close

తాజా వార్తలు

‘మహా’ ఐక్యత కొనసాగుతోందా?

ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం‌: దేశవ్యాప్తంగా ‘సార్వత్రిక’ హోరు కొనసాగుతోంది. రెండు ప్రధాన పక్షాలైన భాజపా, కాంగ్రెస్‌ సారథ్యంలోని కూటములు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గద్దె దించాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తుండగా.. కుటుంబపాలన వద్దని, తాము చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని చేకూరుస్తుందని భాజపా ధీమాగా ఉంది. మరోవైపు దేశంలో భాజపా పాలిత రాష్ట్రాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గెలుపు అంతసులువేం కాదని గ్రహించిన కాంగ్రెస్‌.. మహాకూటమి ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ పెద్దలు  చొరవ తీసుకున్నారు. కొన్ని పార్టీలు కూటమికి సై అంటున్నా.. పలుచోట్ల ఆయా పార్టీల మధ్య ఐక్యత లోపిస్తోంది. కొన్నిచోట్ల సీట్ల పంపకాలు సైతం ఓ కొలిక్కి రాలేదు. దీంతో కూటమిలో కొనసాగుతామంటూనే పోటీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రస్తుత ఎన్నికల్లో మహాకూటమి విజయావకాశాలేంటి? కూటమి నేతల ఐక్యంగా ముందుకెళ్తున్నారా? తదితర విషయాలని ఓసారి పరిశీలిస్తే..

ఏళ్ల వైరం మరిచి జట్టుకట్టాయి

భాజపాను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఏళ్ల వైరాన్ని సైతం పక్కనపెట్టి ప్రతిపక్ష పార్టీలు జట్టుకట్టాయి. ఎస్పీ, బీఎస్పీ, తెదేపా, ఆర్జేడీ, ఆమ్‌ ఆద్మీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, జేడీఎస్‌, డీఎంకే, జేఎంఎం తదితర పార్టీలు మహాకూటమిలో ఏర్పాటులో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. వీటిలో ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, డీఎంకే పార్టీలు ముందు నుంచీ కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో వచ్చిన విభేదాలతో ఎన్డీయే నుంచి తెదేపా బయటకొచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘హోదా’ ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించడంతో ఆ పార్టీతో తెదేపా ముందుకెళ్తోంది. కర్ణాటక ఎన్నికల్లో అధికారం పంచుకోవడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో జేడీ(ఎస్‌) జట్టు కట్టింది.  భాజపాను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆప్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. మరోవైపు కీలక రాష్ట్రాలైన యూపీలో ఎస్పీ, బీఎస్పీ సైతం మహాకూటమిలో చేరాయి. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం ప్రతిపక్షాల ఐక్యతకు మద్దతు ఇస్తున్నట్టు కనిపించినా పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఒంటరిగానే పోటీచేస్తోంది. ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ మూడూ కలిసి కాంగ్రెస్‌ను పక్కన పెట్టేశాయా?

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలిచ్చే తీర్పు చాలా కీలకం. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) యూపీలోనే ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ  స్థానాలు వస్తే ఆ పార్టీకి కేంద్రంలో అధికారం దక్కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అందుకే ప్రధాన పార్టీల దృష్టి యూపీపై ఎప్పుడూ ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీకి గుడ్‌బై చెప్పిన యూపీ వాసులు.. భాజపాకు అధికారం కట్టబెట్టారు. దీంతో ఆ రాష్ట్రంలో భాజపా బలం మరింత పెరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీతోపాటు మాయావతి సారథ్యంలోని బీఎస్పీ కూడా క్షేత్రస్థాయిలో బలీయంగా ఉన్నాయి. అక్కడ నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌.. ఎస్పీ, బీఎస్పీలను మహాకూటమిలోకి ఆహ్వానించింది. వాస్తవానికి ఎస్పీ, బీఎస్పీ రెండూ కొన్నేళ్లుగా ఉప్పు, నిప్పులా ఉన్నాయి. అలాంటి పార్టీలు సైతం భాజపాను గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌తో కలిశాయి. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కలిసి కాంగ్రెస్‌ను పక్కనపెట్టేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  రాష్ట్రంలో ఆ పార్టీ బలహీనంగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో అడుగు ముందుకేసి ఒకే వేదికపై కనిపించారు. మెయిన్‌పురిలో నిర్వహించిన ప్రచారసభకు మాయావతి హాజరై ములాయంను గెలిపించాలని కోరారు. కీలకమైన రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఎస్పీ-బీఎస్పీల మధ్య అనైక్యత భాజపాకు లాభం చేకూరుస్తుందా? ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కలయికే మంచిదని ప్రజలు భావిస్తారా? ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.

దిల్లీలో పొత్తు పొడవలేదు

మహాకూటమిలో చేరికకు ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సుముఖత వ్యక్తం చేశారు. ఆప్‌ చేరికను కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా స్వాగతించింది.  విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశాలకూ ఆప్‌ నేతలు హాజరయ్యారు. తాజా ఎన్నికల్లో దిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య పొత్తు పొడుస్తుందని.. ఆ రెండు పార్టీలు కలిసే పోటీచేస్తాయని అంతా భావించారు. అయితే దిల్లీకి చెందిన స్థానిక కాంగ్రెస్‌ నేతలు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌.. కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా లోక్‌సభ సీట్ల పంపిణీలోనూ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పొత్తు కార్యరూపం దాల్చలేదు. దీంతో కాంగ్రెస్‌, ఆప్‌ వేర్వేరుగానే పోటీ చేస్తున్నాయి.

కొన్ని చోట్ల కాంగ్రెస్‌ ‘ఒంటరే’

కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌ బలహీనంగా ఉండటంతో ఆ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగడం తప్పట్లేదు. ఏపీ, యూపీలో కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. క్షేత్రస్థాయిలో అంతగా బలం లేకపోవడంతో కాంగ్రెస్‌ కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. జాతీయ స్థాయిలో అవసరమైతే మద్దతిస్తాం తప్ప.. బలంగా లేని చోట కలిసి వెళ్తే నష్టం తప్పదని తెదేపా, ఎస్పీ, బీఎస్పీ  భావించాయి. అందుకే వేరుగా బరిలోకి దిగాయి. తమిళనాడులోనూ అదే పరిస్థితి ఉన్నప్పటికీ ముందు నుంచీ డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య బంధం బలీయంగా ఉండటంతో కలిసి పోటీ చేయక తప్పలేదు. కాంగ్రెస్‌తో కలిస్తే తప్ప అధికారంలోకి రాలేమని భావిస్తున్న మరికొన్ని పార్టీలు మాత్రం ఆ పార్టీతో కూటమి కట్టి సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి. తమిళనాడులో డీఎంకే, బిహార్‌లో ఆర్జేడీ, ఝార్ఖండ్‌లో జేఎంఎం, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీలన్నీ ఈ కోవలోనివే.

దీదీ దారెటు?

రానున్న ఎన్నికల్లో తృణమూల్‌ మద్దతు ఎవరికో అనే అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఆ మధ్య కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీకి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలూ హాజరయ్యారు. దీంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని అంతా భావించారు. కానీ క్రమంగా తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌కి దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. బెంగాల్‌లో తృణమూల్‌, భాజపా మధ్యే ప్రధాన పోరు నడుస్తోంది. అక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు ఒంటరిగానే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ప్రధాని రేసులో ముందుండొచ్చనే ఆలోచన మమతలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఎన్నికల తర్వాత పరిస్థితుల బట్టి ఆమె నిర్ణయం తీసుకునే సూచనలున్నాయి. మరోవైపు ప్రాంతీయ పార్టీలతోనే సుపరిపాలన అంటూ తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌ వైపు  బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌, మమతా బెనర్జీ  మొగ్గు చూపుతారా? అన్న విషయం తేలాల్సి ఉంది.మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net