close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కార్తిక మాసంలో ఈ నాలుగూ ఎందుకు పాటించాలి?

‘నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌.. నతీర్థ గంగాయ సమం..’ అంటే  యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తిక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు ప్రీతికరమైనది కావడమే ఇందుకు కారణం. కార్తీక పురాణంలో కార్తీక సోమవార మహత్యం, కార్తీక పౌర్ణమినందు జ్వాలాతోరణం ఇవన్నీ శివభగవానుడి ప్రాముఖ్యత తెలియజేసినట్టే కార్తిక శుక్ల బలి పాఢ్యమి, కార్తీక ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి శ్రీహరి ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తిక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుని ప్రాముఖ్యతను తెలియజేస్తే.. ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అందులోనూ అంబరీశుని కథా వృత్తాంతంలో మహా విష్ణువు యొక్క దశావతారాల మూలం ఉండటం కార్తీక మాసంలో హరిహరాదులకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో తెలుపుతుందని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ‘ఈనాడు.నెట్‌’తో అన్నారు. 

కార్తిక మాసంలో ముఖ్యమైన విషయాలంటే... నదీ స్నానం, శివారాధన, దీపారాధన-దీపదానం, విష్ణు ఆరాధన-పురాణ పఠనం లేదా శ్రవణం, దానములు చేయడం. ఈ మాసంలో దీపాలు వెలిగించి శివ కేశవులను ఆరాధించి కార్తిక పురాణం చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి, పుణ్యం కలిగి, జ్ఞానం సిద్ధించి, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది.

స్నానం..

కార్తిక మాసంలో రవి తుల రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. కార్తిక మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది.

దీపం..

‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’. దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చేటువంటి తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అలాగే, అంధకారం దారిద్ర్యానికి చిహ్నమని, కాంతి లక్ష్మీప్రదమని.. జ్ఞానానికి అభివృద్ధికి చిహ్నమని పెద్దలు చెబుతున్నారు.

ప్రతి మనిషీ నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేస్తే మంచిది. దీపారాధన ఇంటి యజమాని చేయాలి. కలియుగంలోని ప్రస్తుత కాలంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం సాధ్యంకాని వారికి కార్తిక మాసంలో దీపారాధనకు మించిన గొప్ప అవకాశం ఏదీ ఉండదు. 

కార్తిక మాసంలోనూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడని వారికి కార్తీక శుక్ల ద్వాదశి మరియు కార్తిక పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు రోజుల్లో చేయడంతో కలుగుతుంది. 

కార్తిక మాసంలో సాయంత్రం పూట ఆలయంలో గానీ, తులసికోట, వద్దా, రావిచెట్టు వద్దా, మేడపైన లేదా ఏదయినా నది వద్ద ఎవరయితే దీపారాధన చేస్తారో వారికి పుణ్య ఫలం లభించి శివసాన్నిధ్యం పొందుతారని కార్తిక పురాణం చెబుతోంది.

ఉపవాసం..

కార్తిక మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచి జరిగి మనస్సు నిర్మలం చెంది దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. కార్తిక సోమవారాల్లో ఉపవాసం ఉండటమంటే, కేవలం ఆహారం మానేయడం కాదు! కోరికలను తొలగించుకొని, సకల ధ్యాస భగవంతుడిపై లగ్నం చేసి ఉండటం. ఉపవసించిన ప్రతిక్షణమూ భగవతారాధనలో గడిపిన వారికి ఉపవాస ఫలితం సిద్ధిస్తుంది. అది పుణ్యప్రదమై, జ్ఞాన ప్రదమై, మోక్ష ప్రదమవుతుంది. 

కార్తిక మాసంలో ద్వాదశి వ్రతం ఆచరించేవారు.. దశమి రోజున ఒకపూటే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానమాచరించి శివకేశవులను పూజించి బ్రాహ్మణులకు/అతిథులకు భోజనం పెట్టి తరువాత ఎవరైతే భుజిస్తారో వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కార్తిక పురాణం యందు స్పష్టంగా చెప్పబడింది. 

దానం..

మన సనాతన ధర్మంలో గృహస్థు చేయాల్సిన వాటిల్లో స్నానం, దానం, జపం మరియు తర్పణం ముఖ్యమైనవి. కార్తికంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, తర్పణాలకు అత్యంత అధికమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలిపాయి. అందుచేత కార్తీకమాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కార్తిక, మార్కండేయ, శివ పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు