close

కథనాలు

రాజధాని రసవత్తరం

దిల్లీ ఏడు స్థానాల్లో నూ హోరాహోరీ
బరిలో బాక్సర్‌ విజేందర్‌, క్రికెటర్‌ గంభీర్‌

ఈనాడు, దిల్లీ: దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ నేతలు.. ఎవరికివారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ఆచితూచి ఖరారు చేశాయి. చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య పొత్తు ఉంటుందని భావించినా, చర్చలు ఫలించక వేర్వేరుగానే జాబితాలు ప్రకటించాయి. ఆప్‌ మొత్తం ఏడుగురు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్‌ కూడా పేర్లన్నీ ఖరారుచేసింది. భాజపా ఇంకొక్క స్థానంలో అభ్యర్థిని ప్రకటించాలి.. 2014 ఎన్నికల్లో భాజపా ఏడు స్థానాలనూ కైవసం చేసుకుంది. వారిలో ఐదుగురికి ఈసారి అవకాశం ఇచ్చింది. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే భాజపాలో చేరిన గంభీర్‌కు పోటీ చేసే అవకాశం లభించవచ్చని ముందు నుంచీ ప్రచారం ఉంది. సోమవారం రాత్రి పొద్దుపోయాక గంభీర్‌ పేరును భాజపా అధిష్ఠానం ఖరారు చేసింది.

 

ఆప్‌ ఈసారి అందరూ కొత్త ముఖాలనే తెరపైకి తీసుకొచ్చింది. కాంగ్రెస్‌ తరఫున దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ (81) తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచారు. ఆమె ఈశాన్య దిల్లీ నుంచి పోటీచేస్తున్నారు. తొలుత ఆమె చాందినీచౌక్‌ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ వ్యాపారవర్గాలు ఎక్కువగా ఉండటం... ఆప్‌, భాజపా వ్యాపారవర్గాలకు చెందినవారిని బరిలోకి దించడంతో మరో సీనియర్‌ నేత జేపీ అగర్వాల్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇక్కడ పోటీలో నిలిపింది. దక్షిణ దిల్లీ నుంచి సజ్జన్‌కుమార్‌ సోదరుడు రమేశ్‌కుమార్‌ పేరు వినిపించినా తర్వాత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌కు ఆ స్థానంలో అవకాశం కల్పించారు.  మే 12న దిల్లీ పోలింగ్‌ జరగనుంది.

ముగ్గురు మహిళలు
ఆప్‌, కాంగ్రెస్‌, భాజపా తలో మహిళకు టికెట్లిచ్చాయి. షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌), ఆతిషి (ఆప్‌), మీనాక్షి లేఖి (భాజపా)కు టికెట్లు దక్కాయి. దాంతో మూడు పార్టీలు మహిళా ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.

నామపత్రాల దాఖలు
భాజపా అభ్యర్థులు హర్షవర్ధన్‌, మనోజ్‌తివారీ, పర్వేశ్‌వర్మ సోమవారమే నామపత్రాలు దాఖలు చేయగా రమేశ్‌బిదూరి మంగళవారం దాఖలుచేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆప్‌ అభ్యర్థులు ఆతిషి, దిలీప్‌పాండే, గుజ్జన్‌సింగ్‌, రాఘవ్‌చద్దా, బ్రిజేష్‌గోయెల్‌, పంకజ్‌గుప్తా సోమవారం దాఖలు చేయగా బల్బీర్‌సింగ్‌ మంగళవారం దాఖలు చేయనున్నారు.


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net