close
Updated : 28/03/2021 14:22 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆ చారిత్రక కట్టడాల రూపశిల్పి ఆమే!

కరీంనగర్‌ క్లాక్‌ టవర్‌, కమాన్‌... చార్మినార్‌, తాజ్‌మహల్‌, ఈఫిల్‌ టవర్‌... భారత పార్లమెంటు భవనం... ఇలా ప్రతి చారిత్రక కట్టడం ఆమె చేతిలో ప్రాణం పోసుకుంటుంది. అచ్చంగా ఆ నిర్మాణాలను అద్భుతంగా రూపొందిస్తున్నారు కరీంనగర్‌కు చెందిన బొడ్డు శ్రీమతి.
బోయవాడకు చెందిన శ్రీమతి చీపురు పుల్లలతో బొమ్మలను తయారుచేస్తారు. ఆమెచేతుల్లో ఈ పుల్లలు విల్లుల్లా వంగిపోతాయి. ఆమె అనుకున్న విధంగా ఒదిగిపోతాయి. ఇలా ఒక్కో బొమ్మను తయారుచేయడానికి రోజులో పది నుంచి పద్నాలుగు గంటలు వెచ్చిస్తారామె. కొన్నింటిని తయారుచేయడానికి నెలల కొద్ది టైమ్‌ పట్టినా ఓపికగా అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తారు. తాను ఎన్నో బొమ్మలను తయారుచేశానని అయితే పార్లమెంటు భవనంతోపాటు రామోజీ ఫిలింసిటీలోని అమ్యూజ్‌మెంట్‌ పార్కును తయారుచేయడానికి చాలా కష్టపడ్డానని చెబుతారామె. నటుడు చిరంజీవి డ్రీంహౌజ్‌ను తయారుచేసి ఇటీవలే ఆ కళాఖండాన్ని ఆయన కుమారుడు రాంచరణ్‌కు అందించారు శ్రీమతి.
చిన్ననాటి కోరిక... చిన్నతనంలో మామయ్య అట్టలతో బొమ్మలను తయారుచేయడం గమనించి తను కూడా చేయలనుకున్నా...  పెళ్లి, ఇతర బాధ్యతల్లో పడిపోవడంతో ఆ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు  కుమారులిద్దరూ విదేశాల్లో స్థిరపడటంతో ఈ హస్తకళనే వ్యాపకంగా మార్చుకున్నారు.  తొలుత అట్టలతో చార్మినార్‌ తయారుచేసినా సరిగా కుదరలేదు. ఆ తర్వాత చీపురు పుల్లలతో మొదలుపెట్టి ఇప్పటివరకు ఎన్నో చారిత్రక కట్టడాలను తీర్చిదిద్దారు. బొమ్మల తయారీకి అసరమైన ప్రత్యేకమైన చీపురు పుల్లలను తన భర్త సుదర్శన్‌ గోదావరిఖని నుంచి తీసుకొస్తారని చెబుతారామె. ఈ పుల్లలను వంచుతూ ఫెవికాల్‌ ద్వారా బొమ్మల తయారీ పూర్తి చేస్తారు. ఇప్పుటి వరకు 40 కిలోల ఫెవికాల్‌ ఉపయోగించి అందంగా బొమ్మలను తీర్చిదిద్దడమే కాకుండా హస్తకళల్లో ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో తన పేరు నమోదు చేసుకున్నారు.

చారిత్రక నిర్మాణాలు.. భార్యాభర్తలు బట్టల దుకాణం నడుపుతున్నారు. ఆమె సమయం దొరికినప్పుడల్లా.. ఈ హస్తకళకు పదును పెడుతున్నారు. ఇప్పటివరకు పార్లమెంటు భవనం, తాజ్‌మహల్‌, ఎర్రకోట, గేట్‌వే ఆఫ్‌ ఇండియా, ఈఫిల్‌ టవర్‌, చార్మినార్‌, హైటెక్‌ సిటీ, రామోజీ ఫిలింసిటీలోని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, కరీంనగర్‌ కమాన్‌, టవర్‌ సర్కిల్‌, పల్లకి, సైకిల్‌, ఎడ్లబండి, కారు... ఇలా ప్రతి ఒక్కటీ పుల్లలతో తయారుచేశారు. తాను తయారుచేసిన బొమ్మలన్నీ తన ఇంట్లోనే ప్రదర్శనగా పెట్టారు.

- అలీముద్దీన్‌, కరీంనగర్‌

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని