వానల్లోనూ.. కారెందుకు కాలుతోంది!
వానల్లోనూ.. కారెందుకు కాలుతోంది!

వానాకాలంలోనూ రహదారులపైనే కార్లు తగలబడిపోతున్నాయి. ఇటీవల శంషాబాద్‌ బాహ్య వలయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. వాహనం నడుపుతున్న వైద్యుడు అందులోనే సజీవ దహనమయ్యాడు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలోనూ..

కొత్త మోడళ్ల కార్లు వస్తున్నాయి. అగ్నిమాపక వ్యవస్థ ఉన్న ఖరీదైన వాహనాలు తయారవుతున్నాయి. అగ్ని ప్రమాదాలకు గురికాకుండా కొన్ని పరికరాలను కార్లలో ఉంచినా సరే.. అంతర్గత లోపాలు, సరైన పరిశీలన లేకపోవడంతో కార్లలో మంటలు వ్యాపిస్తున్నాయి. ఎండాకాలంలో ఇది సాధారణమైనా.. వర్షాకాలంలోనూ ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి.

అనేక ఘటనలు..

పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిరోజుల క్రితం ఓ కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్‌తో పాటు ఒక మహిళ, చిన్నారి ముందే బయటపడ్డారు. ఖైరతాబాద్‌ కూడలిలో ఆగస్టు 4, 2021న, చందానగర్‌ సమీప నల్లగండ్లలో జులై 18, 2021న, శంషాబాద్‌ సమీప ఎయిర్‌పోర్ట్‌ కాలనీ వద్ద జులై 21, 2021న  ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.


అప్రమత్తత తప్పనిసరి..

* కారు నిర్వహణ క్రమంలో వృత్తినిపుణులే మరమ్మతులు చేయాలి. ఇంధనం మండించే విద్యుత్తు ఉపకరణాలకు అనుసంధానత ఉండాలి. స్పార్క్‌(మంట), ఇంధన సరఫరా పైపులో లోపాలుంటే మంటలు వస్తాయి.

* కారును తుడిచేటపుడు పాత వస్త్రాలకు ఇంధనం అంటుకోవడం సహజం.. వాటిని అలాగే బానెట్‌లో ఉంచడం వల్ల విద్యుదాఘాతంతో మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. కొత్త కారు కొన్నప్పుడు  క్షుణ్ణంగా పరీక్షించాలి.

* జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు మితిమీరిన వేగం కారణంగా కారులో ఇంజిను, ఇతర పరికరాలు ఎక్కువగా వేడెక్కుతాయి. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు లేదా అప్పటికే కారులో అంతర్గత లోపాలున్నప్పుడు మంటలు వస్తుంటాయి.


నడిపేటప్పుడు గమనించండి

ఆచార్య ఏవీఎస్‌ఎస్‌ కుమారస్వామి గుప్తా, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, జేఎన్‌టీయూ

కారు నడిపేటప్పుడు ఉష్ణోగ్రత సూచిక ఎర్ర మార్కు చూపిస్తే వెంటనే సరిచేసుకోవాలి. లూబ్రికేటింట్‌ ఆయిల్‌ రంగు సక్రమంగా ఉందా? లేదా? అనే విషయాన్ని సరిచూడాలి. నల్లగా ఉంటే చల్లదనం ఇచ్చే కూలెంట్‌ పనిచేయకపోవచ్చు. టైౖర్లు బాగున్నాయా? లేదా? గాలి సరిపోయినంత ఉందా? లేదా? గమనించాలి. దూరప్రయాణాలు చేసేప్పుడు 250 కిలోమీటర్ల తర్వాత కొద్దిసేపు ఆగాలి. మిట్టమధ్యాహ్నం ప్రయాణం మేలు కాదు. ఇంజిన్‌లో సమస్య ఏర్పడినప్పుడు ఏసీ ఆగిపోతుంది. దీన్ని గమనించకుండా వెళితే కారులో మంటలు రేగే అవకాశాలుంటాయి.


- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని