close

ఒకప్పటి ముచ్చట్లు

రాజస్థాన్‌ నుంచి లోక్‌సభకు ఒకే ఒక్క ముస్లిం!

రాజస్థాన్‌ జనాభాలో పది శాతం మంది ముస్లింలున్నా... 1952 నుంచి ఇప్పటివరకూ ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి లోక్‌సభకు ఎన్నికయ్యారు! అది కూడా నాలుగుసార్లు పోటీచేస్తే... రెండు దఫాలు గెలిచారు. 1984, 1991 ఎన్నికల్లో ఝుంఝునూ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆయూబ్‌ఖాన్‌ గెలిచి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆయన కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

వారికి అచ్చిరాని ఎన్నికలు
16వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ముస్లిం సామాజికవర్గానికి చెందిన 13 మంది; భాజపా నుంచి ఒక అభ్యర్థి పోటీ చేసినా ఒక్కరూ విజయం సాధించలేదు. 1952, 1957లో జోధ్‌పుర్‌ నుంచి పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి యాసిన్‌ నూరి; 1957లో భిల్వారా నుంచి పోటీచేసిన ఫిరోజ్‌ షాలు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1962, 1967, 1972లో అసలు ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికీ ఆ పార్టీ టికెట్లు ఇవ్వనేలేదు. మళ్లీ 1977లో చుర్‌ నుంచి మహమ్మద్‌ ఉస్మాన్‌ ఆరిఫ్‌ను హస్తం పార్టీ నిలబెట్టినా... ఎమర్జెన్సీపై ఆగ్రహంతో ఆయనా ఓడిపోయారు. 1999లో ఝాలావాడ్‌ నుంచి అక్బర్‌ అహ్మద్‌ నిలబడినా గెలవలేకపోయారు. 2004లో అజ్‌మేర్‌ నుంచి హబీబుర్‌ అజారుద్దీన్‌ను; 2009లో చుర్‌ నుంచి రఫీక్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించింది. వారి విజయం కోసం ఎంత కృషిచేసినా ఫలితం లేకపోయింది. 2014లో హైదరాబాద్‌కు చెందిన క్రికెట్‌ దిగ్గజం మహమ్మద్‌ అజారుద్దీన్‌ను టోంక్‌-సవాయీ మాధోపుర్‌ నుంచి బరిలోకి దింపింది. ఆయన కూడా ఓడిపోయారు.


మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net