close

ఇంటర్వ్యూలు

ఎందుకీ ‘పాక్‌’లాట!

మోదీ బయటి చూపులు మానుకోవాలి: జ్యోతిరాదిత్య

నగీనా(ఉత్తర్‌ ప్రదేశ్‌): జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్‌లో కీలక నేత. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో పార్టీ అధికారంలోకి రావడం వెనుక ఈయన కృషి అపారం. తాజాగా యూపీలో మకాం వేసిన సింధియా.. సార్వత్రిక ఎన్నికల వేళ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. భాజపాపై విమర్శల వర్షం గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ సంబంధిత అంశాలను పదే పదే ప్రస్తావిస్తుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

ఇక్కడి సమస్యలపై దృష్టిపెట్టాలి
మనదేశంలో నిరుద్యోగ సమస్య పెనుభూతమై కూర్చుంది. అన్నదాతలు కష్టాల కొలిమిలో చిక్కుకున్నారు. పౌరుల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతోంది. ప్రధాని, ప్రభుత్వం, అధికార పార్టీ ఈ సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. నిరంతరం పాకిస్థాన్‌ గురించి మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. మోదీ ఇకనైనా బయటి చూపులు మానుకోవాలి. దేశంలోని సమస్యలపై దృష్టిసారించాలి.

న్యాయ్‌ కోసం నిధుల సమీకరణ
పేదలకు కనీస ఆదాయ భరోసా కల్పించేలా మేం ప్రతిపాదించిన ‘న్యాయ్‌’ పథకం ఈ ఎన్నికల్లో దేశమంతటా కీలక పాత్ర పోషిస్తుంది. పార్టీని విజయపథంలో నడిపిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరమని తెలుసు. అందుకోసం నిధులు సమీకరిస్తాం. ఇది దేశ ప్రజల గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం.

పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యం
పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో మేం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమితో ఎన్నికల తర్వాత జట్టు కట్టే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. మేం మాత్రం కచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తాం.


మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net