close
Updated : 14/03/2021 15:44 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆమె సేవలే పిల్లలకు పాఠాలుగా!

అది ముంబయి రైల్వేస్టేషన్‌. ప్లాట్‌ఫామ్‌ పైకి అప్పుడే వచ్చి ఆగిన రైల్లోకి ఏడుస్తోన్న ఓ 15 ఏళ్లమ్మాయిని వెనుక నుంచి బలవంతంగా ఎక్కిస్తున్నాడు ఒక వ్యక్తి. అంతలోనే అక్కడికొచ్చింది ఓ మహిళా పోలీసు అధికారి. ఒక చేత్తో అమ్మాయిని పక్కకు లాగి, మరోచేత్తో ఆగంతుకుడిని పట్టుకుంది.. అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు క్షణాల్లో అతడిని చుట్టుముట్టారు. ఎన్నో రోజుల నుంచి అతడి చెరలో నరకం అనుభవిస్తున్న ఆ అమ్మాయిని రక్షించిందామె. ఇలా ఎందరో దుర్మార్గుల చెర నుంచి వందలాదిమంది బాలికలు, యువతులను రక్షించి, వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. ఉద్యోగంలో చేరిన ఆరేళ్లలో దాదాపు వెయ్యిమందిని సురక్షితంగా ఇళ్లకు చేర్చిన అధికారిగా గుర్తింపు పొందింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఈమె సేవలను ప్రత్యేక పాఠ్యాంశంగా పొందుపరిచింది.

రేఖమిశ్రాది ముంబయి. ఆమె తండ్రి సైన్యంలో విధులు నిర్వహించేవాడు. బాల్యం నుంచి తండ్రి సేవాగుణాన్ని చూస్తూ పెరిగిన రేఖ తాను పోలీసు కావాలని కలలు కనేది. తండ్రి ఆశయం కూడా అదే కావడంతో కష్టపడి చదివి ఇష్టమైన ఎస్‌ఐ ఉద్యోగాన్ని దక్కించుకుంది. .ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌లో ‘ప్రివెంటింగ్‌ ద ట్రాఫ్‌కింగ్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌’  విభాగానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టింది. ‘ప్రశంసల కోసం కాకుండా ఇతరులకు సహాయం అందేలా నిత్యం కృషి చేయి’ అని తండ్రి చెప్పిన మాటలను ఆమె పాఠంగా తీసుకుంది. నిరాశ్రయులు, అనాథలు, కిడ్నాప్‌కు గురైనవారు, ఇంటి నుంచి పారిపోయినవారిని గుర్తించి సొంతవారి వద్దకు లేదా సురక్షిత ప్రాంతానికి తరలించేది.

రోజుకి ఎందరో పిల్లలు తప్పిపోవడం, కిడ్నాప్‌కు గురై వేశ్యలుగా అమ్మకం కావడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. అటువంటి కేసులను తీసుకుని పరిశోధించేది. పదిహేనేళ్ల అమ్మాయి అపహరణకు గురైందని గోవా నుంచి ఓ ఫిర్యాదు రేఖా పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఆ అమ్మాయి ఫొటోని బృందంలోని అందరికీ అందించింది. ముంబయి రైల్వేస్టేషన్‌లో ఏడుస్తూ ఆ అమ్మాయి... ఆమెని బలవంతంగా రైలెక్కిస్తున్న ఓ వ్యక్తి ఆమె కంటపడ్డాడు. తాము వెతుకుతున్నది ఆ  అమ్మాయినే అని తెలుసుకుంది. అంతే పులిలా దూకింది. ఆమెను చేత్తో పట్టి లాగి, మరోచేత్తో ఆ వ్యక్తినీ పట్టుకుంది. అంతలో అక్కడే ఉన్న ఆమె బృందం అతడిని చుట్టుముట్టింది. ఆ అమ్మాయి, రేఖను పట్టుకొని బోరున ఏడ్చింది. బాధితురాలిని తల్లిదండ్రులకు అప్పజెప్పింది. ఓ రోజు 11 ఏళ్ల అబ్బాయి రైలు పెట్టె వెనుక దాగుని ఉండటం గుర్తించింది. తండ్రి కొట్టిన దెబ్బలకు భయపడి ఇల్లొదిలి వచ్చేసిన ఆ కుర్రాడిని తిరిగి ఇంటికి చేర్చి తల్లీకొడుకులను కలిపింది. 

వెయ్యిమందిని...
తన ఆరేళ్ల ఉద్యోగ నిర్వహణలో దాదాపు వెయ్యిమందిని రక్షించిన ఈమె ప్రశంసలనే కాదు, ఎన్నో సవాళ్లనూ ఎదుర్కొంది. ‘ఒక్కోసారి నిందితుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఇలాంటి ఉద్యోగం ఆడవాళ్లకు సరిపోదు. ఏదో ఆఫీసులో కూర్చొని చేసే పని చూసుకోవచ్చు కదా... అని బంధువులు విమర్శించేవారు.   అలాగే బాధ్యతల్లో భాగంగా ప్రమాదాలు వెన్నంటే ఉంటాయి. కిడ్నాప్‌కుగురైన అమ్మాయిలను రక్షించినప్పుడు  తృప్తిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా బెదిరింపులొచ్చినా లెక్కచేయను. రోజుకి 14 గంటలపాటు విధులు నిర్వహిస్తా. నా కృషికిగాను  2017లో  కేంద్రప్రభుత్వం నారీశక్తి అవార్డుతో గౌరవించింది. అలా వచ్చిన నగదు బహుమతినీ అనాధ పిల్లల సంక్షేమం కోసం అందించా’ అని చెబుతోంది రేఖ.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని