలో కరోనా వైరస్‌ ఉంటుందని విదేశీ శాస్త్రవేత్తలు గతంలోనే నిర్ధారించారు. అందుకు అనుగుణంగా భారత్‌లో పరిస్థితులపై సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబియల్‌ టెక్నాలజీ(ఐఎంటెక్‌) శాస్త్రవేత్తలు సెప్టెంబరు-నవంబరు నెలల్లో పరిశోధన చేపట్టారు. హైదరాబాద్‌లోని మూడు ఆసుపత్రులు, మొహాలీలోని మూడు ఆసుపత్రుల నుంచి గాలి నమూనాలను సేకరించారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను వినియోగించారు. కొవిడ్‌, కొవిడేతర ఐసీయూలు; కరోనా, సాధారణ వార్డులు, కారిడార్‌లు, ఓపీ కారిడార్లు, మార్చురీలు, కొవిడ్‌ క్యాజువాలిటీ ప్రాంతాలు, వైద్యుల గదులు ఇలా అన్నిచోట్ల నుంచి 64 నమూనాలు సేకరించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 41 నమూనాలను సేకరించి ఆర్‌టీ-పీసీఆర్‌పై పరీక్షించి అనేక అంశాలపై స్పష్టతకు వచ్చారు.


ముందుకొస్తే యంత్రాలు ఏర్పాటు చేస్తాం..

ప్రస్తుత పరిస్థితుల్లో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రజారవాణా, మాల్స్‌, పాఠశాలలు, పరిశ్రమలు, గృహ సముదాయాల్లో గాలిలో వైరస్‌ ఏ మేరకు ఉంటుందనేది తెలుసుకోవడం అత్యంత అవశ్యం. వచ్చే ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. కొవిడ్‌ ఉన్న వ్యక్తి ఇలాంటి చోట్ల సంచరించినప్పుడు గాలిలో వైరస్‌ ఎంత సేపు ఉంటుంది? ఎంత దూరం వైరస్‌ కణాలు ప్రయాణిస్తాయి? ఎంతమందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది? వంటి విషయాలు తెలుసుకోగలం. ఇందుకోసం కొన్నిరోజుల పాటు నిత్యం వైరస్‌ లోడును తెలుసుకునేందుకు వీలుగా సేకరించిన నమూనాలను ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చాల్సి ఉంటుంది. ముందుగా ప్రభుత్వ భవనాల్లో నమూనాల సేకరణకు అనుమతిస్తే మిగతావారు ముందుకొస్తారు. ఏదైనా కంపెనీ ముందుకొస్తే వారికే శిక్షణ ఇచ్చి సేకరించే బాధ్యతను అప్పగిస్తాం. కొవిడ్‌ రెండోవేవ్‌ నేపథ్యంలో సీసీఎంబీ ప్రయోగశాలలోనూ పరీక్షలను రెట్టింపు చేశాం. వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సంఖ్యనూ పెంచాం.

- డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర

 

రెండు మీటర్ల దూరం వరకూ వ్యాపిస్తున్నాయ్‌..

* కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల నుంచి  రెండు మీటర్ల  దూరం వరకు వైరస్‌ తాలూకూ సూక్ష్మ కణాలు వ్యాపిస్తున్నాయి.
* రెండు గంటల కంటే ఎక్కువసేపు గాలిలో ఉంటున్నాయి.
* వైరస్‌ లోడు ఆధారంగా గాలిలో వ్యాప్తి ఉంటోంది.
* ఒక గదిలో ఉన్న కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల సంఖ్య, వారి రోగ లక్షణాలు, ఎంతసేపు అక్కడ గడుపుతున్నారనే దానిపై వ్యాప్తి ఆధారపడి ఉంది.
* ఎలాంటి లక్షణాలు లేని కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తి గదిలో ఫ్యాను, ఏసీ లేనప్పుడు వారి నుంచి వైరస్‌ ఎక్కువ దూరం వ్యాప్తి చెందలేదు.
* కొవిడ్‌ వార్డులు మినహా  సాధారణ వార్డుల్లో వైరస్‌ ఆనవాళ్లు కన్పించలేదు.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు