close

ఇంటర్వ్యూలు

మాకు మెజారిటీ... రాదనుకుంటున్నా

కేంద్రంలో హంగ్‌ ఖాయం
మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం
మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు
ఛింద్‌వాడా

పనిచేయకపోతే నా కుమారుడి దుస్తులు చించేయండి

ఛింద్‌వాడా లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నా కుమారుడు నకుల్‌ను ఆశీర్వదించండి. మీకు సేవ చేస్తాడు. అతడికి నేను బాధ్యత అప్పగించా. తనకు ఏదైనా పని చెప్పండి. ఆ పని చేయలేకపోతే అతని దుస్తులు చించేయండి.
- ధనోరా ఎన్నికల ప్రచారంలో కమల్‌నాథ్‌

కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీని తమ పార్టీ సాధించే అవకాశాల్లేవని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, తాము చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో హంగ్‌ పార్లమెంటు ఆవిర్భవిస్తుందని అంచనా వేశారు. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా మళ్లీ అధికారం చేపట్టడం కల్లేనని పేర్కొన్నారు. ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో కమల్‌నాథ్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఎన్నికల తర్వాత పొత్తులు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీ మాత్రం రాదనుకుంటున్నా. ఎన్నికల అనంతరం పొత్తులు కుదుర్చుకోవాల్సిందే. మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. మాకు సంఖ్యాబలం ఉంటే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే ప్రధాని బాధ్యతలు చేపడతారు. భాజపా సహా ఏ ప్రధాన పార్టీకీ మెజార్టీ రాదు.

‘న్యాయ్‌’కు వనరులున్నాయ్‌
మా పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పథకం కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి. అదో విప్లవాత్మక పథకం. ‘న్యాయ్‌’ అమలుకు అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ దాడులు
ఇటీవల నా సన్నిహితులను లక్ష్యంగా చేసుకొని ఆదాయపు పన్నుశాఖ జరిపిన దాడులు రాజకీయ దురుద్దేశంతో కూడినవే. అశ్వినీ శర్మ అనే వ్యక్తి దగ్గర డబ్బు దొరికింది. కానీ, ఆయనెవరో నాకు తెలియదు. తాను భాజపాకు చెందినవాడినని మీడియా ఎదుట అశ్వీనీ స్పష్టం చేశారు కూడా. అలాంటప్పుడు ఆ వ్యవహారంతో నాకెందుకు ముడిపెడుతున్నారు?

మోదీ మాటలు హాస్యాస్పదం
గత ఎన్నికల హామీలపై తొలుత మోదీ స్పందించాలి. తన నేతృత్వంలో దేశం సురక్షితంగా ఉందంటూ ఆయన చెప్తున్న మాటలు హాస్యాస్పదం. మనదేశంపై అత్యధిక ఉగ్ర దాడులు భాజపా పాలనలోనే జరిగాయి.


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net