close

తాజా వార్తలు

ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదు:మోదీ

కేంద్రపారా: రెండు విడతల ఎన్నికల పూర్తయిన తరవాత ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భాజపాకు పెరుగుతున్న ఆదరణ వారికి ఓ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఒడిశాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 కంటే కూడా భాజపా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు దశల ఎన్నికలు పూర్తయిన అనంతరం ప్రజలు భాజపావైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఐదేళ్లలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. 

రాజకీయంగా తమని ఎదుర్కోలేక కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్షాలు ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా వారికి గుణపాఠం చెబుతారన్నారు. కేంద్రంతో పాటు ఒడిశాలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ప్రజల్ని దోచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. అభివృద్ధిని ఎప్పుడో గాలికొదిలేశారన్నారు. రాష్ట్ర ప్రజలు ఇక బిజు జనతా దళ్‌ పార్టీని అధికారం నుంచి సాగనంపుతారని అభిప్రాయపడ్డారు. మూడో విడతలో భాగంగా మంగళవారం ఆరు లోక్‌సభ స్థానాలతో పాటు 42 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. అంతకుముందు మోదీ తన సొంత రాష్ట్రంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net