close

తాజా వార్తలు

మోదీ మళ్లీ వస్తే ఎన్నికలే ఉండవు: బాబు

మండ్య ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం

మండ్య: కర్ణాటకలో సీఎం కుమారస్వామి సుపరిపాలన అందిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. మోదీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని మండ్యలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించారు. అధికారంలోకి వచ్చాక మీడియా సమావేశం నిర్వహించని ఏకైక ప్రధాని మోదీ అని ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని ఆరోపించారు. ‘నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా?’ అని ఓటర్లను ప్రశ్నించారు. మోదీ పాలనలో వ్యవసాయం బాగా దెబ్బతిందని, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. ఆయన మాటలకు, పనులకు పొంతన లేదన్నారు. రూ.2 వేల నోట్ల వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగిందని, అసలు ఆ నోటును ఎందుకు తెచ్చారో మోదీ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘జాగ్వార్‌’ కోసం ఇక్కడికి వచ్చా!
దేశ రక్షణ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజీపడిందన్న చంద్రబాబు.. మోదీ సూచనల మేరకు ఈసీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ఓట్ల లెక్కింపులో 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిందని.. మహిళా భద్రత అంశంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి సంస్థలను మోదీ ధ్వంసం చేశారని మండిపడ్డారు. కుమారస్వామి తనయుడుని ఉద్దేశిస్తూ.. మీ అందరి ‘జాగ్వార్‌’ నిఖిల్‌ కోసం ఇక్కడికి వచ్చానని చంద్రబాబు అన్నారు. ‘‘ఎందరో తెలుగువాళ్లు కన్నడసీమలో స్థిరపడ్డారు. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమయ్యారు. ఎన్టీఆర్‌కు కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌ అంటే ఎంతో అభిమానం. బెంగళూరు, మైసూర్‌ అంటే తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం. కర్ణాటక ధాన్యాగారంగా మండ్య నిలవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. కావేరీ నీళ్లతో తడిశాక ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని చెప్పారు.  ప్రధాని పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి దేవెగౌడ అని కితాబిచ్చారు.  మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి అసాధారణ నేతగా దేవెగౌడ ఎదిగారని చెప్పారు. ఆయన పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నేత అని కొనియాడారు. నిరాడంబరత, దృఢ సంకల్పం, సమర్థ ఉన్న నేత దేవెగౌడ అని తెలిపారు. రైతుల సమస్యలను దేవెగౌడ జాతీయస్థాయిలో లేవనెత్తారని, కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రధానిగా దేవెగౌడ పేరు చరిత్రలో నిలుస్తుందని చంద్రబాబు అన్నారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net