మారిషస్‌లో భారత నౌకాదళ స్థావరం?
మారిషస్‌లో భారత నౌకాదళ స్థావరం?

రన్‌వే సహా పలు నిర్మాణాలు
హిందూ మహాసముద్రంలో నిఘా..
డ్రాగన్‌ జోరుకు కళ్లెం వేసేందుకే

హిందూ మహాసముద్రంలో కోరలు చాస్తున్న చైనాకు ముకుతాడు వేయడానికి భారత్‌ దూకుడు పెంచింది. సువిశాల మహాసాగరంలో డ్రాగన్‌ కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా మారిషస్‌కు చెందిన ఉత్తర అగలేగా దీవిలో ఒక నౌకాదళ స్థావరాన్ని సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని మారిషస్‌, భారత్‌ ప్రభుత్వాలు ఖండిస్తున్నప్పటికీ.. అక్కడి పరిస్థితులపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడి నిర్మాణాలు నిర్దిష్టంగా సైనిక అవసరాలకు ఉద్దేశించినవేనంటూ పలు పత్రాలు, అధికార వర్గాలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తున్నాయి. ముఖ్యంగా నిఘా కార్యకలాపాల కోసమే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు అవి స్పష్టం చేస్తున్నాయి.

25 కోట్ల డాలర్లతో..
ఉత్తర అగలేగాలో నిర్మాణాల కోసం వందల మంది భారత కార్మికులు పనిచేస్తున్నారు. అయితే హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాల నడుమ మౌలిక వసతుల అభివృద్ధి కోసం తాము తెచ్చిన ‘సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ద రీజియన్‌’ (సాగర్‌) విధానంలో భాగంగానే మారిషస్‌లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని భారత్‌ స్పష్టంచేస్తోంది. మరోవైపు.. ఈ స్థావరంలోని కొత్త వసతులను తమ తీరరక్షక దళ సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటారని మారిషస్‌ పేర్కొంది. అయితే ఈ మారుమూల దీవిలో 25 కోట్ల డాలర్లను వెచ్చించి వైమానిక స్థావరం, పోర్టు, కమ్యూనికేషన్స్‌ హబ్‌ను భారత్‌ అభివృద్ధి చేయడం వెనుక ఉద్దేశం కేవలం తన ప్రాదేశిక జలాలను కాపాడుకునేలా మారిషస్‌కు సాయం చేయడం ఒక్కటే కాదు.


కీలక స్థానం..

త్తర, దక్షిణ అగలేగా దీవులు హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ దాదాపు 300 మంది క్రియోల్‌ అగలీన్‌ జాతివారు ఉంటున్నారు. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల నిఘా వేయడానికి భారత నౌకాదళానికి సాధ్యం కావడంలేదు. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సాగరంలో జరుగుతున్న పరిణామాలను మరింత క్షుణ్నంగా తెలుసుకోవడానికి వీలవుతుందని భారత్‌ భావిస్తోంది.


భారీగా వసతులు..

* అగలేగా దీవిలో ఏర్పాటవుతున్న సౌకర్యాల్లో 3వేల మీటర్ల రన్‌వే చాలా ముఖ్యమైంది. పెద్ద విమానాలు దిగడానికి ఇది అనువుగా ఉంటుంది. విమానాలను నిలిపి ఉంచేందుకు ఆప్రాన్‌ సౌకర్యాలనూ కల్పిస్తున్నారు.
* నౌకలను నిలిపి ఉంచేందుకు లోతైన జలాల్లో జెట్టీలను సిద్ధం చేస్తున్నారు. సైనిక సిబ్బంది బసకు బ్యారక్‌లు, ఇతర వసతులు కల్పిస్తున్నారు.


వ్యూహాత్మక పైచేయి..

భారత నౌకాదళంలో పి-8ఐ విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా తయారుచేసిన ఈ అధునాతన సముద్రగస్తీ విమానాలు.. సాగర లోతుల్లో గోప్యంగా సంచరించే శత్రు జలాంతర్గాముల వేట, నిఘా వంటి అవసరాలకు ఉపయోగపడతాయి. యుద్ధనౌకలనూ ధ్వంసం చేయగలవు. హిందూ మహాసముద్రంలో పి-8ఐ లేదా ఇతర నిఘా విమానాలు సమర్థంగా పనిచేయడానికి ఉత్తర అగలేగా తరహా  వైమానిక క్షేత్రాలు, ఇంధనం నింపే కేంద్రాలు అవసరం. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనూ ఇలాంటి స్థావరాలను భారత్‌ ఏర్పాటు చేస్తోంది. ఉత్తర అగలేగా దీవిలోని స్థావరం ద్వారా కీలకమైన మొజాంబిక్‌ ఛానల్‌లో నౌకల కదలికలను ఎప్పటికప్పుడు గమనించొచ్చు.


చైనాకు చెక్‌..

హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతోంది. ఇక్కడ భారత్‌ లక్ష్యంగా సైనిక, వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ దేశ యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలు బాగా పెరుగుతున్నాయి. జిబౌటిలో సైనిక స్థావరాన్ని డ్రాగన్‌ ఏర్పాటు చేసుకుంది. దీంతో భారత్‌ కూడా జోరు పెంచింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని