బీసీల సంపూర్ణ వికాసానికి పటిష్ఠ కార్యాచరణ
బీసీల సంపూర్ణ వికాసానికి పటిష్ఠ కార్యాచరణ

క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం

ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల్లోనూ వినతులు

కులగణనతో వెనకబడిన వర్గాల పురోగమనం

‘ఈనాడు’తో రాష్ట్ర  బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంపూర్ణ వికాసమే  లక్ష్యంగా పటిష్ఠ కార్యాచరణతో క్రియాశీలకంగా పనిచేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. అంకితభావంతో పనిచేసి తెలంగాణకు పేరు తెస్తామని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలు, అధ్యయనం, సమావేశాల ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటామన్నారు. ప్రత్యేక వెబ్‌సైట్‌  ప్రారంభిస్తామన్నారు. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారానూ వినతులను స్వీకరిస్తామన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సత్వరమే స్పందించే ప్రభుత్వం ఉందని, సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తుందని తెలిపారు.గత కమిషన్‌ అత్యంత వెనకబడిన 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయగా ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బీసీల రిజర్వేషన్ల అమలు అత్యంత ప్రాధాన్యాంశంగా భావిస్తామని, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో తప్పనిసరిగా అవి అమలయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. బీసీలకు కులగణనతో అన్ని విధాలా మేలు జరుగుతుందని, దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేపట్టాలన్నారు. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులు బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వకుళాభరణంతో మంగళవారం ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. 

బీసీ కమిషన్‌ ప్రాథమ్యాలు, కర్తవ్యాలేమిటి?

చట్టబద్ధ కమిషన్‌గా బీసీల అభ్యున్నతికి కొత్త బాటలు వేయడమే మా కర్తవ్యం. జనాభాలో సగానికి పైగా బీసీలే. అందరూ కులవృత్తిదారులు, కష్టజీవులు. సంచార, అర్ధసంచార, విముక్త కులాల వారున్నారు. వారిలో సామాజిక వెనకబాటుతనాన్ని దూరం చేసి, ఎలాంటి వివక్ష లేకుండా సమానావకాశాలు కల్పించడం ద్వారా వారికి న్యాయం జరుగుతుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలతో ముందుకుసాగుతోంది. ఈ కృషిలో  బీసీ కమిషన్‌ భాగస్వామిగా నిలుస్తుంది. బీసీల వాస్తవ స్థితిగతులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

బీసీ కమిషన్‌లో మూడు దఫాలు సభ్యులుగా పనిచేసి, ఛైర్మన్‌ అయ్యారు. మీ అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తారు?

ఇది నాకు అరుదైన అవకాశం. సభ్యునిగా బీసీలకు న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేశాను. ఇప్పుడు ఛైర్మన్‌గా గురుతర బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. బీసీలకు సంబంధించిన సమస్త అంశాలు మననంలో ఉన్నాయి. అన్ని రకాల కమిషన్లపై సంపూర్ణ అవగాహన ఉంది..

ఇప్పుడు బీసీల ఆకాంక్షలెలా ఉన్నాయి?

బీసీలు సామాజిక, ఆర్థిక ప్రగతిని ఆశిస్తున్నారు. వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు వీలుగా అంతర్గతంగా గ్రూపుల మార్పిడిని కోరుతున్నారు. బీసీ జాబితాలో చేర్చాలని పలు కులాలు అడుగుతున్నాయి. కొందరు కులాల పేర్లు మార్చాలని విన్నవిస్తున్నారు. రజక, వడ్డెర తదితర కొన్ని కులాల వారు తమను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని అడుగుతున్నారు. రిజర్వేషన్ల అమలును కోరుతున్నారు.

రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన గణాంకాలు సరిగా ఉన్నాయా?

బీసీల సామాజిక, విద్యా, ఆర్థిక ప్రగతికి గణాంకాలు కీలకమైనవి. బీసీల సంఖ్య ఎంత ఉందో కచ్చితంగా తెలియడం లేదు. వాస్తవానికి ఈ గణాంకాల రూపకల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే జనగణనలో  ఎస్సీ, ఎస్టీల గణాంకాలు తీస్తున్నారు. బీసీ కులాల వారిగా చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్రం దీనికి చొరవ చూపడం లేదు. 2011లో బీసీ కులాల లెక్కలున్నాయని, రాష్ట్రాలకు పంపిస్తామని కేంద్రం తెలిపింది. 2015లో నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అర్వింద్‌ పనగరియా ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు జరిగినా ఇప్పటివరకు బీసీల లెక్కలు తేలలేదు. ఇప్పుడు వెంటనే బీసీ కులాల వారిగా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి.

కమిషన్‌ పాలన ఎలా సాగుతుంది?

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎక్కడే సమస్య మా దృష్టికి వచ్చినా స్పందిస్తాం. సమస్యలున్న వారు కార్యాలయానికి రావచ్చు, ఆన్‌లైన్‌, ట్విటర్‌, వాట్సప్‌ తదితర సామాజిక మాధ్యమాలను సైతం వినియోగిస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని