close
Updated : 17/06/2021 16:19 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

కడుపుబ్బరమా? అయితే ఇలా తగ్గించుకోండి!

తన సిస్టర్ బర్త్ డే పార్టీ సందర్భంగా తనకెంతో ఇష్టమైన లెహెంగా ధరించాలనుకుంది ప్రణయ. అయితే ఎప్పుడూ లేనట్లుగా లెహెంగా స్కర్ట్‌ నడుం దగ్గర కాస్త బిగుతుగా, అసౌకర్యంగా అనిపించిందామెకు. దీనికి కారణం కడుపుబ్బరమే అని తెలుసుకుంది.
కోమలి కూడా కడుపులో గ్యాస్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో ఉబ్బిన తన పొట్టను చూసుకొని కాస్త అసౌకర్యంగా ఫీలవుతోంది.
ఇష్టమైన ఆహారం ఎక్కువగా లాగించినా, మలబద్ధకం ఉన్నా, కడుపులో గ్యాస్‌ ఏర్పడినా, నీళ్లు ఎక్కువగా తాగినా, నెలసరి సమయంలో.. ఇలా పలు సందర్భాల్లో కడుపు ఉబ్బరంగా అనిపించడం , తద్వారా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమే! దాంతో తలెత్తే అసౌకర్యం వల్ల ఇతర పనులపై దృష్టి పెట్టలేం.. పైగా ఎప్పుడూ నాజూగ్గా (ఫ్లాట్‌గా) కనిపించే పొట్ట ఒక్కసారిగా ఎత్తుగా కనిపించేసరికి మనసుకు ఏదోలా అనిపిస్తుంది. మరి, ఈ సమస్యను తగ్గించుకొని తిరిగి పొట్టను నాజూగ్గా మార్చుకోవాలంటే.. అందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..


పీచు ఎక్కువగా తీసుకోవాలి!
పీచు, ద్రవాహారం తక్కువగా తీసుకోవడం.. వ్యాయామం చేయకపోవడం.. వంటివి మలబద్ధకానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య వల్ల కడుపుబ్బరం, దాని కారణంగా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమేనని, అయితే కొంతమంది ఆరోగ్యవంతుల్లో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా కడుపులో నీటి స్థాయులు పెరిగిపోయి ఈ సమస్య తలెత్తవచ్చని చెబుతున్నారు. అందుకే పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు రోజూ తాము తీసుకునే ఆహారంలో 25 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు, పప్పులు, నట్స్‌, గింజల్లో.. పీచు అధికంగా ఉంటుంది. వీటితో పాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి క్రమంగా కడుపుబ్బరం, పొట్ట ఎత్తు కూడా తగ్గిపోతాయి.


గబగబా తినేస్తున్నారా?
సమయం లేదనో, ఇతర కారణాల రీత్యానో కొంతమంది గబగబా భోజనం చేసేస్తుంటారు. కడుపులో గ్యాస్‌, ఉబ్బరానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా తొందరతొందరగా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి వెళ్లిపోయి ఈ సమస్యల్ని తెచ్చిపెడుతుందట! అందుకే భోంచేయడానికి కనీసం అరగంటైనా కేటాయించమంటున్నారు. అలాగే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడమూ ముఖ్యమేనట! ఈ క్రమంలో పదార్థం రుచిని ఆస్వాదించడంతో పాటు జీర్ణవ్యవస్థ కూడా చురుగ్గా ఉంటుందని, మరీ ఎక్కువ ఆహారం తీసుకోకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.


వీటితో ఉపశమనం పొందచ్చు!
కడుపులోని మంచి బ్యాక్టీరియా ఉబ్బరాన్ని తగ్గిస్తుందట! ఇందుకోసం ప్రొబయోటిక్స్‌ ఎక్కువగా ఉండే పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, ఛీజ్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పెప్పర్‌మింట్‌ టీ, అల్లం టీ, పైనాపిల్‌, ఆకుకూరలు.. వంటివి కడుపుబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.


సుఖ నిద్ర అవసరం!
రాత్రుళ్లు ఆలస్యంగా తినడం, అర్ధరాత్రి దాటాక పడుకోవడం వల్ల నిద్ర సరిపోదు. తద్వారా ఆహారం అరక్కపోవడం, గ్యాస్‌, కడుపుబ్బరం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. అందుకే త్వరగా తినడం, వేళకు పడుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇలా సుఖంగా నిద్రపోయిన వారిలో గ్రెలిన్‌ హార్మోన్‌ (ఆకలిని పెంచే హార్మోన్‌) స్థాయులు తగ్గుతాయని, లెప్టిన్‌ హార్మోన్ (ఇది కొవ్వుల్ని కరిగించి శరీరంలో శక్తిని సమతులం చేస్తుంది.. తద్వారా ఆకలిని నియంత్రిస్తుంది.) స్థాయులు పెరుగుతాయని.. తద్వారా రోజంతా ఆకలి అదుపులో ఉండి మితంగా ఆహారం తీసుకోవచ్చని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇలా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్యకు దూరంగా ఉండచ్చంటోంది. కాబట్టి నిద్రను త్యాగం చేయడం మానుకోమంటున్నారు నిపుణులు.

ఈ నియమాలు పాటించాల్సిందే!

* తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం వల్ల కూడా కడుపుబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చు.
* శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, డీహైడ్రేషన్‌కి గురైనా, టీ-కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలెక్కువ. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం (గోరువెచ్చటి నీళ్లైతే మరీ మంచిది), వంటకాల్లో ఉప్పు తగ్గించడం మంచిదంటున్నారు నిపుణులు.
* కొన్ని రకాల శీతల పానీయాలు తాగినప్పుడు కూడా కడుపు ఉబ్బరానికి గురవుతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ తాగాలనిపిస్తే మితంగా తీసుకోవాలి.
* కొంతమంది పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు కూడా కడుపుబ్బరానికి గురవుతుంటారు. కాబట్టి ఈ పదార్థాల్ని మితంగా తీసుకోవడం మంచిది.


* స్మూతీస్‌, పండ్ల రసాలు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించకుండా.. నేరుగా గ్లాస్‌తోనే తాగడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా గాలి కడుపులోకి చేరకుండా ఉబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
* కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్న మహిళలు భోజనానికి ముందు (లంచ్‌, డిన్నర్‌ సమయాల్లో).. ఒక అరటిపండు తినడం వల్ల సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఇలా రెండు నెలల పాటు ప్రయత్నిస్తే సమస్య సగానికి సగం తగ్గుతుందట!
* కడుపుబ్బరానికి ప్రధాన కారణమైన మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజూ 20 నిమిషాల పాటు ఎప్సమ్‌ సాల్ట్ బాత్‌ చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో బాత్‌టబ్‌లో రెండు కప్పుల ఎప్సమ్ సాల్ట్‌ వేసుకొని అందులో 20 నిమిషాల పాటు సేదదీరితే సరి!

కడుపుబ్బరం నుంచి ఉపశమనం పొంది తిరిగి నాజూకైన పొట్టను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారుగా! అయితే ఈ సమస్య ఎప్పుడో ఒకసారి కాకుండా పదే పదే తలెత్తితే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా దాని కారణంగా ఇతర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తప్పుతుందంటున్నారు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని