close
Updated : 18/06/2021 20:21 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఓ కన్నతల్లిగా ఆ రెండు వారాలూ గుండె రాయి చేసుకున్నా!

తెలిసి తెలిసి తన బిడ్డ తనకు దూరంగా ఉండాలని, తాను తన చిన్నారిని దూరం పెట్టాలని ఏనాడూ ఏ కన్న తల్లీ కోరుకోదు. కానీ ఓ మాతృమూర్తి మాత్రం తన ఆరేళ్ల కొడుకును సుమారు రెండు వారాల పాటు గదిలో బంధించింది.. అలాగని ఆ చిన్నారి ఏదో తప్పు చేశాడని కాదు.. ఇది వాడికి విధించిన శిక్ష అంతకన్నా కాదు.. ఇదంతా కరోనా పన్నిన పన్నాగం! వైరస్‌ ఆడిన వింత నాటకంలో సమిధనైన తాను.. గుండె రాయి చేసుకొని మరీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదంటోందామె. ఈ రెండు వారాలూ తన కంటిపాపకు దూరమై తాను పడిన మానసిక వేదనను మాటల్లో చెప్పలేక ఇలా అక్షరీకరించింది.
నేను, మా వారు, ఆరేళ్ల మా బాబు అభిమన్యు... ఇది మా చిన్ని కుటుంబం. బాబు ఇప్పుడు సెకండ్‌ క్లాస్‌ చదువుతున్నాడు. కరోనా కారణంగా గతేడాది కాలంగా ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నాడు. నేను, మా వారు కూడా కొవిడ్‌ మొదటి దశ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసినప్పటికీ.. ఈసారి మాత్రం ఆఫీస్‌కు వెళ్లక తప్పని పరిస్థితి. అయినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆఫీస్‌కి వెళ్లొచ్చే వాళ్లం.

ఇక మేమిద్దరం ఆఫీస్‌కి వెళ్తే ఇంట్లో బాబును చూసుకోవడానికి మొన్నటివరకు ఆయా వచ్చేది. కానీ కరోనా కేసులు పెరిగే సరికి తనను కూడా మాన్పించేశాం.. ఆఫీస్‌కి వెళ్లే సమయానికే బాబుకు ఆహారం, ఇతర సౌకర్యాలన్నీ సమకూర్చి వెళ్లే వాళ్లం. ఇక మేం లేని సమయంలో మా చిన్నోడికి ఏదైనా అవసరమొస్తే మా పక్క ఫ్లాట్‌లో ఉండే వాణి గారే అన్నీ చూసుకునే వారు. అలా ఈ కరోనా సమయంలో మా వాడి గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వచ్చాం. ఇక బయటి నుంచి వచ్చాక కూడా వాడితో కాస్త దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నాం. ఇలా ఓ పద్ధతి ప్రకారం సాగిపోతోన్న మా జీవితాల్లోకి కరోనా ఎలా ప్రవేశించిందో తెలియదు కానీ.. ముందు మా వారికి పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలుండడంతో ఆయన ఇంట్లోనే ప్రత్యేక గదిలో స్వీయ ఐసొలేషన్‌లో ఉండడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నా మనసు నిండా ప్రతికూల ఆలోచనలే మెదిలాయి. ఇంట్లో ముగ్గురమే ఉన్నాం.. ఒకవేళ నాకు కూడా కరోనా సోకితే నా బాబు పరిస్థితి ఏంటి? వాడిని ఎవరు చూసుకుంటారు? అసలు వాడిని మా నుంచి ఎలా దూరం పెట్టాలి? కనీసం వైరస్‌ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేని వయసులో ఉన్న తనకు ఏం చెప్పి దూరంగా ఉంచాలి? అంటూ సమాధానం లేని ప్రశ్నలెన్నో నా మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి.

******

ఈ ఆలోచనలతోనే క్షణమొక యుగంలాగా గడిపాను. ఎందుకైనా మంచిదని మా వారికి పాజిటివ్‌ వచ్చినప్పట్నుంచే నా కొడుకుని మా నుంచి దూరంగా వేరే గదిలో ఉంచడం ప్రారంభించా. ఇక మూడో రోజు అసలు కథ మొదలైంది.. ఉదయం లేవగానే నాకు ఒంట్లో కాస్త నలతగా అనిపించింది. ప్రస్తుతం నేను పడుతోన్న మానసిక ఆందోళనల వల్లేనేమో అనుకున్నా.. కానీ ‘కీడెంచి మేలెంచాల’ని పెద్దలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒక్కసారి కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే ఈ నీరసానికి కారణమేంటో తెలుస్తుంది.. ఈ టెన్షన్ కూడా తప్పుతుందనుకున్నా. వెంటనే దగ్గర్లోని పీహెచ్‌సీకి వెళ్లి శాంపిల్స్‌ ఇచ్చొచ్చాను. సాయంత్రానికల్లా ఫలితం వచ్చింది.. నేను భయపడిందే నిజమైంది. వైరస్ ఉందని తేలింది. ఒక్కసారిగా నా ప్రపంచం తలకిందులైంది.. నా మనసంతా మరోసారి నా చిన్నారి గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది.

ఇప్పుడెలా..? పిల్లల్ని చూసుకోవడమంటే.. వారిని కనిపెట్టుకొని ఉంటే సరిపోదు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా.. వారికి స్నానం చేయించడం, అన్నం పెట్టడం, చదివించడం, పడుకోబెట్టడం.. ఇలా ఎన్నెన్నో బాధ్యతలుంటాయి. కరోనా సోకిన నేను నా బాబుకి ఇవన్నీ ఎలా చేయగలను? అలాగని వదిలేస్తే వాడు ఒంటరిగా ఇవన్నీ ఎలా చేసుకోగలడు? మరి, ఈ పరిస్థితిలో వాడిని మా అమ్మ/అత్తయ్య వాళ్లింటికి పంపించడం కూడా కరక్ట్‌ కాదు. వారిని ఇక్కడికి రప్పించడమూ సరికాదు. ఇలా ఆ పరిస్థితిలో ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ‘భగవంతుడా.. ఎందుకు నాకిలాంటి పరీక్ష పెట్టావు.. నువ్వే ఏదో ఒక దారి చూపించు!’ అని ఆ దేవుడిని వేడుకున్నా! ఏమీ పాలుపోక ఒక్కసారిగా ఏడ్చేశా! ఇక ఆఖరికి ఏదైతే అదైంది.. అని ఒక నిర్ణయానికొచ్చా.. ప్రస్తుతం నాకు కావాల్సింది నా బాబు ఆరోగ్యంగా ఉండడం.. మా వల్ల తనకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండడం! అందుకే నా గుండె రాయి చేసుకొని వాడిని విడిగా వేరే గదిలో ఉంచాలని నిర్ణయించుకున్నా. వాడు దానిని బందిఖానా లాగా అనుకున్నా సరే..!

******

అప్పటికే రెండు మూడు రోజుల నుంచి మాకు దూరంగా వేరే గదిలోనే ఉంటోన్న వాడిపై అకారణంగా కోపగించుకున్నా.. ఎందుకంటే ప్రేమగా చెప్తే వాడు అర్థం చేసుకోలేడు.. ఏడుస్తాడు.. పైగా మా దగ్గరికొస్తానని మారాం చేస్తాడు. ఇలా కాస్త కసురుకుంటే మొండిగానైనా అదే గదిలో ఉంటాడనిపించింది. అందుకే మనసు అంగీకరించకపోయినా ఇలా చేయక తప్పలేదు. అలా ఆ రోజు నుంచి ముగ్గురం మూడు గదుల్లో ఉండడం ప్రారంభించాం. పిల్లల కోపం ఎంతసేపు చెప్పండి.. క్షణాల్లో మాయమై మళ్లీ అమ్మా అంటూ దగ్గరికొచ్చేస్తారు. నా కొడుకు కూడా అంతే! కానీ వాడిని దగ్గరికి తీసుకోవడానికి, గుండెలకు హత్తుకొని ప్రేమతో ముద్దాడడానికి అవకాశమే లేకుండా చేసింది కరోనా మహమ్మారి. ఈ మనోవేదన వాడికి కనిపించకుండా నాలోనే దాచుకొని పైకి కఠినంగా వ్యవహరించేదాన్ని. దీంతో ఒక్కోసారి తానేదో తప్పు చేయడం వల్లే అమ్మ నన్ను ఇలా బంధించిందేమో అనుకునేవాడు. వీటన్నింటి నడుమ ఊరట కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే.. అది నాలో నీరసం తప్ప మరే కొవిడ్‌ లక్షణం కనిపించకపోవడం! అందుకే పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూనే వాడికి రోజూ మూడు పూటలా భోజనం అందించేదాన్ని.

ఇక ఇన్నాళ్లూ వేరే గదిలో ఒంటరిగా పడుకోవడం వాడికి అలవాటు లేదు. దాంతో ఒక్కోసారి అర్ధరాత్రి మెలకువ వచ్చి ‘అమ్మా.. భయమేస్తోంది..!’ అంటూ ఏడ్చేవాడు. అయినా సరే.. వాడి గది కిటికీ దగ్గరికి కూడా వెళ్లకపోయేదాన్ని. అలాగని అమ్మ మనసు ఊరుకుంటుందా చెప్పండి..! అలా ఏడ్చీ ఏడ్చీ వాడు పడుకున్నాక నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్లి చూసేదాన్ని. ఓ అమ్మగా నేను పడిన మానసిక వేదనతో చికిత్స తీసుకున్న రెండు వారాల్లో ఒక్క రోజు కూడా కంటి నిండా నిద్ర పోయింది లేదు. నా పరిస్థితే ఇలా ఉందంటే.. కొవిడ్‌ వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు, తమ చిన్నారుల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ అసలు ఎవరూ తీర్చలేనిదని అప్పుడర్థమైంది! క్షణమొక యుగంలా గడుపుతూ నేను, మా వారు ఎలాగోలా కొవిడ్‌ నుంచి బయటపడ్డాం.. ఇక మళ్లీ పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ వచ్చిన తర్వాత నా బాబుని దగ్గరికి తీసుకున్న ఆ క్షణం నా ఎమోషన్స్‌ని అస్సలు కంట్రోల్‌ చేసుకోలేకపోయా. వాడిని పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేశా. ఇంకెప్పుడూ ఇలా నీ నుంచి దూరంగా ఉండనంటూ వాడిని గుండెలకు హత్తుకున్నా.. నాలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదని ఆ దేవుడిని వేడుకున్నా..

ఇలా కొవిడ్‌ కారణంగా నా కొడుకును గదిలో బంధించి నేను పడిన మానసిక వేదన ఎంతో! ఇలాంటి ఎడబాటు ఏ తల్లికీ రాకూడదు.. అందుకే నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నా. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయి కదా అన్న నిర్లక్ష్యం వద్దు.. పూర్తి జాగ్రత్తలు తీసుకున్నా.. వైరస్‌ సోకుతుందనడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ! పైగా రాబోయే రోజుల్లో మూడో దశ ముప్పు పొంచి ఉందని, అది పిల్లల పైనా ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి వైరస్  తగ్గుముఖం పట్టినా మాస్కులు, పరిశుభ్రత, సామాజిక దూరం మరవద్దు. ఇటు మీరు జాగ్రత్తగా ఉంటూనే.. అటు మీ కుటుంబ సభ్యుల్ని, చిన్నారుల్ని రక్షించుకోండి.. అర్హత ఉన్న వారంతా టీకా వేయించుకోండి..! ఇప్పుడు సమయం మనది కాకపోవచ్చు.. కానీ ముందు ముందు మనకూ మంచి రోజులొస్తాయి.. ఆ ఆశతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం..!
స్టే సేఫ్‌.. బీ స్ట్రాంగ్!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని