లేట‘రైట్‌.. రైట్‌’
close
లేట‘రైట్‌.. రైట్‌’

బమిడికలొద్దు క్వారీ తవ్వకాలకు సన్నాహాలు
తూ.గో.జిల్లా పరిధిలో రహదారి పనులు
నేలకూలిన వేలాది చెట్లు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, నాతవరం: విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్న వివాదాస్పద లేటరైట్‌ గనుల్లో తవ్వకాలకు జోరుగా అడుగులు పడుతున్నాయి. అయిదేళ్ల పాటు కోర్టు వివాదాల్లో నలిగిన బమిడికలొద్దు క్వారీలో కదలిక వచ్చింది. దీనికి ఆనుకుని ఉన్న మరో క్వారీలోనూ తవ్వకాల కోసం కొందరు పావులు కదుపుతున్నారు. గతంలో నిలిచిపోయిన క్వారీలన్నింటినీ పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం ఉమ్మడి సరుగుడు పంచాయతీ పరిధిలో సుందరకోట, బమిడికలొద్ది, అసనగిరి, తొరడ, ముంతమామిడి, సిరిపురం, మాసంపల్లి, సరుగుడు రెవెన్యూ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన లేటరైట్‌ నిక్షేపాలున్నాయి. వీటిలో బమిడికలొద్ది పరిధిలో 121 హెక్టార్ల క్వారీ ఒకటి ఉంది. దీనికి 2009లో కొయ్యూరు మండలం జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడు దరఖాస్తు చేశారు. అప్పట్లో అతను గిరిజనుడు కాదని, పంచాయతీ తీర్మానం లేదని, తప్పుడు పత్రాలతో నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) పొందారని కొందరు కోర్టుకు వెళ్లారు. 2018 ఆగస్టులో లీజుదారునికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆరు నెలల తరవాత కోర్టు ధిక్కారం కేసు వేశారు. గత ప్రభుత్వంలో లీజుదారుని వెనకున్న నేతలకు, స్థానిక పెద్దలకు వ్యవహారం నప్పకపోవడంతో ఈ క్వారీలో తవ్వకాలకు అనుమతించలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వారీ నిర్వాహకులు మరలా రంగంలోకి దిగారు.అధికార పార్టీ పెద్దలను కలిశారు. న్యాయస్థానం కూడా ధిక్కారణ కింద చర్యలు తీసుకుంటామని ఇటీవల అధికారులను హెచ్చరించడంతో క్వారీ తవ్వకాలకు మైన్స్‌ అధికారులు అనుమతులిచ్చారు. ఇన్నాళ్లు వివాదంతో నిలిచిన ఈ క్వారీ నిర్వహణకు అనుకూలంగా రహదారి నిర్మాణ పనులను చకచకా చేసేస్తున్నారు. విశాఖ జిల్లా పరిధిలో కాకుండా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం రాగవపట్నం, జలదాం, సార్లంక, సిరిపురం మీదుగా క్వారీ వరకు దశల వారీగా ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. క్వారీ అవసరాల కోసం అని కాకుండా స్థానిక గ్రామస్థుల కోసమే ఈ రహదారి నిర్మాణమంటూ చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 14 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న వేల చెట్లను నేలకూల్చేశారని స్థానిక పీసా కమిటీ సభ్యుడు బి.కృష్ణ ఆరోపిస్తున్నారు. ఇక్కడ క్వారీ మొదలుపెడితే తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం పంపా నది కాలువ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ విషయమై అనకాపల్లి గనులశాఖ ఏడీ ప్రకాష్‌ కుమార్‌ వద్ద ప్రస్తావించగా బమిడికలొద్ది క్వారీకి సంబంధించి కోర్టుతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.  క్వారీకి రహదారి నిర్మాణంపై రౌతులపూడి అటవీ సెక్షన్‌ అధికారి నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఆ రోడ్డులో కేవలం 480 మీటర్లే అటవీశాఖకు చెందిన స్థలం ఉందన్నారు. దీనికి కూడా అనుమతులు తీసుకున్నట్లు తెలిసిందన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని