close

కథనాలు

నర్మదా తీరాన.. సమస్యల థిల్లాన

ఛోటా ఉదయ్‌పుర్‌లో కాషాయ పార్టీకి ఎదురు గాలి

హెలిప్యాడ్‌ ఉంది. నాలుగు లేన్ల రోడ్డుంది. తల పైకెత్తి చూస్తే... 182 మీటర్ల ఎత్తయిన ప్రపంచ ప్రఖ్యాత సర్దార్‌ పటేల్‌ విగ్రహం! కానీ దాని నీడపట్టున ఉంటున్నామని తలెత్తి గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి  నర్మదా ఆనకట్ట తీరపు ఛోటా ఉదయ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల దుస్థితిది! భాజపా పాలనతో తాము సంతోషంగా లేమని తెగేసి చెబుతున్న స్థానిక గిరిజనులు... ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

కేవడియా (గుజరాత్‌): గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పుర్‌... గిరిజనుల సీటు. జనాభా సుమారు 16 లక్షలు. నర్మదా జిల్లా కేవడియాలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన భారీ పటేల్‌ విగ్రహమున్నది ఈ నియోజకవర్గం పరిధిలోనే. విగ్రహమే కాదు... దీనికి అనుబంధంగా మరిన్ని ప్రాజెక్టులు చేపడతామనీ, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు కూడా. కానీ స్థానికులు మాత్రం ఇందుకు భిన్నమైన స్వరాన్ని వినిపిస్తున్నారు. ‘ప్రాజెక్టులతో మా ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతోందని బయటివారు అనుకోవడం తప్పితే... మాకు ఒరిగిందేమీ లేదు’ అంటూ వాపోతున్నారు.

మా బతుకులను ఏ(ం)మార్చారు!
‘‘మా పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది. తాగునీటి కోసం అల్లాడుతున్నాం. సరైన వైద్య సదుపాయాల్లేవు. నిరుద్యోగ సమస్య ఉండనే ఉంది. నిర్మాణాలపై దృష్టి తప్ప మా సమస్యల పరిష్కారానికి భాజపా సర్కారు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఇదిగో ఈ హెలిప్యాడ్‌ చూడండి. ప్రముఖుల కోసం మా ఊరిలో దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో మాకేం పని? ఇదేమన్నా మా కడుపు నింపుతుందా? పటేల్‌ విగ్రహాన్ని మా ఊరిలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం మాకు అక్కడ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడేమో ఔట్‌ సోర్సింగ్‌ సంస్థే అక్కడ నియామకాలు చేపడుతోంది. మావాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారు. అదీ నెలంతా కష్టపడితే రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకూ ఇస్తున్నారు. పైపెచ్చు మా వాళ్లకు మరుగుదొడ్లను కడగండని చెబుతున్నారు. ఏ గిరిజనుడూ ఇప్పటివరకూ ఆ పనులు చేసి ఎరగడు. అభివృద్ధి అంటే ఇదా? ఇలాంటి అభివృద్ధి వల్ల మాకు ఒరిగేదేంటి?’’ అంటూ కేవడియాకు చెందిన 29 ఏళ్ల యువరైతు ఉమాంగ్‌ ఆవేదన వెళ్లగక్కాడు. ప్రాజెక్టులు తెచ్చామని ప్రభుత్వం చెబుతోందిగానీ... పొట్ట నింపుకోవడానికి పనులు దొరక్క తమ వాళ్లు ఉపాధిని వెతుక్కుంటూ సూరత్‌ వెళ్తున్నారని మరో యువకుడు రంజిత్‌ తడ్వీ చెప్పాడు. ఈసారి భాజపాకు ఓటు వేసేది లేదంటూ విగ్రహ పరిసర గ్రామాల్లోని గిరిజనులు తెగేసి చెబుతున్నారు.

ఎందుకు ఓటు వేయాలి?
‘‘విగ్రహానికి సమీపంలో 7 వేల మందిమి నివసిస్తున్నాం. ఆ ప్రాజెక్టుతో మాకు సంతోషమన్నదే లేదు. దాని కోసం చాలామంది భూములు కోల్పోయారు. నర్మదా ఆనకట్టకు పక్కనే ఉన్నామని అనుకోవడం తప్పితే మాకు తాగడానికి మంచినీళ్లు కూడా కరవే’’ అని గోరా గ్రామానికి చెందిన గిరిజనుడు రామకృష్ణ తడ్వీ చెప్పాడు. విగ్రహ పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు చేపడుతున్న ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న డా.ప్రఫుల్‌ వాసవా కూడా భాజపా సర్కారుపై మండిపడ్డారు.   ‘దబోయీ-పటేల్‌ విగ్రహ ప్రాంతాల మధ్య నాలుగు లేన్ల రహదారిని వేసింది పర్యాటకుల కోసం. దీనివల్ల గిరిజనులకు ఒరిగిందేం లేదు. పైపెచ్చు ఈ రోడ్డు కోసం వాళ్లు భూముల్ని కోల్పోయారు’ అని ఆయన పేర్కొన్నారు.

మార్పును స్వాగతించాలి
గిరిజనులు వాస్తవాలను అంగీకరించాలని, పరిస్థితులను బట్టి వారు కూడా మారాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘పటేల్‌ విగ్రహ పరిసరాల్లో చాయ్‌, టిఫిన్లు అమ్ముకుంటూ సుమారు 500 మంది జీవనోపాధి పొందుతున్నారు. భద్రత, పారిశుద్ధ్య విభాగాల్లో మరో 400 మందికి కొలువులొచ్చాయి. నేను కూడా పటేల్‌ ప్రాజెక్టులో క్లర్కుగా పనిచేస్తున్నా’’ అని మహేశ్‌ తడ్వీ పేర్కొన్నాడు. ప్రాజెక్టుల కారణంగా పరిసర స్థలాల ధరలు భారీగా పెరిగాయనీ, ఆహార పదార్థాల విక్రయాలతో దుకాణదారులు రోజూ రూ.500కు తక్కువ కాకుండా సంపాదిస్తున్నారని ఓ టీ దుకాణం యజమాని అర్వింద్‌ సాగర్‌ చెప్పాడు.

గెలిచేదెవరో...

ఛోటా ఉదయ్‌పుర్‌ గతంలో కాంగ్రెస్‌కు కంచుకోట. ఏకబిగిన ఆరు సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఆ తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. 2009, 2014లో భాజపా అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఇప్పుడు అక్కడి నుంచి భాజపా తరఫున గీతా రాఠ్వా, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌ రాఠ్వా తలపడుతున్నారు. గెలిచేది తామేనని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా... స్థానికుల మనసులో మాటేమిటో తెలిసేది ఫలితాల నాడే! మూడో దశలో భాగంగా మంగళవారం ఈ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది.

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net