close

తాజా వార్తలు

తదుపరి ప్రధాని రాహుల్‌ గాంధీ..

పనాజీ (గోవా): ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధిక సీట్లు వస్తే తదుపరి ప్రధానిగా తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ నేత ఆనంద్‌ శర్మ తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘తదుపరి ప్రధాని ఎవరన్న విషయాన్ని ప్రతిపక్ష నాయకులు నిర్ణయిస్తారు. ఏ పార్టీకి చెందిన నాయకుడు ప్రధాని అవుతారన్న విషయం పార్టీలకు వచ్చే మెజార్టీపై ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల్లో ఒకవేళ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధిస్తే మన తదుపరి ప్రధాని రాహుల్‌ గాంధీ అవుతారు. లోక్‌సభ ఎన్నికల ముందు పొత్తులు కొనసాగుతున్నాయి. అలాగే, ఎన్నికల తర్వాత కూడా మరికొన్ని పొత్తులు పొడుస్తాయి. పొత్తుల విషయం ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

‘2004లో ముందు భాజపాలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లాంటి నేత ఉన్నప్పటికీ ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేను జ్యోతిష్యుడిని కాదు.. కానీ, నేను ఒక విషయాన్ని మాత్రం చెప్పగలను. భాజపా గెలవదు.. మోదీ మరోసారి ప్రధాని కాలేరు. ఈ ఐదేళ్లలో ఏ అభివృద్ధి పనులు చేశామన్న విషయాన్ని ఆయన చెప్పలేకపోతున్నారు. 2014కు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ఆయన క్షమాపణలు కోరాలి. భాజపా.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటోంది.. ఇది సిగ్గు పడాల్సిన విషయం. దేశ చరిత్రలో మొదటిసారిగా రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యంపై ప్రధాని వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత ఆర్మీ మోదీ ప్రభుత్వానికి చెందినది కాదు.. ప్రజలకు చెందినది’ అని స్పష్టం చేశారు.        


 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net