close

తాజా వార్తలు

స్మృతి ఇరానీ మిమ్మల్ని అవమానించారు..

ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం

రాయ్‌బరేలీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ.. అమేఠీ ప్రజలను అవమానించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో ఆమెపై విరుచుకుపడ్డారు. అమేఠీలో కొందరికి ఇరానీ బూట్లు అందించినట్లు తెలిసింది. దీనితో పాటు ఆమె తన సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై చేస్తున్న వ్యాఖ్యలపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... ‘ఈ ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చాలామంది బయటి వారు ఇక్కడకు వచ్చి, అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అమేఠీలో ఒక్కసారి కూడా పర్యటించలేదని చెబుతున్నారు. నిజం ఏంటో అమేఠీ ప్రజలకు తెలుసు. స్మృతి ఇరానీ ఆ ప్రాంతానికి వచ్చి బూట్లు పంచారు. ఇది తీవ్రంగా అభ్యంతరాలు తెలపాల్సిన విషయం. రాహుల్‌ను అవమానపర్చుతున్నానని ఆమె అనుకుంటున్నారు. కానీ, ఆమె ఈ నియోజక వర్గ ప్రజలను అవమానపర్చుతున్నారు. అమేఠీతో పాటు రాయ్‌బరేలీ ప్రజలకు ఆత్మగౌరవంతో జీవిస్తారని, ఎవరి ముందూ చేతులు చాపరని తెలుపుతూ మీరు వారికి బుద్ధి చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

‘ఈ ఎన్నికల్లో వారు వ్యవహరిస్తున్న తీరును మీరు గుర్తించాలి. అసత్యాలు పలుకుతూ ప్రజలను మభ్యపెడుతూ, సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు విభాగంలో నేను పర్యటిస్తున్నాను. చిన్న పరిశ్రమలు మూసివేసే స్థితిలోకి వెళ్లిపోయాయి. యువత నిరుద్యోగులుగా ఉన్నారు. అమేఠీలో భాజపా అభివృద్ధి పనులను ఆపేసింది. అప్పట్లో రాజీవ్‌ గాంధీ తన నియోజక వర్గంలో పర్యటించే వారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కూడా అదే పని చేస్తున్నారు. నేను వారణాసికి వెళ్లి ప్రజలను అడిగాను. ఐదేళ్లలో ప్రధాని మోదీ తన సొంత నియోజక వర్గంలో కనీసం ఒక్కసారైనా పర్యటించలేదు’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. 

అందుకే బూట్లు పంచాను: స్మృతి ఇరానీ

ప్రియాంక చేసిన విమర్శలపై స్మృతి ఇరానీ స్పందించారు. ‘నేను ఒక నటిని. ప్రియాంక నటించకుండా ఉంటే బాగుంటుంది’ అని ఎద్దేవా చేశారు. అమేఠీలో కొందరికి కనీసం ఒక జత బూట్లు కూడా లేవని, వారికి సాయం చేసే ఉద్దేశంతోనే ఈ పనిచేశానని తెలిపారు. రాహుల్‌ గాంధీ ఇక్కడి పరిస్థితులను సొంత కళ్లతో చూడాలని, బూట్లు ఇచ్చిన కారణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించాలని ఆమె సలహా ఇచ్చారు.    

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net