Corona: మూడేళ్ల తర్వాతే కుదుటపడేది!
close
Corona: మూడేళ్ల తర్వాతే కుదుటపడేది!

అదీ మూడోవేవ్‌ తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది
వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేయాలి
వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి
పరిశ్రమలకు చేయూతనివ్వాలి
నిరుద్యోగిత పెరిగితే నగదు బదిలీ అంశాన్నీ పరిశీలించాలి
‘ఈనాడు ముఖాముఖి’లో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు
ఎంఎల్‌ నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

ఆరోగ్యంతో పాటు విద్యారంగం కూడా నిర్లక్ష్యానికి గురవుతోంది. జీడీపీలో విద్యకు 6శాతం, ఆరోగ్యానికి 4 శాతమైనా ఖర్చు చేయాలని ప్రపంచబ్యాంకు లాంటి సంస్థలు కూడా సూచించాయి. ఎప్పుడూ దాంట్లో సగం కూడా ఖర్చు చేయలేదు.  ప్రివెంటివ్‌, ప్రైమరీ హెల్త్‌కేర్‌పై ఎక్కువగా ఖర్చుపెట్టాలి. అలా కాకుండా భవనాలు, ఉపయోగపడని వాటిపైన ఖర్చు చేస్తే ప్రయోజనం ఉండదు. విద్యలో కూడా అంతే. ఈ రెండింటిలోనూ ఎక్కువ ఖర్చు చేయడంతో పాటు, సమర్థంగా ఖర్చు చేసే దృక్పథంతో ముందుకెళ్లాలి.

తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి కరోనా ముందటి పరిస్థితికి రావడానికి కనీసం మూడేళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. గత ఏడాది మైనస్‌ 7.3 శాతంతో తిరోగమనంలోకి వెళ్లిన వృద్ధిరేటు ఈ ఏడాది 9.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసిందని, అయితే ప్రధాన అంకెల్లోనే చాలా విషయాలు దాగి ఉన్నాయని విశ్లేషించారు. రెండు వృద్ధిరేట్లను పోల్చి చూసినపుడు రికవరీ ఉన్నట్లు కనిపించినా, గ్రామీణ, పట్టణ నిరుద్యోగం పెరగడం, పేదరికంలోకి మరింత మంది వెళ్లడం లాంటి అనేక అంశాలు కనిపిస్తాయన్నారు. కరోనా మూడో దశ ఎలా ఉంటుంది, దానిని తక్కువ నష్టంతో ఎలా ఎదుర్కోగలం తదితర అంశాలపై వృద్ధిరేటు ఆధారపడి ఉంటుందని ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్బారావు వెల్లడించారు.

కరోనా రెండోవేవ్‌ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది. దీని పర్యవసానాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయా ?
ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. 2021-22లో వృద్ధిరేటు 10.5 శాతం ఉండొచ్చని రెండు నెలల క్రితం ఆర్‌బీఐ అంచనా వేసింది. గత వారం దీనిని 9.5 శాతానికి తగ్గించింది. చివరకు ఏమవుతుందో తెలియదు. వృద్ధిరేటు 9.5 శాతం వచ్చినా, వాస్తవంగా చూసినపుడు ఇది ఎక్కువ కాదు. ఎందుకంటే తాజా అంకెల ప్రకారం గత ఏడాది వృద్ధిరేటు మైనస్‌ 7.3 శాతం. దాంతో పోల్చుకొని తొమ్మిదిన్నర శాతం వృద్ధి ఉంటుందని చెబుతున్నాం. వాస్తవానికి ఇది అంతకు ముందు రెండేళ్లనాటి పరిస్థితికి కూడా సమానం కాదు. అంకెలు అటుంచితే, అసంఘటిత రంగం చాలా సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థలో యాభైశాతం, ఉపాధిలో 80 శాతం మంది ఈ రంగం వారే. మొదటి దశ సంక్షోభం నుంచి తట్టుకొని ఆర్థికవ్యవస్థ నిలబడింది. రెండోవేవ్‌లో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సమస్య తీవ్రరూపం దాల్చింది. అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం అత్యధిక కుటుంబాలు మరింత పేదరికంలోకి వెళ్లాయి. ఆర్థికరంగాన్ని విశ్లేషించే సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ( సి.ఎం.ఐ.ఈ) తాజా అధ్యయనం ప్రకారం 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

రెండో దశ తీవ్రత దృష్ట్యా కేంద్రం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు ?

ఆర్థికపరంగా చూసినపుడు మొదటి దశలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని మద్దతివ్వడానికి ప్రాధాన్యమిచ్చాం. తర్వాత నగదు బదిలీ, మరికొన్ని చర్యలు తీసుకున్నాం. ఈ సంవత్సరం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కారణం గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వైరస్‌ చొచ్చుకుపోవడమే. గతం కంటే ఎక్కువ సంరక్షణ చర్యలు చేపట్టాలి. అది కూడా గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని జరగాలి. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. నిరుద్యోగ సమస్య తీవ్రత పెరిగితే నగదు బదిలీ అంశాన్నీ ఆలోచించాలి. అయితే ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ ప్రారంభమై ఎగుమతులకు అవకాశం ఏర్పడింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి అవసరమైన సాయం అందించాలి. రుణాలు అందుబాటులో ఉంచడం, నిబంధనల్లో మార్పులు చేయడం లాంటివి.

ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందని అంచనా ?
మూడోవేవ్‌ ఎలా ఉంటుందన్న దానిపై కోలుకోవడం ఆధారపడి ఉంది. ఎంత తక్కువగా, అదీ స్థానిక లాక్‌డౌన్‌లతో పరిస్థితిని అదుపులో ఉంచగలం అనేది చూడాలి. మరింత అవగాహన, జాగ్రత్త అవసరమని  రెండోవేవ్‌ వల్ల తెలిసింది. అయినా వరుస ప్రభావాల వల్ల నిరుద్యోగం, అసమానతలు పెరిగాయి. స్టాక్‌ మార్కెట్‌, బడా పరిశ్రమలపై ప్రభావం తక్కువైనా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఎక్కువగా పడింది. కరోనాకు ముందు కూడా మన ఆర్థిక పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. వరుసగా అయిదేళ్లు చూస్తే జీడీపీ వృద్ధి రేటు ఎనిమిది, ఏడు, ఆరు, నాలుగు శాతానికి తగ్గుతూ వచ్చి గత ఆర్థిక సంవత్సరం కరోనా వల్ల మైనస్‌ 7.3 శాతానికి చేరింది. మూడోవేవ్‌ ప్రభావం అంతగా లేకపోతే ఆర్థిక పరిస్థితి కరోనా మొదటి వేవ్‌ కంటే ముందటి స్థితికి రావడానికి మూడేళ్లకు పైగా పట్టే అవకాశం ఉంది.

ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ ప్రాధాన్యం కరోనాను సమర్థంగా ఎదుర్కోవడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడం, మూడో దశను కట్టడి చేసేందుకు సిద్ధం కావడం. దీంతోపాటు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వారిని, ప్రత్యేకించి పేదవారిని ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎగుమతులకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనే వారికి చేయూత అందించాలి.

రుణాల్లో వృద్ధి (క్రెడిట్‌ గ్రోత్‌)  కనిష్ఠ స్థాయికి పడిపోయింది.  వృద్ధి లేనిదే పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి రేటు పెరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితి  ఎప్పటికి మారుతుందంటారు ?
ప్రజల వినియోగం, కొనుగోలు శక్తి పెరగాలి. దీంతో డిమాండ్‌ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న  సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయడం లేదు. దీనికి కారణం డిమాండ్‌ లేకపోవడమే. వినియోగం పెరిగితే ఎక్కువ ఉత్పత్తి అవసరమవుతుంది, దీనివల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది.

నిన్న మొన్నటివరకు బ్యాంకులను మొండిబాకీలు వేధించాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి గాడిలో పడుతుందనుకుంటే మళ్లీ సెకండ్‌వేవ్‌ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీనివల్ల రాని బాకీల ఒత్తిడి బ్యాంకులపై పెరుగుతుందా ?
గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు మైనస్‌ 7.3 శాతానికి పడిపోవడం, మధ్యతరహా, చిన్న పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలుంటాయి. గత నివేదిక ప్రకారమే నిరర్థక ఆస్తుల విలువ 13.5 శాతం వరకు ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ నెలాఖరుకు వచ్చే తదుపరి నివేదికలో ఈ రేషియో పెరిగే అవకాశాలే ఎక్కువ.

రెండో దశ వల్ల ఏయే రంగాల్లో ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు ?
ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అసంఘటిత కార్మికులు, ఒప్పంద ఉద్యోగులు, పర్యాటకం, హోటల్‌ పరిశ్రమ, రవాణా, విద్య ఇలా అన్నింటిపైనా ప్రభావం పడింది. వాటి అనుబంధ రంగాలూ దెబ్బతిన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని