కరోనా పేరిట కారుచౌకగా లీజు
కరోనా పేరిట కారుచౌకగా లీజు

మహిళా సహకార సంస్థ భవనంలోని ఓ అంతస్తు అప్పగింత
మరో రెండింటిని మరింత తక్కువకే ఇచ్చేందుకు యత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా సహకార అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీడీసీ) ఆస్తులను కారుచౌకగా లీజుకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్లుగా సంస్థ కార్యకలాపాలను తగ్గించిన సర్కారు.. కరోనా పేరిట ఆదాయం సమకూర్చుకునేందుకు సంస్థ ఆస్తులను లీజుకు ఇస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.45లో ఉన్న సంస్థ భవనంలºని ఒక అంతస్తును అతి తక్కువ ధరకు ఓ సంస్థకు మహిళా, శిశు సంక్షేమశాఖ కేటాయించింది. తాజాగా మరో రెండు అంతస్తులను మరింత తక్కువ ధరకు దక్కించుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అమీర్‌పేటకు కార్యాలయం తరలింపు
మహిళలకు ఒకేషనల్‌ కోర్సులు, నైపుణ్య శిక్షణ, వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్ల నిర్వహణ, మహిళా సమాఖ్యల ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్‌ కార్యక్రమాల కోసం సంస్థ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్‌లో జీ+2 అంతస్తుల ప్రధాన కార్యాలయ భవనం, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లు, శిశువికాస కేంద్రాల భవనాలు ఉన్నాయి.  శిక్షణ కేంద్రాన్ని, కార్యాలయాన్ని ప్రభుత్వం ఇటీవల అమీర్‌పేటలోని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి తరలించారు.

మార్కెట్‌ ధరలో సగానికన్నా తక్కువే..
కరోనాకు ముందు జూబ్లీహిల్స్‌ వాణిజ్య ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో చదరపు అడుగుకు లీజు, అద్దె ధర రూ.120-140 వరకు పలికింది. చుట్టుపక్కల రూ.80 వరకు ఉండేది. కరోనా కారణంగా ధర దాదాపు 20-30 శాతం పడిపోయిందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని సంస్థ భవనంలోని అంతస్తులను లీజుకు ఇచ్చేందుకు ఆరు నెలల క్రితం కనీస ధర పేర్కొనకుండా మహిళా, శిశు సంక్షేమశాఖ టెండర్లు పిలిచింది. కరోనా సమయంలో సమాచారం లేక ఎవరూ ముందుకు రాలేదు. ఆ తరువాత పలు సంస్థలు తక్కువ ధరకు దక్కించుకునేందుకు యత్నాలు ప్రారంభించాయి. రాజకీయ ప్రమేయం పెరగడంతో ఒక అంతస్తును చదరపు అడుగుకు రూ.35 చొప్పునే కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం రూ.80 కన్నా తక్కువ ధర లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మిగతా రెండు అంతస్తులను రూ.20-25 ధరకే దక్కించుకునేందుకు సంక్షేమశాఖపై కొన్ని వ్యాపార సంస్థలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయితే కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయ భవనాన్ని నిబంధనల మేరకు లీజుకు ఇస్తున్నామని మహిళా, శిశు సంక్షేమశాఖ వర్గాలు పేర్కొన్నాయి. టెండర్లలో మూడు సంస్థలు పాల్గొనగా.. అత్యధికంగా కోట్‌ చేసిన సంస్థకు ఒక అంతస్తు ఇచ్చామని, మిగతా రెండు అంతస్తుల లీజుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని