close

తాజా వార్తలు

ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: అక్షయ్‌ కుమార్‌

 

ముంబయి: ఈ లోక్‌సభ ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు ఆయన సోమవారం చేసిన ఓ ట్వీట్‌ చాలా వైరల్‌ అయింది. దీంతో అక్షయ్‌ రాజకీయ ప్రవేశం లాంఛనమే అని అందరూ అనుకున్నారు. కానీ వాటిని ఖండిస్తూ అక్షయ్‌ వివరణ ఇచ్చారు.

‘ ఇదివరకు ఎప్పుడూ చూడని, తెలీని కొత్త రంగంలోకి వచ్చాను. నేనింతకు ముందు చేసినట్లు కాకుండా ఇంకా ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మరిన్ని అప్‌డేట్స్‌ తర్వలోనే ఇస్తాను’ అని అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతుండటానికి తోడు ఈ ట్వీట్‌తో అది మరింత బలపడింది. ఈ ట్వీట్‌ వైరల్‌ అయింది. ట్విటర్‌ ఆయనను నెటిజన్లు ప్రశ్నలతో ముంచెత్తారు. దీనిపై వివరణ ఇస్తూ మరో ట్వీట్‌ చేశారు.
‘నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ పట్ల ఆసక్తి చూపించినందుకు గొప్పగా ఉంది. ఊహాగానాలకు తెరదించాలనుకుంటున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’ అని స్పష్టం చేశారు.

ఓటింగ్‌ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికలు ప్రారంభం కాక ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా అక్షయ్‌కుమార్‌ను మోదీ తన ట్వీట్‌లో చేర్చారు. అయితే అక్షయ్‌ కూడా తన స్టైల్‌లో మోదీకి రిప్లై ఇచ్చారు. అప్పటి నుంచి అక్షయ్‌కు రాజకీయాల మీద ఆసక్తి ఉందని ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net