జోరు సరే.. జర భద్రం
జోరు సరే.. జర భద్రం

సెన్సెక్స్‌ 60,000 పాయింట్లు

నిఫ్టీ 17,800 పాయింట్ల పైకి

స్టాక్‌మార్కెట్‌లో కొత్త రికార్డులు

చిన్న మదుపర్లే ఇం‘ధనం’

పెట్టుబడులపై యువత ఉత్సాహం

నెల వ్యవధిలోనే సూచీల శరవేగం

ఈనాడు - హైదరాబాద్‌

ఒక్కో షేరుకు ఉన్న వాస్తవిక విలువ ఎంత, ఏ ధరలో దాన్ని కొనవచ్చు, మంచి ప్రతిఫలం రావడానికి ఎంతకాలం ఉండాలి. ఆ క్రమంలో ఎదురయ్యే రిస్కు ఏమిటి? అనే ప్రాథమిక సూత్రాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ఈరోజు కొని, తెల్లారేసరికి ధనికులం అయిపోవాలనే ఆలోచనే ఎక్కువమంది మదుపరులలో కనిపిస్తోంది. ఇవి ప్రమాదకర సంకేతాలని నిపుణులు భావిస్తున్నారు.

స్టాక్‌ మార్కెట్‌లో రికార్డుల మోతమోగుతోంది. సూచీలు పైపైకి పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ 60,000 పాయింట్లు అధిగమిస్తే, నిఫ్టీ 17,800 పాయింట్ల పైకి చేరింది. షేర్ల ధరలు పైపైకి పోతున్నాయి. ఒకపక్క విదేశీ సంస్థలు, మరోపక్క దేశీయ పెట్టుబడి సంస్థలు.. అదనంగా చిన్న మదుపరులు పోటీపడి పెట్టుబడులు పెడుతూ స్టాక్‌మార్కెట్ల చరిత్రను తిరగరాస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉద్దీపన పథకాలు, కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న ద్రవ్య విధానాల వల్ల నగదు లభ్యత పెరిగిపోవడం ఈ జోరుకు ప్రధాన కారణం కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న మదుపరులు స్టాక్‌మార్కెట్‌ వైపు ఆకర్షితులు కావడం మరొక ముఖ్యమైన అంశం.  కొత్త మదుపరులు, అందులోనూ యువత షేర్లపై జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులపై తగినంత అనుభవం, రిస్కుపై అవగాహన లేకపోయినా.. సొమ్ము కుమ్మరిస్తున్నారు. ఈ పరిస్థితిపై నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘షేర్ల ధరలు పెరగడమే కాదు, ఒక్కోసారి దారుణంగా పడిపోతాయి కూడా. దానికి సిద్ధంగా లేకుండా ఇష్టానుసారం పెట్టుబడులు పెట్టి నష్టపోతే తిరిగి కోలుకోవటం కష్టం’ అని హెచ్చరిస్తున్నారు. దూకుడుగా, అత్యాశతో, స్వల్పకాలిక దృష్టితో ముందుకు వెళ్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

సూచీల దూకుడు

ఈ ఏడాది మొదట్లో 48,000 పాయింట్ల వద్ద ఉన్న బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) సెన్సెక్స్‌ శుక్రవారం 60,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇదేకాలంలో ఎన్‌ఎస్‌ఈ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా) నిఫ్టీ 3,200 పాయింట్లు పెరిగి 17,800 పాయింట్లను అధిగమించింది. నెల రోజుల వ్యవధిలోనే సూచీలు శరవేగంగా పెరిగాయి. చిన్నా, చితకా కంపెనీల షేర్ల ధరలూ పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మదుపరులు తాము ఎక్కడ వెనుకబడిపోతామోనని జోరుగా కొనేస్తున్నారు.

‘రిటైల్‌’ పెట్టుబడుల వరద

గత ఏడాది కాలంలో ప్రతి నెలా 10 లక్షలమందికి పైగా మదుపరులు కొత్తగా స్టాక్‌మార్కెట్లో అడుగుపెడుతున్నారు. బీఎస్‌ఈలో ఖాతాదార్ల సంఖ్య 8 కోట్లకు మించింది. ఇప్పుడు స్టాక్‌మార్కెట్లో రిటైలర్లదే హవా. ప్రతిరోజూ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యే ‘ట్రేడింగ్‌ టర్నోవర్‌’లో రిటైలర్ల వాటా 2019-20లో 39 శాతం ఉండగా, ప్రస్తుతం అది 45 శాతానికి పెరిగింది. విదేశీ సంస్థల వాటా దాదాపుగా 12 శాతానికి, దేశీయ పెట్టుబడి సంస్థల వాటా 7 శాతానికి పరిమితం అవుతోంది. నేరుగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఇటీవల కాలంలో మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా కూడా చిన్న మదుపరులు పెట్టుబడులు పెడుతున్నారు. అందువల్ల మ్యూచువల్‌ ఫండ్లకు క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) ద్వారా ప్రతి నెలా రూ. 10,000 కోట్లకు పైగా లభిస్తున్నాయి. ఇంకా ఒకేసారి పెట్టే పెట్టుబడులు (వన్‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) దీనికి అదనం. దీంతో రిటైల్‌ సొమ్మే ఇంధనంగా స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి.

‘కరెక్షన్‌’ రాదా?

స్టాక్‌మార్కెట్లో ‘కరెక్షన్‌’ ముప్పు ఎప్పుడూ ఉంటుంది. సూచీలు, షేర్ల ధరలు బాగా పెరిగిన తరుణంలో ‘కరెక్షన్‌’కు అవకాశాలు చాలా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం షేర్ల ధరలు వాటి వాస్తవిక విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని, ఏ చిన్న సాకు దొరికినా ఆకస్మికంగా పతనం కావచ్చని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, ముడి చమురు ధర పెరగడం.. స్టాక్‌మార్కెట్‌ను ఇబ్బంది పెట్టే అంశాలు. చైనాలో అతిపెద్ద స్ధిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో, రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు వణికిపోయాయి. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఈ వారంలో రెండురోజుల పాటు నిర్వహించిన సమీక్ష అనంతరం అమెరికా కేంద్ర బ్యాంకు (యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌), బాండ్ల కొనుగోళ్లను ఈ ఏడాది నవంబరు నుంచి తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీనివల్ల నగదు లభ్యత (లిక్విడిటీ) నెమ్మదిగా తగ్గిపోతుంది. అంతేగాక వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వడ్డీ రేట్లు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. అదే జరిగితే నిధులు బాండ్‌ మార్కెట్‌కు తరలిపోవటం మొదలవుతుంది. స్టాక్‌మార్కెట్లలో ‘కరెక్షన్‌’ మొదలవుతుంది. ప్రస్తుతం యూఎస్‌లో 10 ఏళ్ల బాండ్లపై వడ్డీరేటు 1.41 శాతం వద్ద ఉంది. ఇది 2 శాతం మించితే స్టాక్‌మార్కెట్లకు కష్టకాలం మొదలైనట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే మన స్టాక్‌మార్కెట్‌ కూడా నేలచూపులు చూడటం మొదలవుతుంది. ఈ సంకేతాలను మదుపరులు గమనిస్తూ సరైన సమయంలో తమ పెట్టుబడులు తీసుకోవటానికి సిద్ధపడాలి. లేని పరిస్థితుల్లో ‘బేర్‌ మార్కెట్‌’ వచ్చి షేర్ల ధరలు బాగా పడిపోతే నష్టపోవలసి వస్తుంది. అందుకే ‘తస్మాత్‌ జాగ్రత్త’ అని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఎందుకీ జోరు?

కొవిడ్‌-19 ఫలితంగా గత ఏడాది ప్రారంభంలో స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించే లక్ష్యంతో మనదేశం సహా వివిధ దేశాలు ఉద్దీపన పథకాలను తెచ్చాయి. కరెన్సీ ముద్రణ, రాయితీల ప్రకటన, ప్రోత్సాహక పథకాల ఆవిష్కరణకు నడుం కట్టాయి. వడ్డీ రేట్లు తగ్గించాయి. ఈ చర్యలతో నగదు లభ్యత గణనీయంగా పెరిగింది. సురక్షిత పథకాలైన బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, కార్పొరేట్‌/ ప్రభుత్వ బాండ్లు, బంగారం మీద ప్రతిఫలం ఆకర్షణీయంగా లేదు. స్థిరాస్తిలో అందరూ పెట్టుబడి పెట్టలేరు. ఈ క్రమంలో స్టాక్‌మార్కెట్‌’పైకి ఎక్కువమంది దృష్టి మళ్లింది.


ఇతర సానుకూలతలు

* గత దశాబ్దకాలంగా మనదేశంలో వివిధ వ్యాపార రంగాల్లో స్థిరీకరణ చోటుచేసుకుని, బలహీన కంపెనీలు కనుమరుగయ్యాయి. బలమైన కంపెనీలే నిలిచాయి. మరింతగా పైకి ఎదిగే అవకాశం వాటికి లభిస్తోంది. స్టీలు, సిమెంటు, మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్‌, ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బీమా, టెలికాం.. తదితర రంగాల్లో ఈ పరిస్థితి ఉంది.

* ఈ రంగాల్లో అగ్రశ్రేణి కంపెనీలన్నీ స్టాక్‌మార్కెట్లో నమోదై ఉన్నాయి. వాటి ఆదాయాలు- లాభాల్లో ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తోంది. దానివల్ల షేరు ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది. పైగా ఇప్పుడు ‘బుల్‌ మార్కెట్‌’ కావటంతో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది.

* కార్పొరేట్‌ సంస్థలకు గతంతో పోల్చితే ప్రస్తుతం రుణభారం తక్కువగా ఉంది.

* దేశంలో బ్యాంకింగ్‌ రంగం మొండి బాకీల సమస్యను తట్టుకుని నిలిచింది. పైగా ప్రభుత్వం ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. బ్యాంకులు మొండిబాకీలను ‘బ్యాడ్‌ బ్యాంకు’కు బదిలీ చేసి, బయటపడతాయి. తదుపరి మరింత ఎక్కుగా వివిధ రంగాలకు రుణాలు జారీ చేయగలుగుతాయి.

* కరోనా ముప్పు తగ్గుముఖం పట్టడానికి తోడు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్‌ చేపట్టిన చర్యలు- ఆర్థిక, ద్రవ్య విధానాలతో వృద్ధి మళ్లీ పట్టాల మీదకు వస్తోంది. విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు 633 బిలియన్‌ డాలర్లకు మించిపోయాయి. ఆర్‌బీఐ వద్ద గతంలో లేనంత అధికంగా బంగారం నిల్వలు ఉన్నాయి. నెమ్మదిగా ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి.

* ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, అది అదుపు తప్పే పరిస్థితి లేదు.

* ఈ పరిస్థితులన్నీ కలిసి స్టాక్‌మార్కెట్లో సూచీలు, షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి. కానీ ఎంతవరకు, ఎన్నాళ్లు.. అనేదే ప్రశ్న.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని