close
Updated : 21/06/2021 16:01 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇలా చేస్తే నిరుపయోగమే!
యోగాసనాల్లో ధ్యానం కూడా ఓ భాగమే. ఇందుకు ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఎంతో ముఖ్యం. కానీ కొంతమంది మాత్రం గాలి పీల్చి వదిలే క్రమాన్ని పెద్దగా పట్టించుకోకుండా 'ఏదో చేశాంలే' అన్నట్లుగా యోగా పూర్తి చేస్తుంటారు. అలాగే ఒకేసారి గట్టిగా గాలి పీల్చడం, వదలడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల చేసిన ఫలితం దక్కకుండా పోతుంది. అందుకే ఆసనాలు వేసేటప్పుడు దానికి తగిన రీతిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందుకు నిపుణులు చెప్పిన చిట్కాల్ని తు.చ. తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. అప్పుడే అటు శరీరానికి, ఇటు మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

సొంత ప్రయత్నాలొద్దు...
కొన్ని యోగాసనాలు చేయడానికి ఒకే విధంగా అనిపించచ్చు.. కానీ వాటిలోని భంగిమలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆసనాలు వేయడం ఉత్తమం. అలాకాకుండా కొంతమంది మాత్రం ఆసనాలు ఒకే రకంగా ఉన్నాయని అన్నింటికీ అవే భంగిమలు వేస్తే వాటి ద్వారా మంచి ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి నిపుణులు చెప్పినట్లుగా ఆసనాలు సాధన చేయడం ఉత్తమం. కొంతమంది ఇంట్లోనే స్వయంగా ఆసనాలు వేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు.. ఎందుకంటే ఆసనాలను వేయాల్సిన రీతిలో వేయకపోతే కండరాలు, నాడులపై ఒత్తిడి పడి ఆయా భాగాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలో కాకుండా స్వయంగా యోగా సాధన చేయడం సరైన పద్ధతి కాదు.

చేసే ముందు...
ఒక పని చేసే క్రమంలో దానిపై పూర్తి శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. అయితే అందుకు ముందునుంచీ కాస్త వార్మప్ చేయాల్సి ఉంటుంది. యోగాసనాలు చేసే ముందు కూడా అంతే.. కానీ కొందరు మాత్రం నేరుగా యోగాలోకి దిగిపోతారు. దీంతో ఆసనాలు వేయడానికి శరీరం అంత సులభంగా సహకరించకపోవచ్చు. ఫలితంగా యోగా చేయడం కష్టతరమై నెమ్మదిగా దానిపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా చేయడానికి అరగంట ముందు నుంచే దానికోసం తగిన వార్మప్ చేయడం తప్పనిసరి. ఫలితంగా యోగాసనాలకు శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారు కావడంతోపాటు దానిపై శ్రద్ధ పెరిగి మరింత ఫలితం పొందచ్చు.

ఆదరాబాదరాగా వద్దు...
యోగాసనాలు చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా, ఆసక్తితో చేస్తే అంత చక్కటి ఫలితం లభిస్తుంది. అలాకాకుండా సమయం అయిపోతోందనో లేదంటే తక్కువ సమయంలోనే అన్ని ఆసనాలు కవర్ చేయాలనో.. ఆదరాబాదరాగా ఆసనాల్ని పూర్తి చేయడం వల్ల మీరు అన్ని రోజులు పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. పైగా ఇలా చేయడం వల్ల గాయాలయ్యే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఆసనాలు వేసే క్రమంలో ఎంత నెమ్మదిగా, ఆస్వాదిస్తూ చేస్తే అంత మంచిది. అలాగే ఒక ఆసనం పూర్తయిన తర్వాత వెంటనే మరో ఆసనం ప్రయత్నించకుండా శరీరంలోని కండరాలకు, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడం మంచిది. ఫలితంగా ఆ తర్వాత చేసే ఆసనం మరింత పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.. యోగా మీద మనకు శ్రద్ధ, ఆసక్తి కూడా రెట్టింపవుతాయి.

 

ఇవి కూడా!

* ప్రారంభదశలోనే కఠినతరమైన ఆసనాలు ప్రయత్నిస్తుంటారు కొందరు. దీనివల్ల ఒక్కోసారి అతి కష్టంగా అనిపించి అసలు యోగా అంటేనే విముఖత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే యోగాసనాలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి కనీసం 45 రోజుల వరకు సులభతరమైన ఆసనాలు వేయడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఫలితంగా దానిపై ఆసక్తి మరింతగా పెరుగుతుందట.
* వ్యాయామానికి ఎలాగైతే ప్రత్యేకంగా సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారో.. యోగాకు కూడా సౌకర్యవంతంగా, వాతావరణానికి తగ్గట్లుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిదని గుర్తుంచుకోండి. అయితే ఈ క్రమంలో దుస్తులు మరీ బిగుతుగా, మరీ వదులుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.
* గుండె సంబంధ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు కఠినతరమైన యోగాసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం ఉత్తమం. అంతగా చేయాలనిపిస్తే నిపుణుల పర్యవేక్షణలో వారు సూచించిన సులభతరమైన ఆసనాల్ని మాత్రమే సాధన చేయడం మంచిది.

యోగాసనాలు వేసే క్రమంలో కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, వాటికి సంబంధించి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా వీటి పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఫలితాల్ని పొందచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని