close

తాజా వార్తలు

ఆ మాఫియా భరతం పడతాం: అమిత్‌ షా

కోల్‌కతా: ఎన్సీపీ అధినేత  ఒమర్‌ అబ్దుల్లా లాగే, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ‘జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలి’ అనే కోరిక బలంగా ఉందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించారు. అయితే అది ఎప్పటికీ జరిగే పని కాదని వ్యాఖ్యానించారు. ‘కావాలంటే పాకిస్థాన్‌ను మీరు  ప్రేమించుకోండి. అంతేగాని ఆ దేశం బుల్లెట్లు పేల్చితే.. మేము ఫిరంగులతో విరుచుకుపడతాం’ అని మమతను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబంగలోని కృష్ణానగర్‌లో ఆయన పర్యటించారు. తిరిగి ఎన్డీయే అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు.

‘ఆర్టికల్‌ 370ని ఎప్పటిలాగే కొనసాగించాలని  కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అంటున్నాయి. కానీ, మళ్లీ మేం అధికారంలోకి వస్తే ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగం నుంచి పూర్తిగా తొలగిస్తాము’అని అమిత్‌ షా పేర్కొన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ‘జాతీయ పౌరుల రిజిస్టర్‌’(ఎన్‌ఆర్‌సీ)ని ప్రవేశపెడతామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని అవసరమన్న విషయంలో మమత  వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజాపాకు దేశ భద్రత ముఖ్యమైతే.. దీదీకి మాత్రం ఓటు బ్యాంకే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని తమ ఓటుతో ఆమెకు బుద్ధి చెబుతారని అమిత్‌ షా అన్నారు. మమతా బెనర్జీ అండతో రాష్ట్రంలో ఓ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. గోవుల అక్రమ రావాణాలో పశ్చిమబంగ అగ్రస్థానంలో ఉందని, చొరబాటు దారులకు ఈ ప్రాంతం ఆలవాలంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభస్థానాల్లో కనీసం 26 స్థానాల్లో భాజపాను గెలిపించినా.. కేవలం మూడు నెలల్లో ఆ మాఫియా భరతం పడతామని హామీ ఇచ్చారు.  గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కేవలం 2 స్థానాల్లోనే గెలుపొందగా.. 34 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net