సర్దుబాటు షాక్‌
సర్దుబాటు షాక్‌

ప్రజలపై రూ.3,669 కోట్ల విద్యుత్‌ భారం
సెప్టెంబరు నుంచే వసూలు  
వచ్చే 8 నెలల వరకు అదనపు మోత
ఈనాడు - అమరావతి

సలే కరోనా ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రజలపై విద్యుత్తు భారం పడనుంది. సర్దుబాటు వ్యయం పేరిట వినియోగదారులకు బిల్లుల షాక్‌ తగలనుంది. నెలవారీ విద్యుత్‌ వినియోగం ఆధారంగా వారిపై అదనపు ఛార్జీల భారం పడనుంది. 2014-15 నుంచి 2018-19 మధ్య అయిదేళ్లలో విద్యుత్‌ సరఫరా వ్యయం... వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసం రూ.3,669 కోట్లుగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ధారించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి డిస్కంలకు అనుమతించింది. సెప్టెంబరులో జారీ చేసే బిల్లుల నుంచే ఇంధన సర్దుబాటు ఛార్జీల అదనపు వడ్డనకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రానున్న 8 నెలలపాటు సమాన వాయిదాల్లో 10.3% వడ్డీతో కలిపి వసూలు చేయనున్నాయి. రాష్ట్రంలోని 1.47 కోట్ల గృహ, 14.65 లక్షల వాణిజ్య, 1.63 లక్షల పారిశ్రామిక వినియోగదారులపై భారం పడుతుంది. అయితే 2019 ఏప్రిల్‌ 1 తర్వాత కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ట్రూఅప్‌ నిబంధన వర్తించదు.

డిస్కంల ప్రతిపాదన రూ.7,225 కోట్లు

ఎస్‌పీడీసీఎల్‌ రూ.5,889 కోట్లు, ఈపీడీసీఎల్‌ రూ.1,336 కోట్లను ట్రూఅప్‌ కింద అనుమతించాలని ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలను అందించాయి. రెండు డిస్కంలు కలిపి ఇచ్చిన రూ.7,225 కోట్ల ప్రతిపాదనలను పరిశీలించి రూ.3,669 కోట్ల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. ఇందులో ఎస్‌పీడీసీఎల్‌వి రూ.3,060 కోట్లు, ఈపీడీసీఎల్‌వి రూ.609 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాలను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ అంచనాల ఆధారంగా 8 నెలల్లో వసూలు చేస్తాయి. ట్రూఅప్‌ వసూలు పూర్తయిన తర్వాత వివరాలను డిస్కంలు ఏపీఈఆర్‌సీకి ఇస్తాయి. ట్రూఅప్‌లో హెచ్చు తగ్గులను మరుసటి ఏడాది టారిఫ్‌లో ఏపీఈఆర్‌సీ సర్దుబాటు చేస్తుంది. డిస్కంలు దాఖలు చేసిన వార్షిక లెక్కల ప్రకారం అయిదేళ్లలో ఎస్‌పీడీసీఎల్‌ రూ.12,539 కోట్లు, ఈపీడీసీఎల్‌ రూ.7,745 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, ఇది రాష్ట్రానికి, విద్యుత్‌ వినియోగదారులకు మంచిది కాదని ఏపీఈఆర్‌సీ వ్యాఖ్యానించింది.

అద్దె ఇళ్లలో ఉండే వారి నుంచి విమర్శలు రాకుండా... ప్రస్తుత విద్యుత్తు వినియోగం ఆధారంగా ట్రూఅప్‌ వసూలు చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. పాత విధానంలో ట్రూఅప్‌కు అనుమతించిన సంవత్సరంలోని వినియోగం ఆధారంగా బిల్లులో అదనపు మొత్తాన్ని కలిపి ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారి నుంచి వసూలు చేసేవారు. గతంలో ఆ ఇంట్లో అద్దెకున్న వారు ఎడాపెడా విద్యుత్‌ వినియోగించి ఉంటే.. ఆ భారం ప్రస్తుతమున్న వారిపై పడేది. దీనివల్ల తలెత్తే వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌ ఆధారంగానే వసూలు చేయాలని ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది.

* అయితే ఏపీఈఆర్‌సీ అనుమతించిన విధానంతో వినియోగదారులపై అధిక భారం పడుతుందని విద్యుత్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఏడేళ్ల కిందటి నుంచి విద్యుత్‌ వినియోగాన్ని ట్రూఅప్‌ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే ప్రతి ఇంట్లో విద్యుత్‌ ఉపకరణాల వాడకం పెరిగి కరెంటు వినియోగం దాదాపు రెట్టింపు ఉంటుంది. దీని ఆధారంగా ట్రూఅప్‌ వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులు నష్టపోతారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉచిత విద్యుత్‌ ట్రూఅప్‌ ఎలా?

* రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌కు సంబంధించిన రూ.915.33 కోట్ల ట్రూఅప్‌ మొత్తాన్ని డిస్కంలు ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాలి. రాష్ట్రంలో 17.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం అంగీకరించకుంటే ఆ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని ఏపీఈఆర్‌సీ సూచించింది.

* అలాగే వివిధ వర్గాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ట్రూఅప్‌ను కూడా ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వం ఇవ్వకుంటే వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు.

ట్రూఅప్‌ అంటే...

విద్యుత్‌ సంస్థలు ఏటా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించే మొత్తం, సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు వ్యయం, సరఫరాలో నాణ్యత పెంచటానికి చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను ఏపీఈఆర్‌సీ ప్రతి సంవత్సరం ఆమోదించే టారిఫ్‌ ఆర్డర్‌లో సూచిస్తుంది. ఈమేరకు డిస్కంలు వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఏపీఈఆర్‌సీ ఆమోదించిన అంచనాలకు మించి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయ్యే అదనపు వ్యయం మొత్తాన్ని ఏటా ట్రూఅప్‌ పేరిట వసూలుకు డిస్కంలకు అనుమతిస్తుంది.


రెండు డిస్కంలు... వేర్వేరు టారిఫ్‌లు

అదనపు వసూలుకు రెండు డిస్కంల పరిధిలో వేర్వేరు టారిఫ్‌లను ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది.


ఉదాహరణకు 200 యూనిట్లు వినియోగించే ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని వినియోగదారునిపై నెలకు సుమారు రూ.250 వంతున  భారం పడుతుంది. అదే ఈపీడీసీఎల్‌ పరిధిలోని ఆ స్థాయి వినియోగదారుడు రూ.90 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.


వినియోగదారులపై ఎంత భారం?

దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ  (ఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో గరిష్ఠంగా యూనిట్‌కు రూ.1.27


తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో గరిష్ఠంగా యూనిట్‌కు 45 పైసలుమరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని