close

తాజా వార్తలు

ప్రధాని మోదీకి కళా బహిరంగ లేఖ

అమరావతి: ఐదేళ్ల పాటు బీసీలను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రధాని మోదీ బీసీ కార్డు వాడుకోవడంలో అర్థమేంటని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన 14 అంశాలతో మోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని పదవిలో కొనసాగుతూ కులాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు. చాయ్‌వాలా అని చెప్పుకొనే మోదీ.. దేశంలో  50 శాతానికిపైగా ఉన్న బీసీల కోసం ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దిల్లీకి పంపిన తీర్మానాలను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేసే ఆలోచన భాజపాకు లేదనే ఉద్దేశంతోనే రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడం వాస్తవం కాదా? అని లేఖలో ప్రశ్నించారు. వెనుకబడిన తరగతులకు చెందిన పాలేటి రామారావు, పుట్టా సుధాకర్ యాదవ్‌లపై రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేయించారని కళా మండిపడ్డారు. ప్రధాని కార్యాలయంలో ఎంతమంది బీసీలను నియమించారో లెక్క చెప్పగలరా? అని నిలదీశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది బీసీ గవర్నర్లు నియమించారని ప్రశ్నించారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net