close

తాజా వార్తలు

దిల్లీ వాయువ్యం నుంచి ప్రముఖ గాయకుడు 

దిల్లీ: మరికొన్ని గంటల్లో దిల్లీలో నామినేషన్లకు గడువు ముగియనున్న తరుణంలో భాజపా అనూహ్య నిర్ణయం తీసుకుంది. దిల్లీ వాయువ్య స్థానం నుంచి ప్రముఖ గాయకుడు హన్స్‌ రాజ్‌ హన్స్‌ను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌కు పార్టీ టికెట్‌ నిరాకరించింది. అంతకుముందు ఈ సీటు కేటాయింపు విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు టికెట్‌ దక్కదన్న సంకేతాలు అందుకున్న ఉదిత్‌ రాజ్‌ సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయానికి తన మద్దతుదారులతో చేరుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. టికెట్‌ కేటాయించని పక్షంలో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా బరిలోకి దిగుతానని తెలిపారు. ఈ విషయంపై పార్టీ తన అభిప్రాయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకల్లా తెలపాలంటూ గడువు విధించారు. దీంతో ఈ విషయంలో తర్జనభర్జనలు పడ్డ పార్టీ ఎట్టకేలకు హన్స్‌ రాజ్‌నే బరిలోకి దింపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోదీని కలవడానికి ప్రయత్నించినప్పటికీ అందుకు అవకాశం ఇవ్వలేదని ఉదిత్‌ రాజ్‌ ఆరోపించారు. 2014 ఫిబ్రవరిలో తన ఇండియన్‌ జస్టిస్‌ పార్టీని ఆయన భాజపాలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

దేశ రాజధాని దిల్లీలో ఈసారి పోరు రసవత్తరంగా ఉండునుంది. ఆప్‌, కాంగ్రెస్‌, భాజపా మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ తరఫున షీలాదీక్షిత్‌, అజయ్‌మాకెన్‌, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ లాంటి ప్రముఖులు బరిలోకి దిగుతుండగా.. భాజపా నుంచి మీనాక్షి లేఖి, మనోజ్‌తివారీ, హర్షవర్ధన్‌, మాజీ క్రికెటర్‌ గంభీర్‌ లాంటి వ్యక్తులు తలపడనున్నారు. ఏడు లోక్‌సభ నియోజకవర్గాలున్న దిల్లీలో మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net