close

తాజా వార్తలు

కాంగ్రెస్‌ నుంచి విముక్తి పొందినప్పుడే పేదరిక నిర్మూలన

జైపూర్‌: కాంగ్రెస్‌ నుంచి భారత్‌ విముక్తి పొందినప్పుడే దేశంలో పేదరికాన్ని నిర్మూలించవచ్చని కేంద్రమంత్రి, భాజపా నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. తాము పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో కనీస ఆదాయ భరోసా హామీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఇస్తున్న హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లోని‌ బికనీర్‌లో భాజపా ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘చరిత్రలోని పేజీలను తిరగేసి చూడండి. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో హామీలను గుప్పించింది.. కానీ, వాటిని నెరవేర్చలేదని మీరు తెలుసుకుంటారు. పేదరికాన్ని తగ్గించాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి విముక్తి పొందినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన చేసిన వైమానిక దాడులపై ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్న ప్రశ్నల పట్ల రాజ్‌నాథ్‌ విమర్శలు గుప్పించారు. ‘ఎన్ని మృతదేహాలు ఉన్నాయన్న విషయాన్ని భద్రతా బలగాలు లెక్కపెట్టరు. ఆపరేషన్‌ ముగిశాక మన దళాలు తిరిగి రాకుండా అక్కడే ఉండి మృతదేహాలు లెక్కపెడుతూ ఉండాలా? 1971లో భారత్‌-పాక్ యుద్ధంలో భారత్‌ సాధించిన విజయం గొప్పదనం అంతా‌ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఇచ్చినప్పుడు, మరి ఇప్పుడు పాక్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన నేపథ్యలో ఈ గొప్పదనాన్ని మోదీకి ఎందుకు ఇవ్వకూడదు?’ అని ప్రశ్నించారు.     



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net