బీడీల తయారీపై దెబ్బ
close
బీడీల తయారీపై దెబ్బ

కొవిడ్‌తో కుదేలవుతున్న పరిశ్రమ
  సతమతమవుతున్న కార్మికులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: బీడీ కార్మికులకు కొవిడ్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. బీడీల వాడకం ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో కంపెనీలు తయారీని సగానికి సగం తగ్గించేశాయి. ఈ పరిశ్రమలో కేవలం బీడీలు చుట్టే కార్మికులే కాకుండా దాదాపుగా 20కి పైగా అనుబంధ రంగాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిదారులు, ఆకు సేకరించేవారు, ప్యాకర్లు, టేకేదార్లు కంపెనీల్లో పనిచేసే సిబ్బంది, గంపలు, చాటల తయారీదార్లు, రవాణాదారులు ఇలా పలువురు లబ్ధిపొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరంలోపు పీఎఫ్‌ ఉన్న కార్మికులకు నెలనెలా జీవనభృతి కింద రూ.2,016 అందిస్తోంది. బీడీలు చుట్టడం ద్వారా వచ్చే ఆదాయానికి అదనంగా వచ్చే ఈ మొత్తంతో వారు కుటుంబాలను పోషిస్తున్నారు. కార్మికుల విన్నపంతో 2016 సంవత్సరం లోపు పీఎఫ్‌ ఉన్న వారందరికి జీవనభృతి చెల్లించాలని నిర్ణయించినప్పటికీ అమలు కాలేదు.
 రవాణాకు అవరోధాలు
బీడీల వినియోగం అధికంగా ఉండే మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లతో పాటు బిహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కొవిడ్‌ వైరస్‌ కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. సరకును ఆ ప్రాంతాలకు చేరవేయడం సమస్యగా మారుతోంది. గతంలో ఆరు నుంచి పది లారీల సరకు రవాణా జరగగా ప్రస్తుతం రెండు మూడు రోజులకో లారీ వెళ్తోంది. పరిశ్రమల నిర్వాహకులు తయారీని తగ్గించేశారు. దీనిపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కరవైంది.    
తగ్గిన ఉపాధి
ఒక్కో కార్ఖానా పరిధిలో యాభై నుంచి అరవై మంది టేకేదారుల ఆధ్వర్యంలో కార్మికులు బీడీలు చుట్టే పనులు చేస్తుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్ఖానాలు ఉదయం పది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. గతంలో ప్రతి టేకేదారు నుంచి బీడీలను సేకరించిన కార్ఖానాల నిర్వాహకులు ప్రస్తుతం రోజుకు పది నుంచి పదిహేను మంది నుంచే తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలు నెలకు వారం రోజులు మాత్రమే పని కల్పిస్తున్నాయి.
కష్టంగా తునికాకు సేకరణ
వేసవిలో బీడీల తయారీకి వినియోగించే తునికాకు సేకరణ లాక్‌డౌన్‌ కారణంగా సజావుగా సాగలేదు. ప్రధానంగా ఏటా ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఏప్రిల్‌, మే నెలలో జరుగుతుంది. గిరిజనులు పెద్దఎత్తున వైరస్‌ బారిన పడుతూ రావడంతో ఈ ఏడాది లక్ష్యం చేరడం కష్టసాధ్యంగానే మారిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

* కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బీడీ కార్మికులు అధికంగా ఉంటారు. రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే బీడీ తయారీ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. నలభై ఏళ్ల నుంచి ఇక్కడ 40 నుంచి 45 పరిశ్రమల్లో తయారీ కొనసాగుతోంది.

25 రోజుల్లో 8 రోజులే పని
  - లలిత, దోమకొండ, కామారెడ్డి

గతంలో ప్రతి నెల 20 నుంచి 25 రోజుల పనిదినాలు లభించేవి. గడిచిన 25 రోజుల్లో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పనిదొరికింది. గత కొన్నేళ్లుగా బీడీలు చుట్టి కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రస్తుతం ఏం చేయాలో తోచడం లేదు.

ప్రత్యామ్నాయం చూపించాలి
- వనిత, దోమకొండ, కామారెడ్డి

వైరస్‌ వ్యాప్తి కారణంగా తునికాకు సేకరణ సమస్యగా మారింది. భవిష్యత్తులో బీడీలు తయారీకి అవసరమయ్యే ఆకు లభించేలా లేదు. ఉపాధి కష్టం కావొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని