వంటకో దండం.. భోజనానికి గండం
వంటకో దండం.. భోజనానికి గండం

గిట్టుబాటు కాని సర్కారు ధరలు 

వండి పెట్టలేమంటున్న వంట ఏజెన్సీ మహిళలు

బతిమాలుతున్న ప్రధానోపాధ్యాయులు

కొన్ని చోట్ల ఉపాధ్యాయులే గరిట తిప్పుతున్న దుస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవస్థలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతూండడం... ఇచ్చేవి కూడా ఇప్పటి ధరలకు అనుగుణంగా లేకపోవడంతో వంట ఏజెన్సీ బాధ్యతల నుంచి మహిళలు వైదొలుగుతున్నారు. చాలాచోట్ల నెలల తరబడి...కొన్ని చోట్ల సంవత్సరం వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అసలే పేదలమని...దుకాణాల్లో అప్పు పుట్టట్లేదని వేరే వారిని చూసుకోండని తెగేసి చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయులు బుజ్జగించినా కొన్ని చోట్ల వారు విముఖత చూపుతుండటంతో ఉపాధ్యాయులే వంట కార్మికులుగా మారిపోతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకున్నా... కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని, భోజన ధరలను పెంచకున్నా సర్కారు బడుల్లో వండి వడ్డించేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి త్వరలోనే రానుందన్న ఆందోళనను ఉపాధ్యాయవర్గాలు వ్యక్తంచేస్తున్నాయి.


గౌరవ వేతనంగా నెలకు రూ.వెయ్యే

రాష్ట్రంలోని దాదాపు 25 వేల పాఠశాలల్లో 52 వేల మంది మహిళలు వంట కార్మికులుగా ప్రతిరోజూ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.వెయ్యి ఇస్తారు. అది గత దశాబ్దంన్నరగా పెరగడం లేదు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు రూ.వెయ్యికి అదనంగా రూ.వెయ్యి నుంచి 10 వేల వరకు చెల్లిస్తున్నాయి. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా నూనె, పప్పులు, కూరగాయలు మొదలైనవి ఆయా మహిళలే సమకూర్చుకోవాలి. అందుకు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.97లు, 6-10 తరగతుల విద్యార్థులకు రూ.7.45లను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ధరలను ఏటా 5 శాతం వరకు పెంచుతున్నారు. భోజనానికి అవసరమైన ఆయా వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. లీటరు నూనె ఏకంగా రూ.100 నుంచి రూ.165కు చేరింది. మొదట వాటిని మహిళలు కిరాణా దుకాణాల్లో అప్పు పెట్టి తెస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతూడటంతో దుకాణదారులు అప్పు ఇవ్వడం లేదు.


ఇచ్చేది రూ.4.. కొనేది రూ.5లకు

పిల్లలకు వారానికి మూడు రోజులు గుడ్లు ఇవ్వాలి. ఒక్కో దానికి ప్రభుత్వం రూ.4లు చెల్లిస్తుండగా...బయట దుకాణాల్లో రూ.5లకు అమ్ముతున్నారు. దాంతో ఒక్కో గుడ్డుపై రూపాయి అదనపు భారం మోయాల్సి వస్తోంది. ‘చాలా చోట్ల వారానికి రెండే గుడ్లు ఇస్తున్నారు. అయినా మేం ఏమీ మాట్లాడని పరిస్థితి ఉంది. ఏదన్నా అంటే మానేస్తామంటున్నారు’ అని కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఒకరు చెప్పారు. 2019-20 విద్యా సంవత్సరంలో 9, 10 తరగతులకు ఇచ్చిన గుడ్ల బిల్లులు రెండు నెలల క్రితమే విడుదల చేయడం గమనార్హం.


ఇదీ దుస్థితి...

ఈనెల ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల వంట కార్మికులు రాలేదు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కార్మికులు తమకు బాధ్యతలు వద్దని రాసిచ్చారు. తమకు ఏడాదికాలంగా ప్రభుత్వం నుంచి రూ.లక్షకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి వైదొలిగారు. దాంతో అక్కడ ప్రధానోపాధ్యాయుడు రమేష్‌ చొరవ తీసుకొని వంట వండి పిల్లలకు పెడుతున్నారు. ఆ మండలంలో మరో మూడు పాఠశాలల్లో కూడా వంట కార్మికులు మానేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం సుల్తానాబాద్‌ ప్రాథమికోన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. ఉపాధ్యాయులు రెండు మూడు రోజులు వండిపెట్టారు. మండల యంత్రాంగం మొత్తం కదిలి అక్కడ ఏదో విధంగా కొత్త వారిని నియమించింది. ‘పిల్లల కోసం మహిళలను బతిమలాడుకోవాల్సి వచ్చింది’ అని ప్రధానోపాధ్యాయుడు, గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్‌ చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని