close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉచ్చు బిగుస్తోంది!

మత్తు కేసులో మరికొందరు తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు?
పోలీసుల అదుపులో కలహర్‌రెడ్డి
విచారణకు సిద్దమైన రతన్‌రెడ్డి
ఆధారాల సేకరణలో పోలీసులు
బెంగళూరు నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు మత్తుమందుల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన హైదరాబాద్‌ వ్యాపారి కల్‌హర్‌రెడ్డి నోరు విప్పేందుకు సిద్ధమయ్యాడు. దాంతో ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న తెలంగాణ శాసనసభ్యుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కలహర్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని గోవిందపుర పోలీసుల అదుపులో ఉండగా ట్రావెల్స్‌ యజమాని అయిన రతన్‌రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు బుధవారానికల్లా వీరిద్దరి వాంగ్మూలం నమోదు చేసి అనంతరం శాసనసభ్యుల ప్రమేయంపై దృష్టి సారించనున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి, కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ బెంగళూరులోని డాలర్స్‌ కాలనీలో  ఏర్పాటు చేసే పార్టీలకు ప్రతిసారి తెలంగాణ నుంచి అనేకమంది హాజరయ్యేవారని పోలీసులు గుర్తించారు. వారెవరన్నది శంకరగౌడకు తెలుసు కాబట్టి అతడి ద్వారానే పూర్తి వివరాలు రాబట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అతడిని మరోసారి విచారించాలని, అలాగే కొన్ని సాంకేతిక అంశాల ఆధారంగా బలమైన ఆధారాలను సేకరించాలని భావిస్తున్నారు.
గత ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్‌ పోలీసులు సినీ ప్రముఖులకు మత్తుమందులు సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన ఉగొచౌక్వా హారిసన్‌ లఘబంటి, జాన్‌ నాన్సోలను అరెస్టు చేశారు. అనంతరం జరిగిన దర్యాప్తులో శంకరగౌడ, ఆ తర్వాత తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యుల పేర్లు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సందీప్‌రెడ్డితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ చోటా హీరోను విచారించారు. ఈ సందర్భంగా కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు తెలంగాణ శాసనసభ్యులను పార్టీల కోసం బెంగళూరు తీసుకొచ్చేవారని తేలింది. దాంతో వారిద్దరికీ రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. స్పందన లేకపోవడంతో అరెస్టుకు సిద్ధమయ్యారు. దాంతో కలహర్‌రెడ్డి గత శనివారం పోలీసుల వద్ద హాజరయ్యాడు. మేజిస్ట్రేట్‌ ఎదుట అతడి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. విచారణ సందర్భంగా కలహర్‌రెడ్డి పలువురు శాసనసభ్యుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ట్రావెల్స్‌ యజమాని రతన్‌రెడ్డి వాంగ్మూలం కూడా నమోదు చేయనున్నారు. ఈ కేసులో వీరి వాంగ్మూలమే కీలకం కానుంది.

ఇంకొందరు ప్రజాప్రతినిధులు!
ఇప్పటి వరకూ ముగ్గురు శాసనసభ్యుల పేర్లు బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కగా ఇంకొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఓ శాసనసభ్యుడు తనతోపాటు అనేకమందిని తీసుకువచ్చేవారని, వారిలో  ప్రజాప్రతినిధులు కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారెవరనేది ఆ శాసనసభ్యుడు మాత్రమే చెప్పగలరని, అందుకే ఆయనను విచారించాకే స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
శంకరగౌడే చెప్పాలి
శంకరగౌడ డాలర్స్‌ కాలనీతోపాటు ఓ ప్రముఖ హోటల్‌లో తాను నిర్వహించే పార్టీలకు ప్రముఖులను ఆహ్వానించేవాడు. ఇందుకోసం కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డి వంటివారిని మధ్యవర్తులుగా వాడుకునేవాడు. సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తానని కన్నడ సినీ పరిశ్రమకు చెందిన మస్తాన్‌చంద్రను పిలిచిన శంకరగౌడ సినిమా బాధ్యతలేవీ అప్పగించకుండా మత్తు పార్టీల్లో పాల్గొనే అతిథులకు కావలసిన ఏర్పాట్లు చేయడం వంటి పనులే అప్పగించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్తాన్‌చంద్ర పోలీసులకు వెల్లడించాడు. ఈ పార్టీలకు హైదరాబాద్‌ నుంచి అనేకమంది హాజరయ్యేవారని, వారు ఎవరెవరనేది మాత్రం తనకు తెలియదని తెలిపాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన మస్తాన్‌చంద్ర పూర్వీకులు బెంగళూరులో స్థిరపడ్డారు. దాంతో శంకరగౌడ హైదరాబాద్‌ నుంచి వచ్చే ‘అతిథుల’ బాధ్యతలు ఎక్కువగా ఈయనకే అప్పగించేవాడు.


ఆచితూచి దర్యాప్తు

త్తుమందుల కేసులో తెలంగాణ శాసనసభ్యుల పేర్లు బయటపడటంతో బెంగళూరు పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దర్యాప్తులో ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపడబోమని, వాంగ్మూలంతోపాటు ఇతరత్రా ఆధారాలు కూడా సేకరిస్తున్నామని బెంగళూరు తూర్పు మండలం డీసీపీ శరణప్ప ‘ఈనాడు’కు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 9 మంది అరెస్టుకాగా వారిలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన మస్తాన్‌చంద్ర, శంకరగౌడ, హైదరాబాద్‌ స్థిరాస్తి వ్యాపారి సందీప్‌రెడ్డి, ఒక చోటా తెలుగు హీరో తమ విచారణలో తెలంగాణ శాసనసభ్యుల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డిల విచారణలోనూ వారి పేర్లు ప్రస్తావనకు రానున్నాయి. అయితే ఇది మాత్రమే సరిపోదని, ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నట్లు కొన్ని సాంకేతిక ఆధారాలు కూడా సేకరించగలిగితే కేసుకు బలం చేకూరుతుందని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుల ఫోన్‌ లొకేషన్లు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సెల్‌ఫోన్‌ సంస్థలను కోరినట్లు, ఒకటి రెండు రోజుల్లో ఈ వివరాలు అందనున్నట్లు సమాచారం.


ఆధారాలే కీలకం: శరణప్ప, డీసీపీ

బెంగళూరు డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించామని తూర్పు మండలం డీసీపీ శరణప్ప ‘ఈనాడు’కు తెలిపారు. కర్ణాటకలో ఆర్టీసీ సమ్మె జరుగుతుండటంతో తమ సిబ్బంది తీరికలేకుండా ఉండడం వల్ల వారంరోజులుగా ఈ కేసు దర్యాప్తు కొంత నెమ్మదించిందన్నారు. తెలంగాణ శాసనసభ్యుల పేర్లు చెప్పేందుకు నిరాకరించిన ఆయన కొన్ని సాంకేతిక ఆధారాలు సేకరించాకే అనుమానితులకు నోటీసులు జారీ చేస్తామని వివరించారు.


హైదరాబాద్‌తో శంకరగౌడ సాన్నిహిత్యం

కేసులో ఇప్పటికే అరెస్టయిన శంకరగౌడకు హైదరాబాద్‌కు చెందిన అనేకమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపార విషయాల్లో కీలకపాత్ర పోషించేవాడని తెలుస్తోంది. కన్నడ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో శంకరగౌడ పరిచయం కోసం హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఉత్సాహం కనబరిచేవారని, దీన్ని అడ్డంపెట్టుకొని బెంగళూరులో పార్టీలకు పిలిచేవాడని తెలుస్తోంది. అనూహ్యంగా ఇప్పుడు మత్తుమందుల కేసు బయటపడటంతో ఆ పార్టీలకు హాజరైన వారంతా బెంగళూరు పోలీసుల నుంచి తమకు ఎప్పుడు తాఖీదు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు