close

తాజా వార్తలు

భాజపాకు 150 సీట్లు కూడా రావు’

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య

కొప్పల్‌: దేశానికి మోదీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరుణంలో  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక గాలి వీస్తోందని, దక్షిణ భారతదేశంలో భాజపా ఎక్కడా లేదన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్రెస్‌- జేడీఎస్‌ తరఫున ఆదివారం  చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్‌ ఐదేళ్ల పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం ఆగదు
‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సహకరించకపోగా.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. వ్యవస్థలన్నింటినీ మోదీ భ్రష్టు పట్టించారు.  భాజపా ఆర్థిక విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోయింది. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారు. అసత్యాలు చెప్పడంలో మోదీ దిట్ట. మెరుపు దాడులపై ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. మోదీ పాలనలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. మోదీ అన్నీ హామీలే ఇస్తారు తప్ప ఏమీ చేయరు. ఐదేళ్ల పాలనలో రూపాయి విలువ బాగా క్షీణించిపోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల రెండు శాతం అభివృద్ధి ఆగిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీఎస్టీతో వ్యాపారులంతా బాగా దెబ్బతిన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీలాంటి సంస్థలను సైతం నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌ స్లిప్పుల్లో పరిశీలించాలి. సుప్రీంకోర్టుకే తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వాళ్లు దేనికైనా తెగిస్తారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని మేమంతా పోరాడుతున్నాం. ఏపీలో రైతులకు రూ.24,500 కోట్లు రుణవిముక్తి కల్పించాం. దేశంలోని బ్యాంకులను దోపిడీ చేసిన దొంగలు విదేశాలకు పారిపోయారు. అవినీతిని భాజపా పెంచి పోషిస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net