close
Published : 12/09/2021 12:31 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

గుడ్డు పెంకులతో మెరిసిపోదాం!

వ్యర్థాలు అంటూ వంటింట్లో చాలా పదార్థాల్ని పడేస్తుంటాం.. కానీ వాటితోనూ బోలెడన్ని ఉపయోగాలున్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోతుంటాం. గుడ్డు పెంకులు కూడా అలాంటివే! ఇంటి మొక్కలకు ఎరువుగా, చీడపీడల్ని నివారించడానికి.. ఇలా పలు రకాలుగా ఉపయోగపడే ఇవి అందాన్ని పెంపొందించడంలోనూ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. జుట్టు ఎదుగుదలకు, దంతాల్ని మెరిపించడానికీ వీటిని వాడచ్చట! మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

 

ముఖానికి మెరుపు!

చర్మంపై ఏర్పడే మృతకణాల వల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే వాటిని తొలగించి.. వాటి స్థానంలో కొత్త కణాల్ని ఉత్పత్తి చేసే గుణాలు గుడ్డు పెంకుల్లో ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులోని క్యాల్షియం కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. కొన్ని గుడ్డు పెంకుల్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని మెత్తటి పొడిలా చేసుకొని.. ఒక గుడ్డు తెల్లసొనలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంటయ్యాక కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ వల్ల ముఖానికి తేమ అందుతుంది.. ఇది చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. తద్వారా మృతకణాలు తొలగిపోయి ముఖం మెరుపును సంతరించుకుంటుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే సత్వర ఫలితం ఉంటుంది.

సున్నితమైన చర్మమా?

సున్నితమైన చర్మం ఉన్న వారు ఏ వాతావరణాన్నీ తట్టుకోలేరు. ఎండ వేడికి త్వరగా కందిపోవడం, చల్లటి వాతావరణంలో చర్మం పొడిబారిపోవడం, ఎర్రటి దద్దుర్లు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు గుడ్డు పెంకుల్ని ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం గుడ్డు పెంకుల్ని బాగా కడిగి పొడి చేసుకోవాలి. ఒక బౌల్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకొని.. ఈ పొడిని అందులో వేసి బాగా కలుపుకొని ఐదు రోజుల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక కాటన్‌ బాల్‌ని ఈ మిశ్రమంలో ముంచి, పిండి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టడం గమనించచ్చు.

బిగుతైన చర్మానికి..

కారణమేదైనా చర్మం సాగిపోవడం వల్ల ముడతలు పడడం, గీతల్లా ఏర్పడడం కామన్‌! ఇవే మనల్ని వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి, ఈ సమస్యల్ని దూరం చేసుకొని తిరిగి చర్మాన్ని బిగుతుగా మార్చుకోవాలంటే గుడ్డు పెంకులతో ఈ ఫేస్‌ప్యాక్‌ ప్రయత్నించచ్చంటున్నారు నిపుణులు.

గుడ్డు పెంకుల పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ తేనె, టేబుల్‌స్పూన్‌ పాలు, కొద్దిగా గులాబీ నీరు.. వీటన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బీటర్‌ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాటన్‌ బాల్‌ను ముంచి కింది నుంచి పైకి, బయటి నుంచి లోపలి వైపుకి  అప్లై చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

మెరిసే పలువరుస!

దంతాల మెరుపు అందాన్ని ఇనుమడిస్తుంది. మరి, అలాంటి తెల్లటి పలువరుస సొంతం చేసుకోవాలంటే అందుకు గుడ్డు పెంకులు సహకరిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ ఉదయం పూట గుడ్డు పెంకుల పొడితో దంతాల్ని రుద్దుకోవాలి. వీటిలోని క్యాల్షియం, ఇతర ఖనిజాలు దంతాలపై ఉన్న ఎనామిల్‌ పొరను సంరక్షిస్తాయి. చిగుళ్ల సమస్యను దూరం చేస్తాయి.

ఒత్తైన జుట్టుకు..

జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలోనూ గుడ్డు పెంకులు సహకరిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని గుడ్డు పెంకుల పొడిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో సరిపడా పెరుగు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించి పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌ కుదుళ్లకు బలాన్ని చేకూర్చి జుట్టు ఎదుగుదలను ప్రేరేపించడంతో పాటు వెంట్రుకలకు మెరుపును తీసుకొస్తుంది.

మంచి ఫలితాన్నిస్తుంది కదా అని ఏదైనా అతిగా వాడితే అనర్థమే.. అలాగే గుడ్డు పెంకుల్లోని క్యాల్షియం కూడా మోతాదుకు మించితే మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ ప్యాక్‌లో ఎంత వాడచ్చన్న విషయం నిపుణుల్నే అడిగి తెలుసుకొని వాడడం ఉత్తమం.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని