Supreme Court: పేద విద్యార్థులను.. ఆన్‌లైన్‌ విద్యకు దూరం చేయొద్దు!
Supreme Court: పేద విద్యార్థులను.. ఆన్‌లైన్‌ విద్యకు దూరం చేయొద్దు!

సాంకేతికతను అందుబాటులో ఉంచాలన్న సుప్రీం కోర్టు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆన్‌లైన్‌ చదువులకు ప్రాధాన్యత పెరగడంతో పేద విద్యార్థులకు అది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) వెనుకబడిన తరగతుల (DG) విద్యార్థులకు కంప్యూటర్‌ ఆధారిత పరికరాలు అందుబాటులో ఉంచి ఆన్‌లైన్‌ విద్యను అందించాల్సిన అవసరం ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే పిల్లలకు సాంకేతికతను అందుబాటులో ఉంచాలంటూ దిల్లీకి చెందిన గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలల యాక్షన్‌ కమిటీ వేసిన ఓ పిటిషన్‌ను జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌.. ఇది కేవలం ఆర్థికంగా బలహీన వర్గాల గురించి మాత్రమే కాదని అన్నివర్గాల సమస్యని సుప్రీం కోర్టుకు విన్నవించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించే విద్యార్థులకు ఇది మరింత భారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ నాగరత్న.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. లేకుంటే పిల్లలు పాఠశాల విద్యకు దూరమవుతారని.. మహమ్మారి విజృంభణ సమయంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ విద్య ఆందుబాటులో లేని గ్రామీణ, గిరిజన ప్రాంతాల పాఠశాలల్లో డ్రాపవుట్‌ రేటు అధికంగా ఉన్నట్లు జస్టిస్‌ బీవీ నాగరత్న పేర్కొన్నారు. ఇదే సమయంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే (CSR) నిధులను ప్రభుత్వం ఇందుకు వినియోగించుకోవచ్చని సూచించారు.

అయితే, ఆన్‌లైన్‌ క్లాసులు అందుబాటులో ఉంచేందుకు కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ వంటి పాఠశాలలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్‌ పరికరాలు, ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలంటూ 2020 సెప్టెంబర్‌లో దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లు దాఖలు వేశాయి. అయితే, దీల్లీ హైకోర్టు తీర్పుపై అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే (ఈ ఏడాది ఫిబ్రవరిలో ) స్టే విధించిన విషయాన్ని సుప్రీం ధర్మాసనం గుర్తుచేసింది. ఈ విషయంపై ఇప్పటికే రెండు ఎస్‌పీఎల్‌లు పెండింగులో ఉన్నందున తాజా కేసును కూడా వాటికి జతచేస్తున్నామని.. ఇదే సమయంలో దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నప్పటికీ పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అవసరమేనని అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్తైన చిన్నారుల అవసరాలను విస్మరించలేమని.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వనరులను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చూపాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని