కొట్టుకుపోతున్నా చెక్‌ చేయరా..
కొట్టుకుపోతున్నా చెక్‌ చేయరా..

కొన్నిచోట్ల మధ్యకు విరిగిపోయిన చెక్‌డ్యాంలు 

మరికొన్ని ప్రాంతాల్లో వరదలకు పునాదుల గల్లంతు

రూ.2,847.71 కోట్ల పనులపై ‘ఈనాడు’ పరిశీలన

డిజైన్‌ లోపం.. నాసిరకంగా నిర్మాణం.. గుత్తేదారుల ఇష్టారాజ్యం వెరసి చెక్‌డ్యాంలు వరదల పాలవుతున్నాయి. లోతుగా పరిశీలించే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రవాహాన్ని తట్టుకుని నీటిని నిల్వ చేయాలనేది అసలు ఉద్దేశం కాగా.. మొదటి ఏడాదే డ్యాంలన్నీ దెబ్బతిన్నాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో వీటి నిర్మాణాల వెనుక పెద్ద కథే ఉంది. కొందరు గుత్తేదారుల అవతారమెత్తి నిండా ముంచేశారు. మరోవైపు డిజైన్‌ లోపాలతో డ్యాంలకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,847.71 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 596 చెక్‌డ్యాంలు చాలాచోట్ల నాసిరకంగానే ఉన్నాయి. పనులు కొనసాగుతుండగానే కూలిపోతున్నవి కొన్నైతే.. పూర్తయినా నిలవనివి మరికొన్ని.


చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి

పునాది నిర్మాణంలో వినియోగించే మెటల్స్‌ ఎంతో నాణ్యంగా ఉండాలి. ఇవేమీ లేకుండా కనీస ప్రమాణాలకు దూరంగా చెక్‌డ్యాంలు కట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు కొందరు గుత్తేదారులు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో 372 వాగుల పొడవు 6,481.8 కి.మీ. కృష్ణానదీ పరిధిలోని 311 వాగుల పొడవు 5,700.95 కి.మీ. వీటి పరిధిలో నాలుగు నుంచి ఎనిమిదో ఆర్డర్‌లో (స్ట్రీమ్‌) ఉన్న వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. వాస్తవానికి సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ విభాగ ఆధ్వర్యంలో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఆధారంగా డిజైన్‌ను ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు ఎస్‌ఈ, ఈఈలు, భూగర్భ జలవనరుల విభాగ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని సర్కారు సూచించింది. మలుపులు లేకుండా ప్రవాహం ఉన్నచోట, అటవీ ముంపు లేని ప్రాంతాలను ఎంపిక చేయాలంది. వదులు మట్టి, ఇసుక వంటివి ఉంటే ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని, వర్షాకాలంలో ముందుగా బెడ్‌ నిర్మాణం చేసుకుని ఆ తరువాత ఇతర కట్టడాలు పూర్తి చేయాలని, డ్యాంలకు ఇరువైపులా గోడలు (వింగ్‌ వాల్స్‌), కట్టలు పటిష్ఠంగా ఉండాలని వివరించింది.


క్షేత్రస్థాయి నిర్మాణాల్లో లోపాలు ఇవి

* కొన్ని జిల్లాల్లో కేటాయించిన నిధుల్లో 60శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

* సాసర్‌ మాదిరిగా ఉన్నచోట డ్యాం కట్టాలని మార్గదర్శకాల్లో సూచించినా వంపులుగా ఉన్నచోట కూడా కట్టేశారు.

* కొన్నిచోట్ల పునాది (బెడ్‌) నిర్మాణం పైపైన చేశారు. కింది నుంచి ప్రవాహం రావడంతో కొట్టుకుపోయాయి.

* నీటి వేగాన్ని అంచనా వేసి చెక్‌డ్యాం మధ్య గోడ నిర్మించాల్సి ఉండగా కొన్ని చోట్ల అదనపు నిధులు అవసరమవుతాయనే అంచనాలున్నా... పనులు పూర్తి చేసి మమ అనిపించాలని ఉన్న డబ్బులతో కట్టేశారు. తగినంత స్టీల్‌ వాడాల్సి ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదు.

* కొన్నిచోట్ల నిర్మాణ సమయంలో ప్రవాహం ఎంత వెడల్పుతో ఉంటే అంతటికే పరిమితం చేసి వింగ్‌ వాల్స్‌ కట్టారు.అవసరమైనంత స్టీల్‌ వాడలేదు.


వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో కాగ్నానదిపై రూ.8.74 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం 90 శాతం పూర్తయిందో లేదో ఇటీవల కురిసిన ఒక్క వర్షానికే మధ్య గోడ రెండు ముక్కలైంది. నదిలో వేసిన సిమెంటు కాంక్రీట్‌ బెడ్‌ దాదాపు వంద మీటర్ల దూరం కొట్టుకుపోయింది. వింగ్‌ వాల్స్‌లో స్టీల్‌ సరైన మోతాదులో వాడలేదు. వరద ప్రవాహాన్ని అంచనా వేయకపోవడం, పునాది సరిగా లేకపోవడంతో నష్టం చోటుచేసుకుంది.ఈ జిల్లాలో రూ.55.72 కోట్లతో 11 చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టారు.


ఒకే గుత్తేదారుకు 19 నిర్మాణాలు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 72 చెక్‌డ్యాంలకు రూ.536.6 కోట్లు మంజూరు చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గాల్లోని 19 నిర్మాణాలన్నీ ఒకే గుత్తేదారుడు దక్కించుకున్నట్లు తెలిసింది. 4.6 శాతం ఎక్కువకు ఈ పనులు చేజిక్కించుకున్నట్లు సమాచారం. దేవరకొండ నియోజకవర్గంలో నాసిరకంగా నిర్మించిన ఒక డ్యాం ఆగస్టులో కొట్టుకుపోయింది.


నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తిసద్దగోడు వద్ద దుందభీపై రూ.6.80 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం కూలి పోయింది. పునాదులు సరిగా తీయకపోవడం, కంకర, ఇసుక, సిమెంటు, స్టీల్‌ను తగినంత వినియోగించకపోవడంతో కట్ట తెగినట్లు సమాచారం.


కరీంనగర్‌ గ్రామీణ మండలం ముగ్ధుమ్‌పూర్‌ సమీపంలో నిర్మించిన చెక్‌డ్యాం ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది. నిర్మాణంలో ప్రణాళిక లోపం, నాసిరకం సామగ్రి వినియోగించారని తెలుస్తోంది. మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంలలో చాలా చోట్ల కోతకు గురయ్యాయి.


నల్గొండ జిల్లా మునుగోడు పంచాయతీ పరిధిలోని పెద్ద వాగుపై చెక్‌డ్యాం కట్ట కోసుకుపోయింది. గతేడాది రూ.2.78 కోట్లతో పనులు చేపట్టారు. 77 శాతం పూర్తవ్వగా రూ.2.15 కోట్ల బిల్లులు మంజూరయ్యాయి. డిజైన్‌ లోపంతో పాటు నాసిరకమైన నిర్మాణం నష్టానికి కారణమని అంచనా. చింతపల్లి మండలంలో వాగుపై రూ.3.50 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం ఈ ఏడాది ఏప్రిల్‌లో పూర్తయింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది.


- ఈనాడు, హైదరాబాద్‌, - ఈనాడు జిల్లా యంత్రాంగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని