close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం 

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి 1952లో తొలిసారి ఎన్నిక జరిగింది. ఇది జనరల్‌ కేటగిరి. గుంటూరు జిల్లాలో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి రెండుసార్లు విజయం సాధించిన మాజీముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేసి జాతీయ రాజకీయాల్లో నరసరావుపేటకు ప్రత్యేకతను తెచ్చిపెట్టారు.

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పునర్విభజనకు ముందు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కంభం, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఉండేది. పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లాకే పరిమితమైంది. ప్రస్తుతం నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అభ్యర్థులు 10 సార్లు విజయం సాధించారు. మూడుసార్లు తెలుగుదేశం, ఒక సారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగెస్‌ పార్టీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డిపై  తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావు 35,220 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952-57- సి.ఆర్.చౌదరి(స్వతంత్ర అభ్యర్ధి)
* 1962-67- ఎమ్.మచ్చరాజు(కాంగ్రెస్‌)
* 1967-71-మద్ది సుదర్శనం(కాంగ్రెస్‌)
* 1971-77- మద్ది సుదర్శనం(కాంగ్రెస్‌)
* 1977-80- కాసు బ్రహ్మానందరెడ్డి(కాంగ్రెస్‌)
* 1980-84- కాసు బ్రహ్మానందరెడ్డి(కాంగ్రెస్‌)
* 1984-89- కాటూరి నారాయణ స్వామి(తెలుగుదేశం)
* 1989-91- కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)
* 1991-96- కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)
* 1996-98- కోట సైదయ్య(తెలుగుదేశం)
* 1998-99- కొణిజేటి రోశయ్య(కాంగ్రెస్‌)
* 1999-04- నేదురుమల్లి జనార్ధనరెడ్డి(కాంగ్రెస్‌)
* 2004-09- మేకపాటి రాజమోహన రెడ్డి(కాంగ్రెస్‌)
* 2009-14- మోదుగుల వేణుగోపాలరెడ్డి(తెలుగుదేశం)
* 2014-19- రాయపాటి సాంబశివరావు(తెలుగుదేశం)
ముఖ్యమంత్రులను గెలిపించిన నియోజకవర్గం 
రాష్ట్రానికి కాంగ్రెస్‌పార్టీ పరంగా అత్యధికకాలం ముఖ్యమంత్రిగా చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడ నుంచి లోక్‌సభకు రెండుసార్లు గెలిచారు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా చేసిన నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇక్కడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నరసరావుపేట లోక్‌సభ సభ్యుడుగా 1998లో గెలిచిన కొణిజేటి రోశయ్య  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరో కోణంలో గమనిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కొణిజేటి రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఈ విధంగా నరసరావుపేట లోక్‌సభ స్థానం అనేక విశిష్టతలను సంతరించుకుంది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net