close

తాజా వార్తలు

అమృత్‌సర్‌ నుంచి సన్నీ డియోల్‌?

చండీగఢ్‌: బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. దీంతో సన్నీని అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపే యోచనలో భాజపా ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో జట్టు కట్టిన ఆ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. అందులో ఒకటి అమృత్‌సర్‌. అయితే ఇక్కడి నుంచి ప్రముఖ వ్యక్తిని నిలపాలని గత కొంతకాలంగా భాజపా యత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే హర్భజన్‌ సింగ్‌, పూనమ్‌ ధిల్లాన్‌, రాజేందర్‌ మోహన్‌ సింగ్‌ లాంటి ప్రముఖుల్ని సంప్రదించారు. కానీ ఆ వ్యూహాలేవీ ఫలించకపోవడంతో ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేకపోయారు.

ఈ వార్తలపై సన్నీ డియోల్ స్పందించారు. ‘‘నా పోటీపై మీడియాలో వస్తున్న వార్తల్ని విన్నాను. నేను ఇప్పుడే ఆయన్ని(అమిత్‌ షా) కలిశాను. ఇద్దరం కలిసి ఓ ఫోటో తీసుకున్నాం. అంతే..’’ అని పేర్కొన్నారు. సన్నీ డియోల్‌ తండ్రి ప్రముఖ నటుడు ధర్మేంద్ర 2004లో రాజస్థాన్‌లోని బికనేర్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అకాళీదళ్ 10 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా అమృత్‌సర్, గుర్దాస్‌పూర్, హోషియాపూర్‌ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలో నిలపనుంది. ఈ నేపథ్యంలో సన్నీని అమృత్‌సర్‌ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు. గదర్, హిమ్మత్, ఘటక్, బార్డర్ లాంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించిన సన్నీ డియోల్‌.. యుద్ధ నేపథ్యం ఉన్న సినిమాలతో మంచి పేరు సంపాదించారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net