close

తాజా వార్తలు

ప్రజలను అవమానిస్తున్నారు: మమతా బెనర్జీ

కోల్‌కతా: ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన అధికారులు పశ్చిమ బంగాల్ ప్రజలను అవమానిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు అజయ్‌ వి నాయక్‌ ఇటీవల మాట్లాడుతూ పశ్చిమబంగాల్‌లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే 15 ఏళ్ల కిందటి బిహార్‌ను తలపిస్తుందని, అలాగే, రాష్ట్ర పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై మమత విమర్శలు చేశారు. నదియా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... ‘రాష్ట్ర ప్రజలను అధికారులు అవమానపర్చుతున్నారు. రాష్ట్రంలో భాజపా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇద్దరు పదవీ విరమణ పొందిన అధికారులను రాష్ట్రానికి పంపింది. ఇది అప్రజాస్వామికం. వారు భాజపాకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

‘రాష్ట్రంలో కేంద్ర బలగాలను దింపి 2016 అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. అయినప్పటికీ, మా విజయాన్ని ఆపలేకపోయారు. ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడిందంతా అసత్యాలతో నిండిపోయింది. ఐదేళ్లుగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్ భావజాల భాషలో మాట్లాడారు. ప్రధాని హోదా చాలా ఉన్నతమైంది.. కానీ, ఇలా ఇంతటి తక్కువ స్థాయిలో వ్యవహరించే వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. పెద్దనోట్ల రద్దు వల్ల లక్షలాది మంది వలస కూలీలు తమ ఉపాధిని కోల్పోయారు. ప్రధాని.. పెద్ద నోట్లను బంద్‌ చేశారు... ప్రజలు భాజపాకు ఓటు వేయడం బంద్‌ చేస్తారు. వలస పక్షుల్లా భాజపా నేతలు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి వస్తారు. అనంతరం మాయమవుతారు. భాజపా, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు.. ఒకే కూటమిలో ఉండి గొడవపడుతున్న వ్యక్తులవంటి వారు’ అని మమత వ్యాఖ్యానించారు.   ‌   


 మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net