ఆరోగ్యశ్రీలో వసూల్‌ రాజాలు...
ఆరోగ్యశ్రీలో వసూల్‌ రాజాలు...

కేసును బట్టి డబ్బుల డిమాండ్‌

రోగులకు ఫోన్‌ చేసి అనుమతుల పేరిట ఒత్తిడి

సమాచారాన్ని తస్కరించి సహకరిస్తున్న సిబ్బంది

సూర్యాపేటకు చెందిన ఒక మహిళ గుండె సంబంధ సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యశ్రీ కింద సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. అనుమతి రావడానికి రూ.5 వేలివ్వాలని ఒక వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. తర్వాత 2 రోజులకు కూడా అనుమతులు రాకపోవడంతో సదరు వ్యక్తి అడిగినంతా ఇచ్చేశారు. చిత్రంగా మరుసటిరోజే చికిత్సకు అనుమతి వచ్చేసింది. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బందే ఉద్దేశపూర్వకంగా తమ పని జరగకుండా జాప్యం చేశారని బాధితులు అనుమానించారు. ఈ తరహా మోసాలు తాజాగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది.


నల్గొండకు చెందిన ఒక వ్యక్తి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి కోసం వేచిచూస్తున్న క్రమంలో.. బాధితుడికి ఒక వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘‘మీ చికిత్సకు రూ.34 వేలు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స జరుగుతుంది. మీకు అనుమతి త్వరగా వచ్చేలా చేయాలంటే మూడువేలు ఇవ్వాలి. లేదంటే అనుమతి ఆలస్యమవుతుంది. రాకపోవచ్చు కూడా’’ అని ఒత్తిడి తేవడంతో బాధితుడు ఆందోళనకు గురై.. అతను చెప్పిన వ్యక్తికి అడిగినంత సొమ్ము ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతులు వచ్చేశాయి.


ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారిలో అత్యధికులు నిరుపేదలే. వీరిలో అక్షరాస్యులు కూడా తక్కువే. వీరికి పథకం అనుమతులపై అవగాహన తక్కువ. వీరి అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకొని దళారులు సులువుగా మోసగిస్తున్నారు. కొందరు ఆరోగ్యశ్రీ సిబ్బంది.. దళారులతో కుమ్మక్కై రోగి చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేట, నల్గొండ, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో సమాచార చౌర్యం జరిగినట్లు ట్రస్టు ఉన్నతాధికారులు రెండేళ్ల క్రితం గుర్తించారు. దళారులపై కేసు నమోదు చేసి.. వారికి సహకరించిన సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి మోసాలు మొదలైనట్లు తాజా ఉదంతాలను బట్టి అర్థమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద రోగి ఆసుపత్రుల్లో చేరగానే.. చికిత్సకు అనుమతినిస్తూ ట్రస్టు నుంచి రోగి సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుంది. అప్పుడు చికిత్స కోసం అనుమతి పంపడంలోనే కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి.. ఆనక అనుమతులిచ్చి రోగుల నుంచి సొమ్ము పిండుకుంటున్నారు.

తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి...

ఒకపక్క దళారులు మోసాలు కొనసాగుతుండగానే.. మరోవైపు రెండేళ్ల కిందట ఇవే ఆరోపణలతో ఉద్యోగాల నుంచి తొలగించిన సిబ్బందిలో కొందరిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ రాజకీయ ఒత్తిళ్లు అధికమైనట్లు ఆరోగ్యశ్రీ అధికారులు వాపోతున్నారు. ఈ తరహా మోసాల్లో దళారులకు సహకరించే వారిలో క్షేత్రస్థాయి ఆరోగ్యశ్రీ సిబ్బంది సహా జిల్లా స్థాయి అధికారులు భాగస్వాములవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పూర్తి స్థాయి ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) లేకపోవడం కూడా పథకానికి శాపంగా మారింది. వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శే ఇన్‌ఛార్జిగా ఉండటంతో.. సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారని, పథకం సక్రమ అమలుకు సమగ్ర ప్రక్షాళన అవసరమనే భావన వ్యక్తమవుతోంది.

ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ఈ తరహా మోసాలపై ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులను ఫోన్‌లో ‘ఈనాడు’ సంప్రదించగా.. గతంలో బాధితులపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు అలాంటి వాటిపై కఠిన వైఖరి అవలంబిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ అమలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా ‘104’ ఫోన్‌ నంబరుకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదా ఆరోగ్యశ్రీ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) పేరిట లేఖ రాసినా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.

నిందితుడిపై నేడు కేసు నమోదు

ఈ పథకంలో దళారుల పాత్రపై నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ అధికారుల దృష్టికి రావడంతో అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఆరా తీసి నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా కనుగొన్నారు. ఇతను రోగుల నుంచి రూ.55 వేలను వసూలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్టులో పరిధిలో పనిచేసి మానేసినట్లు తేలింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు, నల్గొండ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై బుధవారం హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా సంఘటనలు జరిగాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయనున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని