close
Updated : 03/09/2021 16:46 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆరోగ్యమంతా ‘పుస్తకం’లోనే ఉందంటున్నారు!

‘ఈ కాలం వాళ్లదంతా వట్టి తిండి.. పాతకాలం వాళ్లదే గట్టి తిండి..’ అంటుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే చెబుతోంది. పాత కాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు పాటించిన ఆహారపుటలవాట్లలో బోలెడంత ఆరోగ్యం దాగుందంటోంది. అందుకే వాటన్నింటినీ పరిశోధించి, ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఓ పుస్తకం రాసింది తమ్మూ. ‘బ్యాక్‌ టు ది రూట్స్‌’ పేరుతో ఇటీవలే విడుదల చేసి తనలో ఓ మంచి రచయిత్రి కూడా దాగుందని నిరూపించుకుంది. ఇలా అందరి మేలు కోరి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం బెస్ట్‌ సెల్లర్‌గా అమ్ముడవుతోంది. ఆరోగ్యమంటే ఏ ఒక్కరికో సొంతమైంది కాదు.. దాన్ని నలుగురికీ పంచినప్పుడే సంతోషం, సంతృప్తి అంటూ మరికొంతమంది సెలబ్రిటీలు కూడా కొన్ని పుస్తకాలు రాశారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఆ రహస్యాలన్నీ మీకోసం తెచ్చా!

ఇప్పటికే నటిగా, హోస్ట్‌గా అలరిస్తోన్న తమన్నా.. తాజాగా రచయిత్రిగా సరికొత్త అవతారం ఎత్తింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే ఈ బ్యూటీ.. అదే ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పాత కాలపు ఆరోగ్య రహస్యాలను సేకరించి, మధించి.. ‘బ్యాక్‌ టు ది రూట్స్‌’ పేరుతో ఓ పుస్తకం రాసింది. సెలబ్రిటీ లైఫ్‌స్టైల్‌ కోచ్ Luke Coutinhoతో కలిసి రాసిన ఈ పుస్తకాన్ని ఇటీవలే సోషల్‌ మీడియాలో విడుదల చేసిందీ బ్యూటీ. అంతేకాదు.. ఇది ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని చేరువ చేస్తుందంటోందీ టాలీవుడ్‌ అందం.

‘మన దేశం పాతకాలపు ఆరోగ్య రహస్యాల్ని తనలో నింపుకొన్న గ్రంథాలయం. ఆ రహస్యాలన్నీ మనం పునశ్చరణ చేసుకొని పాటించాల్సిన సమయమిది! బ్యాక్‌ టు ది రూట్స్‌ కూడా అలాంటి పుస్తకమే. ఇందులోని అన్ని ఛాప్టర్స్‌లో పొందుపరిచిన ఆరోగ్య రహస్యాలన్నీ మరోసారి పరీక్షించి, పరిశీలించాకే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవన్నీ మీకూ ఉపయోగపడతాయి.. మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి’ అంటోంది తమ్మూ.


ఇదే మన ‘ఇమ్యూనిటీ పిల్’!

ఆరోగ్యం, అందం, ఫిట్‌నెస్‌.. ఈ మూడూ కలగలిసిన బాలీవుడ్‌ అందాల తార శిల్పా శెట్టి. పెరుగుతోన్న తన వయసుతో పాటే చురుకుదనాన్నీ పెంచుకుంటూ.. తన ఫ్యాన్స్‌కు వెల్‌నెస్ పాఠాలు నేర్పుతోన్న శిల్ప.. రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన వంటకాల్ని పరిచయం చేస్తూ ఇప్పటికే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ డైట్‌’, ‘ది డైరీ ఆఫ్‌ ఎ డొమెస్టిక్‌ దివా’.. అనే రెండు పుస్తకాలు రాసింది. ఇక ఈ ఏడాది ‘ది మ్యాజిక్‌ ఇమ్యూనిటీ పిల్‌ : లైఫ్‌స్టైల్‌’ అనే మరో పుస్తకాన్ని తన అభిమానుల కోసం తీసుకొచ్చిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. సెలబ్రిటీ లైఫ్‌స్టైల్‌ కోచ్ Luke Coutinhoతో కలిసి రాసిన ఈ పుస్తకంలో భాగంగా.. రోగనిరోధక శక్తిని పెంచే ఇంటి చిట్కాలను పొందుపరచామంటోంది శిల్ప.

‘ఆరోగ్యకరమైన జీవనశైలిని అందరికీ చేరువ చేయాలనే ఈ పుస్తకం రాశాను. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండడం ఎంత అవసరమో మనకు గత కొంతకాలంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇమ్యూనిటీని పెంచే ఇంటి చిట్కాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాం. నిజానికి ఈ పుస్తకం మాతృక గతేడాదే విడుదలైనా.. హిందీ వెర్షన్‌ను ఈ ఏడాది తీసుకొచ్చాం. ఎందుకంటే హిందీలో అయితే ఇది మరింత మందికి చేరువవుతుందన్నదే దీని వెనకున్న ముఖ్యోద్దేశం. ప్రస్తుతం మీరు దీన్ని ఆన్‌లైన్‌లో ఉచితంగానే చదువుకోవచ్చు..’ అంటోందీ ముద్దుగుమ్మ.


ఆరోగ్యమే ఆనందం!

ఆరోగ్యంగా ఉండాలంటే మనం వేసే ప్రతి అడుగూ కీలకమే అంటున్నారు సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఆరోగ్యం-మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. వంటి విషయాలకు సంబంధించిన పోస్టులు, వీడియోలతో అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే ఈ న్యూట్రిషనిస్ట్‌.. ఈ క్రమంలోనే ఎన్నో పుస్తకాలు రాశారు. ‘Don't Loose Your Mind Loose Your Weight’, ‘Women and the Weight Loss tamasha’, ‘Don't Loose Out, Workout’, ‘The PCOD Thyroid Book’, ‘Indian Super Foods’, ‘Pregnancy Notes’, ‘Notes For Healthy Kids’.. వంటి పుస్తకాలను మన ముందుకు తెచ్చిన రుజుత.. గతేడాది ‘12 Week Fitness Project’ పేరుతో మరో పుస్తకాన్ని విడుదల చేశారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలే కీలకమని, ఈ క్రమంలోనే పలు సంప్రదాయ వంటకాల్ని, ఆరోగ్య రహస్యాల్ని ఈ పుస్తకం ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారామె.

‘ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. ఈ రెండూ ఒకదాంతో మరొకటి ముడిపడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది తెలిసో తెలియకో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు బానిసై చేజేతులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారు బరువు అదుపులో ఉన్నా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండలేకపోతున్నారు..’ అంటున్నారు రుజుత. ఇక రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో మనం తీసుకునే పోషకాహారమే కీలక పాత్ర పోషిస్తుందంటోన్న ఆమె.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ గుడ్‌హెల్త్‌’ అనే ఆడియో బుక్‌ని అందరికీ చేరువ చేశారు. ఇందులో భాగంగా రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, అందులోని పోషకాల గురించి వివరించారామె.


పేరెంట్స్‌లో ఆ స్పృహ ఉండాలి!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు తల్లులు ఆరోగ్యంగా ఉండాలి అంటారు మరో సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖిజ. తాను పాటించే ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలతో పాటు పోషకాహారం, వ్యాయామాలు.. వంటి అంశాలకు సంబంధించిన పోస్టులతో అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే పూజ.. పలు పుస్తకాలు సైతం రాశారు. ‘N for Nourish’, ‘Eat Delete Junior’, ‘Eat Delete : How To Get Off The Weight Loss Cycle For Good’.. వంటివి అందులో కొన్ని! ముఖ్యంగా తన పుస్తకాల విషయంలో పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే ఆమె.. ‘తల్లిదండ్రుల్లో ఆరోగ్య స్పృహ ఉంటే.. అది పిల్లలకూ అలవాటవుతుంది. తద్వారా తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు.. ఇలా ప్రతి విషయంలోనూ వారు తల్లిదండ్రుల్నే ఫాలో అవుతారు. ఇది పెరిగే కొద్దీ వారిని ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడేలా చేస్తుంది. ఫలితంగా డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు అంటూ వాళ్ల దగ్గరికి పరిగెత్తే అవసరం రాదు..’ అంటారు పూజ.


అనుభవాలే పుస్తకమై!

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి విషయాల్లో ఇలా పుస్తకాల ద్వారా అవగాహన పెంచిన సెలబ్రిటీలు కొందరైతే.. తమకెదురైన అనారోగ్యాల నుంచి జీవితం విలువ తెలుసుకొని.. తమ అనుభవాల్ని పుస్తకాలకెక్కించిన వారూ ఉన్నారు. వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా ఒకరు. ఒవేరియన్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఆమె.. ఈ క్రమంలో తనకెదురైన తీపి-చేదు అనుభవాల్ని ‘Healed: How Cancer Gave Me a New Life’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ధైర్యం, మానసిక సంకల్పం ఉంటే క్యాన్సర్‌ వంటి మహమ్మారుల్నీ జయించచ్చంటూ తన పుస్తకం ద్వారా బాధితుల్లో స్ఫూర్తి రగిలించిందీ అందాల తార.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని