close

కథనాలు

దశ తిరిగేది ఎవరికి?

యూపీలో 10 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌
బరిలో ములాయం, జయప్రద, వరుణ్‌గాంధీ, గాంగ్వర్‌
ఈనాడు - దిల్లీ

దేశ రాజకీయాలను నిర్దేశించే ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం పది లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పలువురు అగ్రనేతలు బరిలో ఉన్నందున ఈ స్థానాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మెయిన్‌పురి, ఫిరోజాబాద్‌, ఎటా, బదాయూ, సంభల్‌, రాంపుర్‌ స్థానాల్లో ముస్లిం, యాదవ్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నందున యాదవ్‌, ముస్లిం, జాతవ్‌ ఓట్లు కలగలిసి కూటమి అభ్యర్థుల గెలుపునకు బాటలు వేస్తాయన్న నమ్మకం ఓటర్లలో వ్యక్తమవుతోంది. రెండు పార్టీల అగ్రనేతలైన ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతి ఇటీవల ఒకే వేదిక మీద కనిపించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మరింత మారినట్లు కనిపిస్తోంది. జాతీయవాదం ఆధారంగా జెండా ఎగరేయాలని భాజపా చూస్తోంది. అధికంగా బంధువులే పోటీ చేస్తున్నారు. ఈ 10 నియోజకవర్గాల్లో ఏడింటిని భాజపా, మూడింటిని ఎస్పీ గత ఎన్నికల్లో గెలుచుకున్నాయి. ఈసారి అందులో మార్పులు ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. మూడో దశ సమరంలో ములాయం, ఆయన సోదరుడు శివ్‌పాల్‌, బంధువులు అక్షయ్‌ యాదవ్‌, ధర్మేంద్ర యాదవ్‌, రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌, మంత్రి మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌గాంధీ, కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆవ్లా

రేలీ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 2014లో భాజపా అభ్యర్థి ధర్మేంద్రకుమార్‌ కాశ్యప్‌ ఎస్పీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి తరఫున రుచివీర్‌(బీఎస్పీ) పోటీ చేస్తుండటంతో ఆయన గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. 2009లో ఇక్కడి నుంచి భాజపా తరఫున మేనకాగాంధీ గెలుపొందారు. ఇప్పటివరకూ అయిదుసార్లు భాజపా గెలిచింది.

బరేలీ

భాజపాకు బలమైన స్థానం. కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ ఇక్కడినుంచి ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఇక్కడ భాజపాకు 31% ఓట్లు, ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులకు కలిపి 22% ఓట్లు దక్కాయి. అందువల్ల గాంగ్వర్‌ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత 2009లో మరోసారి కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని గెలుచుకొంది. కుర్మీ, ముస్లిం, దళితుల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ ప్రవీణ్‌సింహ్‌ రంగంలో ఉన్నారు. ఆయనకు అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉండటంతో భాజపాయేతర ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొరాదాబాద్‌

2014లో తొలిసారి భాజపా ఈ స్థానాన్ని కైవసం చేసుకొంది. ఇత్తడి వస్తువులకు పేరొందిన మొరాదాబాద్‌లో 40% మంది ఓటర్లు మైనార్టీలే. 2009లో ప్రముఖ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఇక్కడినుంచి పోటీచేసి అనూహ్య విజయం సొంతం చేసుకున్నారు. ఇంతవరకు కాంగ్రెస్‌ అయిదుసార్లు, జనసంఘ్‌ రెండుసార్లు, సమాజ్‌వాదీ మూడుసార్లు విజయం సాధించాయి. 2014లో భాజపా తరఫున గెలుపొందిన కున్వర్‌ సర్వేష్‌కుమార్‌ సింగ్‌ ఆ పార్టీ తరఫున మరోసారి రంగంలోకి దిగారు. భాజపా పట్ల చిరు వ్యాపారులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అయితే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్‌, ఎస్పీల మధ్య చీలిపోవడంవల్ల తాము లాభపడొచ్చని భాజపా ఆశిస్తోంది.

పీలీభీత్‌

నియోజకవర్గం పేరు చెబితే తొలుత గుర్తొచ్చేది మేనకా గాంధీయే. 1989 నుంచి వరుసగా ఆరుసార్లు ఇక్కడి నుంచి ఆమె గెలుపొందారు. ఈసారి ఆమె కుమారుడు వరుణ్గాంధీ భాజపా తరఫున రంగంలోకి దిగారు. 2014లో సుల్తాన్‌పుర్‌ నుంచి గెలుపొందిన వరుణ్‌ గాంధీ ఇప్పుడు తల్లి స్థానంలోకి రాగా, కుమారుడి స్థానంలోకి ఆమె వెళ్లారు. ఇక్కడ ఆయన మిత్రపక్షాల అభ్యర్థి హేమ్‌రాజ్‌ వర్మతో పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఎవ్వరూ పోటీలో లేరు. 30 ఏళ్లుగా తన తల్లి ఈ నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తించి ఓటేయాలని వరుణ్‌గాంధీ అడుగుతున్నారు.

మెయిన్‌పురి

యాదవ ప్రాబల్య ప్రాంతం. గతంలో ములాయంసింగ్‌ యాదవ్‌ నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారీ ఆయన విజయం నల్లేరుమీద నడకేనన్న భావన వ్యక్తమవుతోంది. మాయావతితో కలిసి ములాయం నిర్వహించిన బహిరంగ సభ ఇరు పార్టీల ఓటర్లకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. యాదవ్‌, జాతవ్‌ ఓటర్లు క్షేత్రస్థాయిలో బాగా కలిసి పనిచేశారు. ములాయం సోదరుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌పై కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. దాన్ని పక్కనపెట్టి నేతాజీని గెలిపించాలన్న ఏకైక లక్ష్యంతో అంతా పనిచేస్తున్నారు. మాయావతి పిలుపుతో బీఎస్సీ ఓటర్లు కూడా ములాయం విజయానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ములాయంను ఓడించడం కష్టమన్న ఉద్దేశంతో భాజపా ముఖ్యనాయకులెవరూ ప్రచారానికే రాలేదు.

ఫిరోజాబాద్‌

యాదవుల మధ్య సంకుల సమరం నడుస్తోంది. ములాయంసింగ్‌ సోదరుడు, కొత్తగా ఏర్పాటైన ప్రగతిశీల సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు శివ్‌పాల్‌యాదవ్‌ తమ కుటుంబ సభ్యుడైన రామ్‌గోపాల్‌యాదవ్‌ కుమారుడు అక్షయ్‌యాదవ్‌తో తలపడుతున్నారు. యాదవ సోదరుల మధ్య భీకర పోరు కారణంగా ముస్లిం, యాదవ్‌ ఓట్లు చీలి భాజపా అభ్యర్థి లబ్ధి పొందుతారన్న ప్రచారం తొలుత జరిగింది. తర్వాత పరిస్థితులు మారాయి. శివ్‌పాల్‌ యాదవ్‌కు ఓటు వేసి అనవసరంగా వృథా చేసుకోవద్దని, యువకుడైన అక్షయ్‌యాదవ్‌కు ఓటు వేసి భాజపాను ఓడించాలని మాయావతి ఇచ్చిన పిలుపు ఓటర్లలోకి బలంగా దూసుకెళ్లింది. భాజపా పరోక్షంగా శివ్‌పాల్‌యాదవ్‌కు మద్దతిస్తూ బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ములాయంను అభిమానించే యాదవులంతా ఎస్పీ అభ్యర్థికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక్కడ యాదవులు 21%, దళితులు 12%, ముస్లింలు 12% మంది ఉన్నారు. వీరి మద్దతుతో ఎస్పీ మిగతాపార్టీలకంటే ముందున్నట్లు కనిపిస్తోంది. ముస్లిం ఓట్లను చీల్చేందుకు శివ్‌పాల్‌ యాదవ్‌ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆయన వెనుక భాజపా ఉందన్న కారణంతో ముస్లింలంతా ఎస్పీ అభ్యర్థికే మద్దతివ్వడానికి సిద్ధమైనట్లు అక్కడి వాతావరణం కనిపిస్తోంది.

ఎటా

భాజపా నుంచి కల్యాణ్‌సింగ్‌ తనయుడు రాజ్‌వీర్‌సింగ్‌ పోటీ చేస్తుండటంతో కాషాయదళం ఎటా స్థానంలో ప్రతిష్ఠాత్మకంగా పోరాడుతోంది. 2009లో కల్యాణ్‌సింగ్‌, 2014లో రాజ్‌వీర్‌ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి రాజ్‌వీర్‌ గట్టిపోటీ  ఎదుర్కొంటున్నారు. యాదవులు, ముస్లింలు, జాతవ్‌లు ఎస్పీ అభ్యర్థి దేవేంద్రసింగ్‌ యాదవ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అత్యంత వెనుకబడిన తరగతుల్లోని కొన్నివర్గాలు కూడా ఎస్పీకి అండగా నిలుస్తున్నాయి. వ్యవసాయవర్గాలు ఈసారి ఎస్పీవైపు చూస్తున్నాయి. బీఎస్పీ కలయిక ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది.

బదాయూ

స్పీకి అత్యంత బలమైన స్థానం. 1996 నుంచి జోరు కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుత ఎంపీ, ములాయంసింగ్‌ యాదవ్‌ బంధువు ధర్మేంద్ర యాదవ్‌ రెండు పర్యాయాలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య కుమార్తె సంఘమిత్ర మౌర్యను భాజపా రంగంలోకి దింపింది. 23 ఏళ్లుగా ఎస్పీ చేతుల్లో ఉన్న ఈ స్థానాన్ని లాక్కోవాలని భాజపా ఎత్తులు వేస్తోంది. సామాజిక సమీకరణల దృష్ట్యా అదేమీ అంత సులభంగా కనిపించడంలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి సలీం ఇక్బాల్‌ షేర్వాని ఎంత బలంగా ముస్లిం ఓట్లు చీలిస్తే తమ విజయావకాశాలు అంత మెరుగుపడతాయని భాజపా ఆశలుపెట్టుకొంది. సామాజిక లెక్కలు చూస్తే ఎస్పీ అభ్యర్థి విజయానికి ఇబ్బందులు కనిపించడంలేదు.

సంభల్‌

2014లో ఎస్పీ అభ్యర్థి సఫీకర్‌పై భాజపా అభ్యర్థి సత్యపాల్‌సింగ్‌ సైనీ కేవలం అయిదువేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలుపొందారు. ఈసారి భాజపా తన అభ్యర్థిని మార్చి పరమేశ్వర్‌లాల్‌ సైనీని రంగంలోకి దింపింది. ఎస్పీ-బీఎస్పీ కలవడంవల్ల ఇక్కడ భాజపా అభ్యర్థి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. యాదవ్‌ ప్రాబల్య నియోజకవర్గం నుంచి ములాయంసింగ్‌ రెండుసార్లు, ఆయన సోదరుడు రామ్‌గోపాల్‌యాదవ్‌ ఒకసారి గెలుపొందారు. ముస్లిం, ఎస్సీ, యాదవుల ఓట్లు ఇప్పుడు ఎస్పీకి మద్దతుగా నిలవడంతో తప్పకుండా గెలుస్తామని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.

రాంపుర్‌

స్పీ అభ్యర్థి ఆజంఖాన్‌, భాజపా అభ్యర్థి జయప్రద మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక్కడి నుంచి  జయప్రద ఎస్పీ అభ్యర్థిగా 2004, 2009లో గెలిచారు. 2004లో ఆజంఖాన్‌ ఆమెకు మద్దతివ్వగా, 2009లో తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ జయప్రద జయకేతనం ఎగురవేశారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన ముస్లిం అభ్యర్థి కారణంగా ఆ వర్గం ఓట్లు చీలి, ఆజంఖాన్‌ మద్దతు లేకపోయినా జయప్రద గెలవగలిగారన్న విశ్లేషణ ఉంది. ఇప్పుడు ముస్లింలంతా ఆజంఖాన్‌కు మద్దతిస్తున్నారు. 51% ఓట్లు ఆ సామాజికవర్గానివే కావడం ఆయనకు కొండంత బలం. రాంపుర్‌ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో ఆజంఖాన్‌ది చెరగని ముద్ర. ఇక్కడి నుంచి ఆయన 9 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అనుభవంతో జయప్రద ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా ఇక్కడి చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ పనితీరుపైనా ప్రజల్లో సానుకూలత లేదు. ముస్లింలంతా సంఘటితంగా   ఆజంఖాన్‌కే అండగా నిలవాలనే సంకల్పంతో ఉన్నారు. భాజపా మాత్రం ముస్లిం మహిళలు తమకు అండగా నిలుస్తారని నమ్ముతోంది.

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net